హైదరాబాద్

చెత్త మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 సర్వేకు సమయం దగ్గరపడుతోంది. అంతలోపు స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తేనే నగరానికి అగ్రస్థానం దక్కుతుందని భావించిన జీహెచ్‌ఎంసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు చెత్తను ఇంట్లోనే తడి, పొడిగా వేర్వేరు చేసేందుకు, స్వచ్ఛతపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిన అధికారులు ఇపుడు తాజాగా చెత్త మహోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కుటుంబాలను కలుపుదాం-చెత్తను విడదీద్దాం, మనం మారదాం..మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుద్దాం, చాయ్ పే చర్చ, చెత్త విడాకుల దినోత్సవం, చెత్తను విడదీస్తేలక్ష రూపాయల నగదు బహుమతి వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఇపుడు చెత్త మహోత్సవాలను నిర్వహించాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.
చెత్తను తడి, పొడిగా విడదీసి స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందించటంపై ప్రత్యేకంగా నియమించిన 3వేల మహిళా స్వచ్ఛదూత్‌లు ఇంటింటికి వెళ్లి చైతన్యవంతులను చేస్తున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే, ఈ చెత్త మహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో స్వయంగా కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయటంపై ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఇంట్లో పోగయ్యే చెత్తలో 80 శాతాన్ని తిరిగి వినియోగించుకోవచ్చునని, విరివిగా కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేయటమే ఈ చెత్త మహోత్సవాల ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు. కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో, వ్యాపారుల్లో చైతన్యం తీసుకురావటమే ఈ చెత్త మహోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం. అతి తక్కువ వ్యయం నుంచి భారీ పరిమాణంలో సేంద్రీయ ఎరువుల తయారీ యంత్రాలను గురించిన సమాచారాన్ని అందించటంతో పాటు ఈ వివరాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోనూ ప్రదర్శించనున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా తమ ఇళ్లలో పోగయ్యే వ్యర్థాల ద్వారా కంపోస్టు ఎరువులను తయారుచేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ నెల 27 నుంచి నిర్వహించనున్న చెత్త మహోత్సవాల్లో భాగంగా ఈ కంపోస్టు తయారీ బాక్స్‌లను స్వచ్ఛదూత్‌లకు అందజేయనున్నారు. తడి, పొడి చెత్తను విడదీసి స్వచ్ఛదూత్ యాప్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేసిన వారిని లాటరీ ద్వారా ఎంపికచేసి నగదు బహుమతులు అందించటం, ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ నినాదాల పోటీల్లోని విజేతలకు బహుమతులను అందించటంతో పాటు స్వచ్ఛ కార్యక్రమాలపై కళాజాతల ద్వారా సామాన్యులందరికీ అర్థమయ్యే రీతిలో ఈ మహోత్సవాల్లో ప్రదర్శనలు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.