హైదరాబాద్

‘తెలుగు తల్లి’కి పట్ట్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: అమ్మభాష ఆదరణ కోసం భాగ్యనగరం వేదికగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు ఆదివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 15వ తేదీన సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ఈ మహాసభలను ప్రారంభించారు. మహాసభలకు ప్రధాన వేదికలైన ఎల్‌బీ స్టేడియం, రవీంద్రభారతి, రవీంద్రభారతి సమావేశ మందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తు, మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్‌గ్యాలరీలో రెండో రోజైన శనివారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
వీటిల్లో కొన్ని వేదికల్లో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన చిత్రలేఖన, ఛాయాచిత్ర ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకోగా, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం వంటి వేదికల్లో తెలుగు సాహితీ ప్రక్రియలపై భాషా కోవిదులు, సాహితీవేత్తలు, విమర్శకుల ఇష్టాగోష్టి కార్యక్రమాలను నిర్వహించారు. రోజురోజుకి పరభాష ప్రభావం పెరిగిపోతున్న నేటి తరుణంలో మాతృభాష ఆదరణను రెట్టింపు చేసేందుకు అనుసరించాల్సిన విధానాలు, రచించాల్సిన వ్యూహాలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యంలోని పద్యం, గద్యం, కథానిక, నవలా వంటి రచన శైలిలు పూర్వవైభవాన్ని కోల్పోతున్నాయని కొందరు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
నేటి కార్యక్రమాల వివరాలు
ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం నాడు వివిధ సాంస్కృతిక వేదికల్లో జరిగే కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి. ముఖ్యంగా వీటిల్లో రవీంద్రభారతి ఆవరణలో, మాదాపూర్ చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ గ్రామసీమ అంశంపై ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇక మిగిలిన వేదికల్లోని కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
ఎల్‌బీ స్టేడియంలో..
పాల్కూరికి సోమన్న ప్రాంగణం, బమ్మెర పోతన వేదికల్లో సాయంత్రం ఐదు గంటలకు ‘వౌఖిక వాంగ్మయం భాష’ సాహిత్య సభ, ఆరున్నర గంటలకు సాంస్కృతిక సమావేశం, ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు రసమయి బాలకిషన్ సారధ్యంలో సాంస్కృతిక వారధిచే కళాప్రదర్శన, రాత్రి 8గం.ల 15 ని.లకు ముంబై బృందంచే నృత్య కళాంజలి జానపదం, ఎనిమిదిన్నర గంటల నుంచి 8గం.ల 50ని.ల వరకు మంగళచే జానపద నృత్యం, ఆ తర్వాత తొమ్మిదిన్నర గంటల వరకు జానపద జాతర వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తెలుగు వర్శిటీ ఆడిటోరియంలో...
నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బిరుదరాజు రామరాజు ప్రాంగణం, సామల సదాశివ వేదికల్లో ఉదయం పది గంటల నుంచి కథా సదస్సు, మధ్యాహ్నాం మూడున్నర గంటల నుంచి తెలంగాణ నవల సాహిత్యం, సాయంత్రం ఆరు గంటల నుంచి కథా, నవలా, రచయితల గోష్టి నిర్వహించనున్నారు.
రవీంద్రభారతి సమావేశ మందిరం..
రవీంద్రభారతి సమావేశం మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన లక్ష్మి నరసింహా శర్మ ప్రాంగణం, డా.ఇరివెంటి కృష్ణమూర్తి వేదికల్లో ఉదయం పది గంటల నుంచి జంట కవుల అష్టావధానం, మ.12.30గం.లకు అక్షరగణితావధానం, 3గం.లకు అష్టావధానం, ఐదున్నర గంటలకు నేత్రావధానం, సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీ ప్రతాపరుద్ర విజయం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రవీంద్రభారతిలో..
నగరంలోని అన్ని కళావేదికల్లో అత్యంత పేరుగాంచిన రవీంద్రభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన బండారు అచ్చమాంబ వేదికలో ఉదయం పది గంటలకు బాలకవి సమ్మేళనం, మధ్యాహ్నాం మూడు గంటలకు ‘తెలంగాణ వైతాళికులు’ రూపకం ప్రదర్శన, ఆ తర్వాత నాలుగుంటలకు ఏకపాత్రాభినయం వంటి కార్యక్రమాలుంటాయి. పైడి జయరాజు ప్రివ్యూ ధియేటర్‌లో ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి 9 గం.వరకు లఘుచిత్రాల ప్రదర్శన
ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం..
పబ్లిక్‌గార్డెన్స్‌లోని జవహర్‌బాలభవన్ ఆవరణలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవరణలోని అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం, వానమామలై వేదికల్లో ఉదయం 9 నుంచి 11 గం.ల వరకు బృహత్‌కవి సమ్మేళనం తొలి సమావేశం, 11గం. నుంచి రాత్రి పదకొండున్నర గంటల వరకు ప్రతి అరగంట విడిదితో ప్రత్యేక సమావేశాలుంటాయి.
తెలంగాణ సారస్వత పరిషత్తు..
ఆబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు ఆవరణలోని మరింగంటి పించరాచార్యుల ప్రాంగణం, శతావిధాని కోరుట్ల కృష్ణమాచార్యా వేదికల్లో ఉదయం పది గం.ల నుంచి మధ్యాహ్నాం 2గం. వరకు, తిరిగి 3 నుంచి రాత్ర ఏడు గంటల వరకు శతావధానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.