హైదరాబాద్

అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 19: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీ జిల్లా కార్యాలయాలకు భవనాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ వెల్లడించారు. మేడ్చల్ మండలం పూడూరు అనుబంధ గ్రామమైన గోసాయిగూడలో సోమవారం మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యమాలతో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల వరకు అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాలయాలు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక పద్ధతులతో అన్ని రకాల హంగులతో జిల్లా పార్టీ కార్యాలయాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా కార్యాలయాలు కేంద్రంగా మారతాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ కార్యాలయాన్ని ఆధునిక పద్ధతిలో సువిశాలంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అత్యధిక సభ్యత్వమున్న పార్టీ అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల పార్టీగా బీజేపీ అవతరించిందని తెలిపారు. దీనిని రాజకీయ ప్రత్యర్ధులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. దిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ గాంధీ చేసిన విమర్శలు హాస్యాస్పదమని దుయ్యబట్టారు. వీరసైనికులను అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. దిగజారుడు రాజకీయాలకు కాంగ్రెస్ దిగజారుతుందని ఘాటుగా విమర్శించారు. దేశంలో ప్రస్తుతం పంచాయతీ నుంచి పార్లమెంటరీ ఎన్నికల వరకు బీజేపీ హవా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను దేశ ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని కుండబద్ధలు కొట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటక ఎన్నికల తర్వాత పార్టీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారిస్తుందని పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళతామని వివరించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన అవకతవకలమయం, కుటుంబపాలన, రాజరిక వ్యవస్థగా మారిందని ఆరోపణలు గుప్పించారు. బీజేపీని రాష్ట్ర ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని సాక్షాత్తు ఎమ్మెల్సీతోపాటు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కూడా బాహాటంగానే కమీషన్‌ల గురించి మాట్లాడుతున్నారంటే యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై అన్ని వర్గాలవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వివరించారు. టీఆర్‌ఎస్ సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆరోపించారు.
అట్టహాసంగా శంకుస్థాపన
మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యాలయ భవన నిర్మాణ పనుల శంకుస్థాపన అట్టహాసంగా జరిగింది. పార్టీ జిల్లా నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన పనులు చేపట్టారు. భవన నమూనాను అధ్యక్షుడు లక్ష్మణ్ పరిశీలించారు. జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సాయిగారి మల్లారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, అంజన్ కుమార్ గౌడ్, భీంరావు, సత్యనారాయణ, బిక్కునాయక్, రామోజీ, నరేశ్, రాంసుధాకర్, మండల పార్టీ అధ్యక్షుడు జగన్ గౌడ్, కేశవరెడ్డి, విక్రంరెడ్డి, కొంపల్లి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.