హైదరాబాద్

సర్కారు దవాఖానాల్లో రక్షణ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: అపస్మారక స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వైద్యం కోసం వస్తే అదీ దక్కదు. పైగా కాపాడండి అంటూ ప్రాదేయపడినా అడుగడుగునా చీదరింపులు, చీవాట్లు. ఇదీ నగరంలోని సర్కారు ఆసుపత్రుల పనితీరు. అత్యవసర పరిస్థితుల్లో సర్కారు ఆసుపత్రికి వెళితే ప్రాణాలతో తిరిగిరారు అన్న అప్రతిష్టను సైతం ఈ ఆసుపత్రులు మూటగట్టుకున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావటం వంటి కారణం కొన్ని కేసులకే పరిమితం కాగా, సర్కారు ఆసుపత్రుల్లో సంభవించే మరణాలకు ఎక్కువ సిబ్బంది నిర్లక్ష్యం, కాసుల కక్కుర్తే ఎక్కువ కారణమవుతోంది. ఈ రకంగా వరుసగా మరణాలు సంభవించినపుడు వైద్యులపై దాడులు జరుగుతున్నాయంటూ, వారి రక్షణ కోసం ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న ప్రభుత్వం అపుడే పుట్టిన నవజాత శిశువుల పరిరక్షణ, భధ్రత కోసం చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమవుతోందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వాసుపత్రుల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సర్కారు పర్యవేక్షణ లోపం కారణంగా రోగులకు కనీస భద్రత కరవైంది. భద్రత లేని వార్డుల్లో చిన్నారుల పరిరక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. చేతులు తడిపితే చాలు ఎవరినైనా సిబ్బంది లోనికి అనుమతించటం పరిపాటైపోయింది. రోగులకు చెందిన విలువైన వస్తువులను తస్కరించటం, ప్రశ్నిస్తే బాధితులనే బాధ్యులను చేసి మాట్లాడటం వంటి ఘటనలు గతంలో అనేక చోటుచేసుకున్నాయి. ఆసుపత్రిలోని సిబ్బంది విధి నిర్వహణ నిర్లక్ష్యం, లంచగొండి తనం కారణంగా గతంలో శిశువుమార్పిడి ఘటనలు జరగ్గా, తాజాగా జరిగిన శిశు అపహరణ ఘటన చర్చనీయాంశంగా మారింది. పేదలకు వైద్యం, మెరుగైన సదుపాయాలంటూ ఏటా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలను కేటాయిస్తున్నా, సర్కారు వైద్యంలో రవ్వంత కూడా మార్పు రావటం లేదు. పైగా ఏటా కేటాయిస్తున్న నిధులన్నీ ఏమవుతున్నాయన్నది కూడా మిస్టరీగానే మారింది. తాజాగా రెండురోజుల క్రితం నిలోఫర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న శిశువు అపహరణ కేసు మిస్టరీ ఇంకా వీడనేలేదు. పండంటి బిడ్డను కన్నామని మురిసిపోయిన ఈ తల్లిదండ్రుల ఆనందం కేవలం గంటల వ్యవధిలోనే అవిరైపోయింది. బిడ్డ ఆచూకీ తెలిసే దాక, ఆసుపత్రి ఆవరణలో ఉంటామని, తమ బిడ్డతోనే కలిసి ఇంటికెళ్తామని ఆ తల్లిదండ్రులు భీష్మించుకున్నారు. సోమవారం ఆందోళనకు కూడా దిగటంతో పోలీసులు వారికి సర్దిచెప్పారు. శిశు అపహరణ ఘటనకు సంబంధించి రోగులు, వారి సహాయకుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆమె ఎవరు?
ఆయాగా పరిచయమై, కేవలం టీ తాగి వచ్చే లోపు బిడ్డను అపహరించుకుపోయిన కిడ్నాపర్ ఎవరు? ఆమె తరుచూ ఆసుపత్రికి ఎందుకు వస్తోంది? ఆసుపత్రిలో ఎవరెవరితో ఆమెకు సంబంధాలున్నాయన్న విషయం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. నిందితురాలిని గుర్తించేందుకు సిసి ఫుటేజీ సహాయాంతో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నాపర్ ముఖం స్పష్టంగా రికార్డు కాకపోవటం, పలు చోట్ల సిసి కెమెరాలు పనిచేయకపోవటం వంటివి పోలీసుల విచారణకు అడ్డంకులుగా మారాయి. అయితే కిడ్నాపర్‌గా భావిస్తున్న మహిళ గతంలో కూడా ఈ శిశువు అపహరణ కేసుతో సంబంధం ఉందని, తరుచూ నిలోఫర్ ఆసుపత్రికి రాకపోకలు సాగిస్తూ ఉంటుందని కొందరు రోగులు, వారి సహాయకులు వెల్లడించటంతో కిడ్నాపర్‌కు ఆసుపత్రిలోని సిబ్బందికి ఏమైనా సంబంధాలున్నాయా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.