హైదరాబాద్

శివం..శివం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరం శివ నామస్మరణతో పులకించింది. ఉపవాసదీక్షలు పాటించిన భక్తులు భక్తిశ్రద్ధలతో అద్వైతభాస్కరుడ్ని ఆరాధించారు. నగరంలోని శివాలయాల్లో తెల్లవారుఝాము నుంచే భక్తుల సందడి నెలకొంది. అంబర్‌పేట సమీపంలోని శివం, శివార్లలోని కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, నాగోల్‌లోని శ్రీకాశీవిశే్వశ్వరాలయం, బహదూర్‌పురా సమీపంలోని కిషన్‌బాగ్‌లోని శ్రీ కాశీ బుగ్గ విశే్వశ్వరాలయంలో రెండు రోజుల ముందు నుంచే శివరాత్రి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. కాశీబుగ్గ విశే్వశ్వరాలయంలో తెల్లవారుఝాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. అంతేగాక, ఈ దేవాలయ ఆవరణలో సుమారు 500 సంవత్సరాల నుంచి భూమిలో నుంచి వచ్చే గంగాజలం శివలింగానికి అభిషేకం తర్వాత పట్టుకునేందుకు భక్తులు పొటీపడ్డారు. ఎలాంటి వ్యాధులైనా నయం చేసే మహాత్మ్యం ఈ జలానికి ఉందని అక్కడి భక్తుల నమ్మకం. మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సంఖ్య మరింత రెట్టింపయ్యింది. దీక్షల్లో ఉన్న కొందరు భక్తులు దీక్షలు విరమించేందుకు కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, మరికొందరు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం, మరికొందరు శ్రీశైలం శ్రీభ్రమరాంబిక సహిత మల్లికార్జున దేవాలయాలకు పయనమయ్యారు. ఉపవాస దీక్షలను చేపట్టిన మరికొందరు భక్తులు సాయంత్రం వరకు దేవాలయాల్లోనే గడిపి ప్రత్యేక పూజల అనంతరం శివయ్యను దర్శించుకుని దీక్షలను విరమించారు. దీక్షల విరమణ తర్వాత ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఏవీ కాలేజీలో శివ దర్శనమ్ ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. పలు దేవాలయాల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచే మహాజాగరణ, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.
సనత్‌నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుఝాము నుంచే భక్తులు మహా శివున్ని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద క్యూ కట్టారు. హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని లోకాన్ని రక్షించిన సందర్భంగా జరుపుకునే శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉపవాసాలు, జగారాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. శివరాత్రి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనత్‌నగర్ హనుమాన్ దేవాలయంలో మహాశివునికి బిల్వపత్రాలు, మారేడు దళాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎర్రగడ్డ, బల్కంపేట, సంజీవరెడ్డినగర్, పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఉన్న ఆలయాల్లో నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రద్దీ అధికంగా ఉన్న ఆలయాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు.
షాద్‌నగర్: హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ రామేశ్వరం దేవాలయంలో భక్తులతో మంగళవారం తెల్లవారుజాము నుండి శివనామస్మరణ మారుమోగింది. ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎటుచూసినా భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడిపోయింది. మహా శివరాత్రి మరుసటిరోజు సాగే జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా షాద్‌నగర్ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో తరలివెళ్లి ముందుగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆనంతరం జాతర కార్యక్రమంలో నిమగ్నమవుతారు. చిన్నా.. పెద్ద అనే తారమత్యం లేకుండా కుటుంబ సమేతంగా దేవాలయానికి వెళ్లడంతోపాటు జాతరలో నెలకొల్పిన షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షాద్‌నగర్ ఆర్టీసీ డిపో నుంచి 12 బస్సులు ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. రామలింగేశ్వర స్వామివారి జాతరను తిలకించేందుకు భక్తులు ఎంతగానో ఉత్సాహం కనబరుస్తున్నారు. ప్రైవేట్ వాహనాలలో తెల్లవారుఝామునే రామేశ్వరానికి చేరుకుని కుటుంబ సమేతంగా కోనేటిలో స్నానం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో భక్తులు కొనుగోళ్లు చేశారు. భక్తుల సందర్శనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో జాతర ఘనంగా జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్, సినీ నిర్మాత బండ్ల గణేష్, ఏసీపీ సురేందర్, సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, హరిప్రసాద్ రెడ్డి, బాలరాజు, అమనగల్లు ఎస్‌ఐ మల్లేష్‌తోపాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్‌నగర్ పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, శివమారుతి దేవాలయంలో కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో, అయ్యప్ప కాలనీలోని అమృతలింగేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
షాద్‌నగర్ టౌన్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా పండ్లు పంపిణీ చేశారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ పంచాయతీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో భక్తులకు అందజేసినట్టు క్లబ్ అధ్యక్షుడు వాడకట్టు విజయ్ కుమార్ తెలిపారు.
కొత్తూరు: శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మంగళవారం శివరాత్రి పండుగను పురస్కరించుకుని మండల కేంద్రంలోని శివాలయంతో పాటు గ్రామాలలోని శివాలయాలలో కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాసదీక్ష చేపట్టిన భక్తులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలివచ్చి పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొత్తూరు, నందిగామతోపాటు ఆయా గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామాలు శివనామస్మరణతో మారుమోగాయి.
కేశంపేట: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం కేశంపేటతోపాటు కాకనూరు గ్రామంలోని శ్రీమహాలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు సాయంత్రం ఆయా గ్రామాల్లో ఉన్న శివాలయాల్లోకి వెళ్లి ఉపవాస దీక్షలు వదిలారు. మహాశివరాత్రి పర్వదినం సంధర్భంగా మండలంలోని శివాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కొందుర్గు: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలలో శైవక్షేత్రాలతో భక్తులతో నిండిపోయాయి. మంగళవారం తెల్లవారు జామునుండే శివాలయాల్లో అభిషేకాలు, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు సాయంత్రం శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు విడిచారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు అన్ని ఏర్పాటు చేశారు.
ఘట్‌కేసర్: మహాశివరాత్రి పర్వదినం లింగాల కుంట శివాలయం, పోచారంలోని శ్రీ స్పటిక లింగేశ్వరాలయం, ఎన్‌ఎఫ్‌సినగర్‌లోని శ్రీ విశే్వశ్వరగిరి క్షేత్రం, ప్రతాపసింగారంలోని శ్రీ భవానీ చంద్రవౌళీశ్వర స్వామి దేవాలయం, అవుషాపూర్‌లోని శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయాలలలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేలాది భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఉపవాస దీక్షలను విడిచారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి శివాలయంలో పూజలు జరిపారు. పోచారం స్పటికలింగేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు, యువతీ యువకులు పాల్గొన్నారు. అవుషాపూర్‌లోని శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం ఆవరణలో ఉప సర్పంచ్ ఏనుగు సుదర్శన్‌రెడ్డి నిర్మించిన ముఖద్వారాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శివాలయాలు, మల్లన్న దేవాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. కుత్బుల్లాపూర్ గ్రామంలోని శివాలయంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. షాపూర్‌నగర్‌లోని హనుమాన్ దేవాలయంలోని శివాలయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్‌నగర్, షిరిఢీహిల్స్, శివానగర్, రింగ్‌బస్తీలలోని శివాలయాల్లో స్థానిక కార్పొరేటర్ జగన్.. స్వామివారిని దర్శించుకున్నారు. నిజాంపేట్ శివాలయంలో తెరాస నియోజకవర్గం నాయకుడు కొలను శ్రీనివాస్ రెడ్డి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బాచుపల్లిలోని శివాలయంలో సర్పంచ్ ఆగం పాండు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జీడిమెట్ల డివిజన్ అంగడిపేట్‌లోని శివాలయంలో కార్పొరేటర్ కేఎం పద్మ ప్రతాప్‌గౌడ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారి సేవలో ప్రముఖులు
కీసర: స్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.లక్ష్మణ్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనిత రాజేంద్ర, సీఎం ఓఎస్‌డీ రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టీ.రమేశ్ శర్మ, ఈవో నర్సింహమూర్తి పాల్గొన్నారు.