హైదరాబాద్

రైతులపై ఇంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెటింగ్, సింగిల్‌విండో అధికారులపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం
ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు * చార్జి మెమోలు జారీ చేయాలని ఆదేశం

షాద్‌నగర్, డిసెంబర్ 13: మార్కెటింగ్ శాఖ అధికారులపై మంత్రి హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, సింగిల్ విండో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఎంతమంది రైతులు మొక్కజొన్నలు తీసుకువచ్చారు.. ఎన్ని క్వింటాళ్లు కొనుగోలు చేశారు.. ఎంతమంది రైతులకు బిల్లులు చెల్లించారు.. ఆలస్యానికి గల కారణాలు ఏమిటి’ అని మంత్రి హరీష్‌రావు అధికారులను ప్రశ్నించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు అధికారుల వద్ద సరైన సమాధానాలు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘561 మంది రైతులు మొక్కజొన్నలు తీసుకువస్తే 100 మంది రైతులకు బిల్లులు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. 461 మంది రైతుల బిల్లుల చెల్లింపులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు.. మార్కెటింగ్ శాఖలో నిధులు లేవా?’ అని ప్రశ్నించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు సరైన సమాదానాలు చెప్పకపోవడంతో సింగిల్ విండో సీఈవో వెంకటయ్య, షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రవీందర్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు చేశారు. రైతుల బిల్లుల పట్ల నిర్లక్ష్యం వహించిన జిల్లా మార్కెటింగ్ అధికారిణి ఛాయదేవి, జిల్లా మార్క్‌ఫెడ్ అధికారిణి జ్యోతి, జిల్లా కోఆపరేటీవ్ అధికారిలకు ఇంక్రిమెంట్‌తోపాటు చార్జి మెమోలు జారీ చేయాలని మంత్రి హరీష్‌రావు ఉన్నతాధికారులను అదేశించారు. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పెండింగ్‌లో ఉన్న 461మంది రైతులకు రెండు రోజుల్లో 4.83 కోట్లు చెల్లంచాలని మార్కెటింగ్ శాఖ అధికారులను అదేశించారు. ఈనెల 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన బిల్లుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని, సంబంధింత శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించాలని సూచించారు.

ఆక్రమణల తొలగింపులో
ఒత్తిళ్లను పట్టించుకోవద్దు
* నాలాల విస్తరణలో మీదే కీలక పాత్ర
* కొత్త యువ ఇంజనీర్లకు మేయర్ హితవు
* యజమానులకు నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: జనాభాకు తగిన విధంగా వౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా సాగుతున్న హైదరాబాద్ నగరంలో నాలాల విస్తరణ, అక్రమ కట్టడాల నివారణలో మీరే కీలక పాత్ర పోషించాలని మేయర్ బొంతు రామ్మోహన్ కొత్తగా వచ్చిన యువ ఇంజనీర్లకు సూచించారు. ఆక్రమణలపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా, పట్టించుకోకుండా వీటిని తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. ఔట్‌సోర్సు ప్రాతిపదికన నియమితులైన ఈ ఇంజనీర్లలో టౌన్‌ప్లానింగ్ విభాగానికి కేటాయించిన వంద మంది ఇంజనీర్లతో మేయఱ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గ్రేటర్ ప రిధిలో నాలాల ఆక్రమణలకు సంబంధించి అత్యంత తీవ్రంగా ఉన్న 738 అక్రమ నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన తొలగించడానికి ప్రత్యేక కార్యచరణను సిద్దం చేశామని, దాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకే కొత్తగా ఇంజనీర్లను నియమించినట్లు ఆయన తెలిపారు.
నాలాలపై ఉన్న ఆక్రమణల తొలగింపునకు చేపట్టాల్సిన సర్వే, తగు ప్రణాళికలు రూపొందించే విషయంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. నాలాల విస్తరణ సందర్భంగా నష్టపోయే నిర్మాణాలకు నిబంధనలను అనుసరించి నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వ అంగీకరించిందని తెలిపారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాల వల్ల కేవలం కొద్ది మంది చేపట్టిన అక్రమ నిర్మాణాల కారణంగా లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారని ఆయన వివరించారు. దీని వల్ల నగర ప్రతిష్టపై ప్రతికూల పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. హైదరాబాద్ నగరవాసులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నదే జీహెచ్‌ఎంసీ ప్రధాన ధ్యేయమని ఈ విషయంలో చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఇంజనీర్లకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆహ్వానితులే వచ్చేలా చూడాలి
* ప్రపంచ తెలుగు మహాసభలపై సమీక్షలో కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: లాల్‌బహద్దూర్ స్టేడియంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానితులైన తెలుగు పండితులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, సాహితీవేత్తలు, కళాకారులు, సాహిత్యంతో పరిచయముండి, ఆహ్వానించిన వారు మాత్రమే హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖదేనని కలెక్టర్ యోగితారాణా సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లాతరపున చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం ఆమె కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి డీఆర్‌ఓతో కలిసి విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడతిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి తెలుగు సభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత మరందరిపై ఉందని గుర్తుచేశారు. ఈ సభల ప్రారంభ, ముగిం సమావేశాలకు జిల్లా నుంచి హాజరయ్యే తెలుగు పండితులు, లెక్చరర్లు, సాహితీ ప్రముఖులు, ఆయా రోజుల్లో ఖచ్చితంగా ఏర్పాటు చేసిన బస్సుల ద్వారానే వేదిక వద్దకు రావాలని ఆమె సూచించారు. ప్రారంభం, ముగింపు సమావేశాలకు ప్రముఖులు వస్తున్నందున స్టేడియంలో పార్కింగ్ స్థలం లభ్యమనడటం కష్టమని, అందువల్ల అందరూ బస్సులో వస్తే బాగుంటుందని సూచించారు. వాహనాల పార్కింగ్‌కు సంబంధించిన అంశాలను పర్యాటక శాఖ కమీషనర్‌తో సంప్రదించి తెల్సుకోవాలని ఆమె సూచించారు.
విద్యాశాఖపై సమీక్ష
ఈ సమీక్షలో భాగంగా కలెక్టర్ విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. పదవ తరగతి స్పెషల్ క్లాసులపై సమీక్షిస్తూ ఆమె ఇప్పటి వరకు గుర్తించిన స్లో లర్నర్లకు సంబంధించి మ్యాచింగ్ బ్యాచింగ్, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
స్పెషల్ క్లాసులు ఎక్కడ నిర్వహిస్తారో ఈ విషయాన్ని డిప్యూటీ డీఈఓ, హెడ్ మాస్టర్లు కలిసి నిర్ణయించుకోవాలని అన్నారు. అదే విధంగా ప్రత్యేక తరగతుల దృష్ట్యా విద్యార్థులకు ఇవ్వాల్సిన అల్పాహారాన్ని కూడా ఖరారు చేయాలని, ఇందుకు నిధులను తాము సమకూరుస్తామని అన్నారు. ఈ ప్రతి స్లో లర్నర్ తప్పకుండా స్పెషల్ క్లాసులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్లు, డిప్యూటీ డీఈఓలకేదని అన్నారు. వారితో పాటు నార్మల్ స్టూడెంట్లు కూడా హాజరయ్యేలా చూడాలన్నారు.
ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పకుండా పెరగాలని ఆదేశించారు. స్కూల్ మానిటరింగ్ కమిటీ సమావేశాల నిర్వహణపై సమీక్షిస్తూ కలెక్టర్ తక్కువ సంఖ్యలో తల్లిదండ్రులు హాజరయ్యే పాఠశాలల, అధిక సంఖ్యలో హాజరయ్యే పాఠశాలల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మలో పంపాలని ఆదేశించారు. పదవ తరగతి ఫలితాల మెరుగు కోసం ఏర్పాటు చేసిన కిమటీ స్పెషల్ క్లాసులు ప్రారంభమైన తర్వాత విద్యార్థుల ప్రతిభపై ప్రతి వారం నివేదికలు అందజేయాలన్నారు. అదే విధంగా సోమవారం పరీక్షలపై ఏ స్కూల్‌లో ఏ మేరకు పురగతి ఉందో తెలియజేస్తూ విశే్లషణా నివేదక ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ సరళావందనం, డిప్యూటీ డీఈఓలు తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్ శివారులో రేవ్ పార్టీ
* యువతీ యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శంషాబాద్, డిసెంబర్ 13: శంషాబాద్ శివారు ప్రాంతమైన ధర్మగిరి దేవాలయానికి వెళ్లే రోడ్డు సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు బట్టబయలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి రేవ్ పార్టీలో భాగంగా 13మంది యువకులు మద్యం సేవించి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పహడీషరీఫ్ ప్రాంతవాసులుగా గుర్తించారు. కాగా, భయానికి గురైన అదే ప్రాంతానికి చెందిన యువతులు.. ఆటోడ్రైవర్ రాజుతో తిరిగి వెళ్లిపోదామని చెప్పడంతో తిరుగు ప్రయాణమవుతుండగా మద్యం తాగిన యువకులు వెంబడించారు. ఆటోడ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న మొబైల్ పోలీసులు గుర్తించి ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలువురు పరారీ కాగా ఎనిమిది మంది యువకులు, ముగ్గురు యువతులను పోలీసులు అదుపులో ఉన్నారు. పూర్తి వివరాలు గురువారం ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడిస్తామని ఆర్‌జీఐఏ సీఐ మహేష్ తెలిపారు.
చిన్నారిపై లైంగిక దాడి..
బండరాయితో మోది హత్య
నార్సింగి, డిసెంబర్ 13: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఐదు సంవత్సరాలు చిన్నారిని చాక్‌లెట్ ఇప్పిస్తానని ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి బండారాయితో మోది హత్య చేసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ ఏసీపీ కథనం మేరకు.. ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ ప్రసన్న దంపతులు పిల్లలతో రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని నెక్నాంపూరా గ్రామంలోని అర్యమిత్ర రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మిస్తున్న భవనంలో గత కొంత కాలం నుంచి కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే, ఇందులోనే మధ్యప్రదేశ్‌కు చెందిన కాశీరామ్ దరణి కుమారుడు దినేష్‌కుమార్ దరణి (23) కూడా కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం చాక్‌లెట్ ఇప్పిస్తానని తెలిపి ప్రసన్న ఐదు సంవత్సరాల కుమార్తెను కిరాణా షాపునకు తీసుకవెళ్లి, అక్కడి నుంచి చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి చిన్నారిపై ఆత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు రాకుండా ఆ చిన్నారిని బండారాయితో మోది హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా తిరిగి వచ్చాడు. అయితే, ‘పాపను కిరాణా షాపునకు తీసుకవెళ్లావు, ఏమైందని’ గట్టిగా ప్రశ్నించగా జవాబు తెలుపలేదు. దీంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా దినేష్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడిందని ఏసీపీ తెలిపారు. వెంటనే హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్‌ను విస్మరించారు
* కళాకారులపై రాజకీయ కక్ష సరికాదు
* తెలుగు మహాసభల నిర్వహణపై టీడీపీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: తెలుగు భాషా గొప్పతనాన్ని, జాతీ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక్క స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయకపోవటం దారుణమని టీడీపీ నగర అధ్యక్షుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్‌టీయుసి రాష్ట్ర అధ్యక్షుడు బీ.ఎన్.రెడ్డి మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కళలు, సాహితీ ప్రముఖులు హాజరయ్యే మహాసభలకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను గమనిస్తే అవి ప్రపంచ మహాసభలుగా కన్పించటం లేదంటూ, అవి కరీంనగర్, సిద్దపేట తెలుగు మహాసభలుగా కన్పిస్తున్నాయని విమర్శించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగానే గాక, మహానటుడిగా తెలుగు భాష, తెలుగుజాతీ గొప్పతనాన్ని ఖండాంతరాలకు చాటారని, ఆయన పేరిట కనీసం ఒక్క స్వాగత తోరణాన్ని, సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేయకపోవటం ఆయన రాజకీయ నేత అయినందుకు ప్రభుత్వం కక్ష్య సాధిస్తుందని విమర్శించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడే రాష్ట్రం ఒకటి ఉందని, తెలుగు భాషలో ఎన్నో అణిముత్యాల్లాంటి సినిమాలొచ్చాయన్న విషయం ప్రపంచానికి తెలిసిందన్న విషయాన్ని సర్కారు మర్చిపోయిందని వారు మండిపడ్డారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి రాజకీయ నాయకుడే అయినా, రాజకీయ కోణంలో చూడకుండా ఆయన తెలుగు భాష, జాతికి చేసిన సేవలను, అలాగే తెలుగు సినీ రంగంలో ఆయన ఓ గొప్ప నటుడన్న విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా ఎన్టీఆర్ పేరిట ప్రపంచ తెలుగుమహాసభలో వేదికను ఏర్పాటు చేయాలన్నారు.

అద్దె ఇల్లు సాకుతో.. గొలుసు అపహరణ
మేడ్చల్, డిసెంబర్ 13: అద్దె ఇల్లు సాకుతో వృద్ధ మహిళను తాడుతో బంధించి ఆమె మెడలోని బంగారు పుస్తెలాతాడు అపహరించిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కుమ్మరి బస్తీలో నివాసం ఉండే కండ్లకోయ జయమ్మ(65) వద్దకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ మహిళ వచ్చి ఇల్లు అద్దెకు ఉందా అని అడిగింది. ఉందని చెప్పడంతో సరే తమ్ముడిని తీసుకువచ్చి ఇల్లును చూస్తానని చెప్పేసి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత తమ్ముడిగా చెప్పిన వ్యక్తిని జయమ్మ వద్దకు తీసుకువచ్చి ఇల్లు చూపించండని మహిళ కోరింది. కళ్లు అంతగా కనపడవని చీకటిగా ఉందని మీరే వెళ్లి చూసుకోండని జయమ్మ చెప్పింది. అయిన వినకుండా ఆ మహిళ తనతో తీసుకువచ్చిన వ్యక్తి (తమ్ముడు).. వృద్ధురాలైన జయమ్మను ఇంటిలోనికి తీసువెళ్లి ఆ తర్వాత వృద్ధురాలిని లోపలి గదిలో బలవంతంగా ప్లాస్టిక్ తాడుతో బంధించారు. అంతలోనే ఆమె సృహా కోల్పోయింది. వృద్ధురాలి మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలాతాడును తెంపుకుని నిందితులు ఉడాయించారు. కొద్ది సేపటికి సృహాలోకి వచ్చిన వృద్థురాలు జయమ్మ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి ఆమెను బంధవిముక్తి చేశారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకట్ రెడ్డి హుటహుటిన ఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలు జయమ్మ నుంచి సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరవిభాగం ఎస్‌ఐ గ్యార పవన్ కుమార్, ఎస్‌ఐలు నాయుడు, దాసులు సంఘటన స్థలానికి చేరుకుని జయమ్మ నుండి వివరాలు సేకరించి, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రపంచంలోనే పెద్ద వ్యవస్థ ఐసీఏఆర్
రాజేంద్రనగర్, డిసెంబర్ 13: చదువుతో పాటే, సంపాదన అనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్ రెడీ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహపాత్ర అన్నారు. బుధవారం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్నాతకోత్సవ కార్యక్రమాన్ని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి ప్రారంభించారు. మహపాత్ర మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన, విస్తరణ, విద్యకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యవసాయ వ్యవస్థ భారత వ్యవసాయ పరిశోధనా మండలిలో ఉందని అన్నారు. 102 పరిశోధనా స్థానాలు, 73 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 680 కృషి విజ్ఞాన కేంద్రాలతో దేశంలో రైతాంగానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందిస్తుందని చెప్పారు. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 27 ఐసీఏఆర్ పరిశోధనా పథకాలు, రెండు నెట్‌వర్క్ ప్రాజెక్టులు, డెవలప్‌మెంట్, గ్రాంట్స్ అందిస్తున్నామని వివరించారు. 5వ డీన్ల సంఘం సిఫార్సులకు అనుగుణంగా దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న పట్ట్భద్రులను చదువుతో పాటు, సంపాదించే విధంగా తీర్చిదిద్దేందుకు స్టూడెంట్ రెడీ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నామని తెలిపారు. పరిశ్రమలలోనూ, గ్రామాల్లోనూ, అగ్రో ఇండస్ట్రీస్‌లోనూ వారికి నైపుణ్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సాగు ఖర్చులను తగ్గించడం, సమర్థ నీటి యాజమాన్యంపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో భూ సారం పెంపునకు కృషి జరుగాలని అన్నారు. వర్షాధారంపై అధికంగా ఆధారపడిన తెలంగాణలో సూక్ష్మ బిందు సేద్యం, సబ్ సర్‌పేస్, డిప్ సిస్టమ్‌ను పెద్దఎత్తున చేపట్టాలని సూచించారు. మిషన్ కాకతీయ వంటి కార్యక్రమం ద్వారా నీటి వనరుల సమర్థ వినియోగం జరుగాలని అన్నారు. ఎరువుల యాజమాన్యం, సమీకృత వ్యవసాయ పద్దతులు తెలంగాణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగు, పంట కోత అనంతర శుద్ధిపై విలువ జోడింపుతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. క్లస్టర్ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, కస్టమ్ హైరింగ్ కేంద్రాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. 2014-15, 2015-16 సంవత్సరాలకు చెందిన విశ్వవిద్యాలయ ప్రగతి నివేదికను ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్ రావు సమర్పించారు. విశ్వవిద్యాలయంలోని మూడు ప్రధాన విభాగాలైన పరిశోధన, బోధన, విస్తరణ రంగాలలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు. విద్యార్థులలో వ్యాపారం దృక్పథాన్ని పెంచేవిధంగా 5వ డీన్ల కమిటీ నివేదికను అమలు పరుస్తున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి భూసార పరీక్షా మ్యాప్‌లను రూపొందించామని అన్నారు. దీంతో భూసారం ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టవచ్చన్నారు. మొదటి స్నాతకోత్సవంలో 319 పీజీ, పీహెచ్‌డీ, విద్యార్థులు, 790 మంది యూజీ డిగ్రీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కోర్సులలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు 17 బంగారు పతకాలను ప్రదానం చేశారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఎం.శ్రావణి ఐదు బంగారు పతకాలు, దివ్యశ్రీ మూడు బంగారు పతకాలు సాధించారు. అగ్రికల్చర్ ప్లాంట్ పాథాలజీలో కేఎంఆర్ ప్రసాద్ మూడు బంగారు పతకాలు పొందారు. ముందుగా గరవ్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యఅతిథి డాక్టర్ త్రిలోచన్ మహాపాత్రకు ఆడిటోరియం ఆవరణలో ఎన్‌సీసీ విద్యార్థులు అశ్వికదళంతో ఘనంగా స్వాగతం పలికారు.

మొక్కజొన్న విక్రయాలపై మంత్రి చర్చ

షాద్‌నగర్ టౌన్, డిసెంబర్ 13: మొక్కజొన్న క్రయ విక్రయాలపై నేరుగా మంత్రి తన్నీరు హరీష్‌రావు రైతులతో చర్చించారు. బుధవారం షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రైతులతో గిట్టుబాటు ధరలపై చర్చించారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బోడజానంపేట గ్రామానికి చెందిన రైతు రాములు 50 సంచుల మొక్కజొన్నను విక్రయించేందుకు షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే డబ్బులు ఆలస్యంగా ఇస్తున్నారే విషయం తెలుసుకొని ప్రైవేట్ వ్యాపారులకు రూ.1320కి విక్రయించినట్లు రైతు రాములు.. మంత్రి హరీష్‌రావుకు వివరించారు. ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు మద్దతు ధర రూ.1425 చెల్లిస్తుంటే తక్కువ ధరకు ఎలా విక్రయించావని రైతు రాములును ప్రశ్నించగా, అధికారులు సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదని, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తే త్వరగా డబ్బులు వస్తాయని అమ్మినట్లు వివరించారు. దాంతో మంత్రి స్పందిస్తూ రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారికి నష్టాలు కలిగించడం సరైన పద్ధతి కాదని మార్కెటింగ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు, కార్యకర్తల
మధ్య తొపులాట
భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తొపులాట చోటు చేసుకుంది. సమావేశంలోకి అధికారులను, మీడియాను మాత్రమే అనుమతించాలని స్వయంగా మంత్రి పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు ఎవరిని అనుమతించకపోవడంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకొని తొపులాట జరిగింది. దాంతో నేతలు జోక్యం చేసుకొని కార్యకర్తలకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు.

పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు
నిర్వహించాలి: కలెక్టర్ యోగిత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: జిల్లా రాష్ట్ర బాలస్వాస్థ కార్యక్రమం(ఆర్‌బీఎస్‌పి) బృందాలు హైదరాబాద్ జిల్లాలోని ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. అంతేగాక, త్వరలోనే నగరంలోని అన్ని పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ హాజరువిధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్‌బీఎస్‌పి కో ఆర్డినేటర్, సీడీపీఓలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 28 ఆర్‌బీఎస్‌పీ బృందాలు ఉన్నాయని, ఈ బృందాలు విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖలతో కలిసి పూర్తి సమన్వయంతో తమ సేవలను పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు అందజేయాలని ఆదేశించారు. ఏ పాఠశాలకు ఆర్‌బీఎస్‌పి బృందాలు స్క్రీనింగ్ పరీక్షలకు వెళ్తుందో ఆ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రానికి ముందుగానే సమాచారం అందజేయాలని అన్నారు. దగ్గరిలోని బస్తీల్లో గల పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా మూడు శాఖల సిబ్బంది సమన్వయంగా మ్యాచింగ్ బ్యాచింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో మహిళా శిశు అభివృద్ధి శాఖ నుంచి సీడీపీఓ జ్యోత్స్న, విద్యాశాఖ నుంచి ఏడీ జగన్నాథం, ఆర్‌బీఎస్‌పీ సహాయంతో సమన్వయం చేస్తూ, స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని అన్నారు. అవసరమైన పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల మ్యాచింగ్, బ్యాచింగ్ ఈ నెల 18 కల్లా పూర్తి చేయాలని, క్యాంపుల నిర్వహణపై సీడీపీఓలు, ఆర్‌బీఎస్‌లు, డిప్యూటీ డీఈఓలకు ఈ నెల 21న శిక్షణ ఇస్తామని చెప్పారు. తాము శిక్షణ పొందిన తర్వాత శిక్షణా అంశాలను సీడీపీఓలు తమ సూపర్‌వైజర్లకు డిప్యూటీ డీఈఓలు క్లస్టర్ హెడ్‌మాస్టర్లకు ఈ నెల 30లోపు తెలియజేయాలని అన్నారు. ఆర్‌బీఎస్‌లు, హెచ్‌ఓలు, పారా మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన స్క్రీనింగ్‌లో శస్తచ్రికిత్సలు, ఇతరాత్ర చికిత్సలు అవసరమని గుర్తించిన కేసులకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. రిజిష్టర్లన్నీ అప్‌డేట్‌గా నిర్వహించాలని బృందాలకు సూచించారు.స్క్రీనింగ్ క్యాంపులు జరిగేటపుడు సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు, ఆర్‌బీఎస్‌లు హాజరు నమోదు చేసి జిల్లా టెలిగ్రామ్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. మండల స్థాయిలో కూడా పూర్తి స్థాయి కన్వర్జెన్స్ ఉండాలని, జిల్లా బృందంలో మాదిరి, బీఆర్‌ఎస్, సీడీపీఓ, డీఈఓల నుంచి ఒక్కోక్కరు చొప్పున మొత్తం ముగ్గురితో బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. వచ్చే మార్చిలోపు అన్ని పాఠశాలు, అంగన్‌వాడీ పిల్లలకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్, క్యాంపుల షెడ్యూల్‌ను ఈనెల 30లోపు ఖరారు చేయాలని ఆదేశించారు.

జిల్లా పరిషత్ భవనం ప్రారంభం

ఆంధ్రభూమిబ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ నూతన కార్యాలయం బుధవారం ప్రారంభం అయింది. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రి మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న జెడ్పి నూతన భవనం అందుబాటులోకి రావడం శుభసూచకమని అన్నారు. నూతన హంగులతో నిర్మాణం పూర్తిచేసుకున్న భవనంలో ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించి వారి అవసరాలను తీర్చాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సౌకార్యలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామాల్లో వైద్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచించారు. జిల్లాల్లో నెలకొన్న సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు అనుకూలంగా విశాలమైన భవంతి అందుబాటులోకి రావడం ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునంద రావు, పార్లమెంట్ సభ్యులు విశే్వశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచందర్ రావు, నరేందర్ రెడ్డి, సభ్యులు కాలే యాదయ్య, బీ.సంజీవ రావు, కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, జెడ్పి వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీఇఓ రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రంగారెడ్డి వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను అభివృద్ధి చేసుకుందామని మంత్రి మహేందర్ రెడ్డి సూచించారు. బుధవారం ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలోని జెడ్పీ నూతన సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ సునితా మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సర్వసభ్య సమావేశంలో జిల్లాల వారీగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్టు వ్యవసాయ అధికారి గీతారెడ్డి తెలిపారు. దశల వారీగా రసాయ ఎరువుల వాడకాన్ని తగ్గించే అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ సక్రమంగా అందడం లేదని సభ్యులు ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం రైతులకు అందించడంలో విఫలం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జోక్యం చేసుకొని అర్హులైన వారందరికీ సబ్సిడీ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు ఎంత మందికి ఇన్సూరెన్స్ అందించారని సభ్యులు అధికారులు నిలదీశారు. వెంటనే జిల్లాల వారీగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారికి సహాయం అందేలా చూడాలని సూచించారు. మూడు జిల్లాల పరిధిలో రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉందని, పరిగి - నస్కల్, లింగాపూర్, హయత్‌గర్, శంకర్‌పల్లి రోడ్డు, కేశవాపూర్ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాటని ఎప్పుడు సరిచేస్తారని అధికారులను సభ్యులు నిలదీశారు. టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా రోడ్లు మాత్రం బాగుపడటం లేదని వాపోయారు. సాధ్యమైనంత త్వరగా రోడ్లను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేకుండా పోయిందని, వివిధ శాఖల అధికారులు అడ్డుపడుతూ నిర్మాణాలను నిలిపివేస్తున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఉన్న పాత ఇంటిని కూల్చివేసి నూతన గృహాన్ని నిర్మించేవారిపై కూడా కనికరం చూపించడం లేదని వాపోయారు. దీనిపై అన్ని శాఖల అధికారులతో చర్చించి ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. శామీర్‌పేటలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని గత మూడేళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని జెడ్పీటీసీ బాలేష్ వాపోయారు. సదరు నిర్మాణదారులకు అడ్డుకోవడంలో ఎందుకు తాత్సారం వహిస్తున్నారంటూ నిలదీశారు. జోక్యం చేసుకున్న మేడ్చల్ కలెక్టర్ ఎంవి.రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. అక్రమాలు చాలా కాలంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం వాటిని నిలిపివేసేందుకు ఎంతో కృషి చేస్తున్నామని ఎంవీ రెడ్డి స్పష్టం చేశారు. విచారణ అనంతరం నిర్మాణాలు అక్రమమని తేలిన వెంటనే కూల్చివేతలు చేపట్టక పోతే క్రింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లాల్లో మైనింగ్ నుంచి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మైనింగ్ నుంచి రూ.35కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని, కాగా తాము రూ.80 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జిల్లాల్లో అక్రమ మైనింగ్ పాల్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు దారుణంగా మందని సభ్యులు సభ దృష్టికి తీసుకువెళ్లారు. కందుకూరులో పీహెచ్‌సీని నిర్మించి, సిబ్బందిని నియమించక పోవడంతో నిరుపయోగంగా ఉందని అన్నారు. మంత్రి జోక్యం చేసుకొని వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో చర్చించి నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సకాలంలో రావడం లేదని, దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి విన్నవించారు. అలాంటివి జరగకుండా చూడాలని జిల్లా వైద్యులను మంత్రి ఆదేశించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, నిబందనలు లేకున్నా పూచీకత్తు సంతకాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఎంవి రెడ్డి రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న బ్రాంచ్ మేనేజర్లను గుర్తించి తమ దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి వారిపై చర్యలు తీసుకునేలా చేద్దామని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా అందుబాటులో ఉండాలని, వారు అడిగిన సమాచారాన్ని అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అందరం సమష్టిగా శ్రమించి జిల్లాల అభివృద్ధి ప్రభుత్వం నుంచి అధిక నిధులు వచ్చేలా కృషి చేద్దామని అన్నారు. కలెక్టర్లు రఘునందన్ రావు, ఎంవీ రెడ్డి, దివ్య పాల్గొన్నారు.

జనవరి 18 నుంచి వాడవాడలా తెలుగుదేశం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందనుకునే వారికి దీటుగా సమాధానం చెప్పేందుకు, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వచ్చే నెల 18న ఎన్టీఆర్ వర్థంతి రోజు నుంచి పార్టీ ఆవిర్భవ దినమైన మార్చి 29వ తేదీ వరకు నగరంలో వాడవాడలా తెలుగుదేశం పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. బుధవారం టీడీపీ నగర పార్టీ ఆఫీసులో జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నగర అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ వాడవాడలా తెలుగుదేశం కార్యక్రమానికి ముందే జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18 నుంచి ప్రతిరోజు వాడవాడలో టీడీపీ జెండాలను ఎగురవేయటం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వివరించేందుకు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేపట్టి ప్రజల్లో వెళ్లనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు, నేతలు కంకణబద్దులై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు అధినేత చంద్రబాబు నాయుడు చేసిన దశాదిశాను అనుసరించి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికలు ఎపుడొచ్చినా తమ సత్తా చాటేందుకు పార్టీని పటిష్టపర్చాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. టీడీపీ పార్టీ బలమైన, అంకితాభావం కల్గిన కార్యకర్తలున్న పార్టీ అని, నాయకులెంత మంది పార్టీని వీడి వెళ్లిన కార్యకర్తలు చెక్కుచెదరకుండా, ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నారని ఎంఎన్ వివరించారు. నగరంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడైతే ఓటరు జాబితా సవరణ పేరిట ఓటర్లను తొలగించారో, ఎక్కడైతే బోగస్ ఓట్లు నమోదు చేశారో వాటన్నింటిని సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సమావేశంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కూన వెంకటేశ్ గౌడ్, టీఎన్‌టీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.ఎన్.రెడ్డి, మహిళా నాయకురాలు షకీలారెడ్డి, నేతలు పీ.సాయిబాబా, వనం రమేష్, బజరంగ్ శర్మ, శ్రీపతి సతీష్, నల్లెల కిషోర్, ప్రదీప్ చౌదరీ, బీ.శ్యాంసుందర్, ముప్పిడి మధుకర్, రాజేందర్, అంజద్ అలీఖాన్, మహాబూబ్, పీ.లక్ష్మణ్‌యాదవ్, జ్ఞానేశ్వర్, షఫీఖ్, రఘు