హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో 60శాతం నిధులు కేంద్రానివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లైఓవర్ల సుందరీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 21: మహానగరంలో నిత్యం రద్దీ, ట్రాఫిక్‌తో కన్పించే ప్రధాన కూడళ్లు, ఫ్లై ఓవర్లు ఇకపై రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. దిల్లీ నగరంలో మాదిరిగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లకు సుందరీకరణ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. గతంలో సీవోపీ ప్రపంచ సదస్సు జరిగినపుడు, నగరానికి ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక వచ్చినపుడు ముస్తాబు చేసిన మాదిరిగానే శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక సొబగులు సమకూర్చాలని మేయర్ బొంతు రామ్మోహన్ భావిస్తున్నారు. ఇటీవల మేయర్, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి దిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ ఫ్లై ఓవర్లు ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి. నగరంలో కూడా విశాలమైన మెయిన్‌రోడ్లలో ఉన్న ఫ్లై ఓవర్లకు ఈ రకంగా ఎల్‌ఈడీ లైట్లను, ఇరువైపులా, కింద పచ్చదనాన్ని ఏర్పాటుచేస్తే నగరం అదనపు శోభను సంతరించుకుంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ దీపాలతో అలంకరణ, కళాత్మకత ఉట్టిపడే ఆకర్షనీయమై చిత్రలేఖనాలను ఏర్పాటు చేయాలని భావిస్తన్నారు. న్యూ దిల్లీలో మాదిరిగానే సుందరీకరణ పనులు చేపట్టాలని ఇప్పటికే మేయర్ కమిషనర్ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. దీంతో కమిషనర్ జీహెచ్‌ఎంసీలోని ఎలక్ట్రికల్, బయోడైవర్శిటీ, ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఫ్లైఓవర్ల సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మొదటి దశగా మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్, బషీర్‌బాగ్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, తెలుగుతల్లి, సికిందరాబాద్ హరిహరకళాభవన్, సిటీఓ, బేగంపేట ఫ్లైఓవర్లను అందంగా, ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టారు. దీంతోపాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలీ ఫ్లైఓవర్లను కూడా హెచ్‌ఎండీఏ ద్వారా అందంగా ముస్తాబు చేయాలని నిర్ణయించారు. పలు ఫ్లైఓవర్లకు ఈ సుందరీకరణ పనుల్లో భాగంగా ప్రాథమికంగా పలు పనులను ముమ్మరం చేశారు. తొలుత రంగులు వేయటం, విద్యుత్ దీపాలను ఏర్పాటుకోసం వైరింగ్ ఏర్పాటు చేయటం, ఫ్లైఓవర్ కింద పచ్చదనం ఏర్పాటుచేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నింటినీ మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అధికారులను ఆదేశించారు.

హీరో బాలకృష్ణ ఇల్లు ముట్టడి

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలకు బిజెపి, బిజేవైఎం నిరసన
బాలకృష్ణ వాహనాన్ని అడ్డుకుని, ఇంటి గేట్లు దూకే ప్రయత్నం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 21: ప్రధాని నరేంద్రమోదీపై సినీ హీరో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిజెపి, బిజేవైఎం కార్యకర్తలు బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి సుమారు వంద మంది కార్యకర్తలు ఒక్కసారిగా జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.45లో ఉన్న బాలకృష్ణ నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. బాలకృష్ణ డౌన్ డౌన్, ప్రధాని మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ నివాసంలోకి చొరబడేందుకు గేట్లు ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నెల 20న విజయవాడలో జరిగిన ధర్మ పోరాట దీక్ష సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీపై చేసిన ఘాటైన విమర్శలకు బిజెపి, బిజేవైఎం తీవ్రంగా స్పందించింది. జాతీయ స్ధాయిలో ఎంతో ప్రతిష్ట కలిగి, దేశాన్ని పరిపాలిస్తున్న మోదీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు కష్టంగా మారింది. బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించేందుకు వస్తున్న సంగతి ముందుగానే సమాచారం ఉండడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ ఎసిపి నేతృత్వంలో కట్టుదిట్టంగా పోలీసులను మోహరింప చేశారు. బాలకృష్ణ నివాసం వద్దే కాకుండా సమీప ప్రాంతాల్లో కూడా ముట్టడికి ముందు తనిఖీలు చేశారు. సరిగ్గా ఆందోళన కారులు ఇంటి గేటు ముందు ఆందోళన చేస్తుండగా, లోపలి నుంచి బయటకు వెళ్లేందుకు బాలకృష్ణ రావడంతో ఒక్కసారిగా కారును అడ్డుకున్నారు. కారులో నుంచి కిందకు దిగి సమాధానం చెప్పాలని కారుకు అడ్డు తగిలారు. పోలీసులు వారిని పక్కకు లాగి వాహనానికి దారి ఇవ్వడంతో బాలకృష్ణ బయటకు వెళ్లిపోయారు. దీంతో కాసేపు బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తంగా మారింది. దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాలకృష్ణపై ఓయు పిఎస్‌లో బీజీపీ ఫిర్యాదు
ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలపై బిజెపి ఎమ్మెల్సీ, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎన్.రామచంద్రరావు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. ప్రధానిపై నేరుగా ఇలాంటి దూషణలు చేయడం దారుణమని, చట్టపరంగా నేరమని వారు ఫిర్యాదులో ప్రస్తావిస్తూ తక్షణమే బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. శాసనసభ్యుడిగా రాజ్యాంగబద్దంగా నడుచుకోవడం, చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉండగా విచక్షణ మరచిపోయి ప్రధానిపై నోటికొచ్చినట్లు మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వైజాగ్ టూ హైదరాబాద్
గంజాయి దందా
అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నార్సింగి,ఏప్రిల్ 21: గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నగర టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన కె.రాంబాబు, కె.ప్రశాంత్, కె.ఇందిరలు అరెస్టు కాగా, మహేశ్, సుదర్శన్‌లు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 26 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయిని అవసరమైన వారికి అక్రమంగా చేరుస్తున్నారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న సుదర్శన్ మిగిలిన నిందితులకు గంజాయి తీసుకు వచ్చి హైదరాబాద్‌లో అప్పగిస్తే మంచి కమిషన్ ఇప్పిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఈ మేరకు వారు గంజాయితో ఈ నెల 21న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగారు. స్టేషన్‌లో దిగిన తర్వాత లంగర్‌హౌస్‌లోని ఒక కస్టమర్‌కు గంజాయి అప్పగించాలని సూచించడంతో ఆటోలో బయలు దేరి వెళ్లారు. అక్కడ తమ కస్టమర్ కోసం వేచి చూస్తుండగా టాస్క్ఫోర్స్‌కు అందిన సమాచారంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న గంజాయిని లంగర్‌హౌజ్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ అదనపు డిసిపి చైతన్యకుమార్ పర్యవేక్షణలో ఈస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.మోహన్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం నిందితులను పట్టుకుంది.

అర్థరాత్రి..ఆకస్మిక తనిఖీలు
రోడ్ల పనులను పరిశీలించిన మేయర్, పీఎస్ అర్వింద్‌కుమార్
ప్రతి పనిని ఎపుడైనా తనిఖీ చేస్తామని స్పష్టీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 21: మహానగరంలోని పలు మెయిన్ రోడ్ల మరమ్మతుల పనులను రూ.700 కోట్లతో జీహెచ్‌ఎంసీ చేపడుతోంది.
వర్షాకాలం ప్రారంభమైన తర్వాత నగరవాసులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా ఎంతో ముందుచూపుతో, నాణ్యతతో పనులు చేపడుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.5, నల్లగండ్ల సమీపంలోని ఫ్లైఓవర్, మసీదుబండలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులను అర్థరాత్రి మేయర్ రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో జరుగుతున్న రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణ పనులేగాక, వివిధ రకాల అభివృద్ధి పనులను ఎపుడైనా ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు వివరించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లలో కూడా పూర్తిస్థాయిలో నూతనంగా రోడ్లను నిర్మించటం, మరమ్మతులను చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులను ముమ్మరం చేశామని వివరించారు. రోడ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని వివరించారు.
వర్షాలు, వరదల సందర్భంగా నీటి నిల్వలు ఏర్పడే వంద ప్రాంతాలను గుర్తించామని, ఆయా రోడ్ల మరమ్మతులను చేపట్టామని పేర్కొన్నారు.
అవసరమైన ప్రాంతాల్లో పేవర్ బ్లాకులతో రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్, ఎస్‌ఈ మోహన్‌సింగ్ కూడా పాల్గొన్నారు.
తెరాస ప్లీనరీకి ఏర్పాట్లు
పరిశీలించిన నేతలు
జీడిమెట్ల, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలకు నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగర శివారులోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో 27న జరిగే ప్లీనరీ సమావేశాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎంపీ మల్లారెడ్డి, బాల్క సుమన్, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేక్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాజు, రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సభా ప్రాంగణం, భోజన శాలలు, వీఐపీ పార్కింగ్ తదితర అంశాల పై చర్చించారు. అనంతరం పార్టీ జెండాలు, టీషర్ట్‌లను ప్రారంభించారు. కార్యక్రమంలో తెరాస నేతలు, బాలానగర్ జోన్ డీసీపీ సాయిశేఖర్, ఏసీపీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
పాఠశాలల్లో సౌకర్యాలు
స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మరుగు దొడ్ల నిర్మాణం

బొంరాస్‌పేట, ఏప్రిల్ 21: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం మరుగుదొడ్లను నిర్మించేందుకు సన స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకురాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంచాయిత గజపతిరాజు శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించేందుకు మండల విద్యాధికారి రాంరెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. జిల్లాలోని తాండూర్, కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలను ఎంపిక చేశారు. ఎంపికైన మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంధ సంస్థ తరపున ఉచితంగా మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు సంచాయిత గజపతిరాజు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికల కోసం మరుగుదోడ్లు నిర్మించామని, తెలంగాణ రాష్ట్రంలో కూడ నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పర్యటించి పాఠశాలలను పరిశీలిస్తున్నామని అన్నారు.

ప్రధాని మోదీ నుంచి
ఎక్సలెన్సీ అవార్డు స్వీకరించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 21: కోటి మంది జనాభాకు పౌరసేవలు, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులను చేపడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి శనివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ‘ప్రధానమంత్రి ఎక్సలెన్సీ’ అవార్డును స్వీకరించారు. న్యూ దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు చూపించిన 13మంది ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోదీ ఈ పురస్కారాలను అందజేశారు. దక్షిణ భారతదేశంలో ఇద్దర్ని ఈ పురస్కారాలు వరించగా, వారిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కావటం విశేషం. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ఈ అవార్డులను స్వీకరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని గ్రేటర్‌లో సమర్థవంతంగా అమలుచేస్తూ లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను చేపడుతున్నందుకు జీహెచ్‌ఎంసీకి ఈ అవార్డు దకింది. నగరంలో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పురోగతి, స్కీం అమలవుతున్న తీరు, లబ్ధిదారుల వివరాలతో కూడిన లఘు చిత్రాన్ని కార్యక్రమంలో అవార్డుల ప్రదానానికి ముందు ప్రదర్శించారు. ఇక కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్- జనార్దన్ రెడ్డికి శిష్యుడు. అనంతపూర్ కలెక్టర్‌గా జనార్దన్ రెడ్డి పనిచేసిన సమయంలో సర్పరాజ్ అహ్మద్ ఐఏఎస్ అధికారిగా శిక్షణ పొందేందుకు అక్కడ చేరారు. ఇపుడు వీరిద్దరికి ప్రధాని ఎక్సలెన్స్ అవార్డు రావటంతో వీరికున్న అనుబంధాన్ని అధికారులు గుర్తుచేసుకున్నారు.
‘స్వచ్ఛ నమస్కారం’కు ప్రధాని అభినందన
పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించగానే, వేదికపై చేరుకున్న కమిషనర్ ప్రధాని మోదీని కలిసి స్వచ్ఛ నమస్కార్ తెలిపారు. కమిషనర్ నమస్కారం స్వచ్ఛ స్ఫూర్తిని కల్గించేలా ఉందని మోదీ కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

రోడ్ల నిర్మాణంలో ప్రమాణాలేవీ?
ఐఆర్‌ఎస్ గైడ్‌లైన్స్‌కు పాతర ఫ్లైఓవర్ల కింద తగ్గుతున్న ఎత్తు
ఇలాగే నిర్మిస్తే..పరిస్థితేమిటి?

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 21: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీకి అనుకూలంగానే గాక, వాహనదారులకు కొంతకాలం అనుకూలంగా ఉండే తరహాలో రోడ్లను నిర్మించటంలో మహానగర పాలక సంస్థ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా సీసీ, బిటి రోడ్ల నిర్మాణంలో అధికారులు పాటించాల్సిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనలకు తిలోదకాలిచ్చి అధికారులు ఇష్టారాజ్యంగా అరకొర నైపుణ్యంతో రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, కొత్త రోడ్లను రీ కార్పెటింగ్ చేయటం వంటివి కొనసాగుతున్నాయి. రోడ్ల మరమ్మతులు, రీ కార్పెటింగ్ కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా, కనీస ప్రమాణాలను పాటించకపోవటంతో ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ఇందుకు నగరంలోని పలు రోడ్లను గమనిస్తే సీసీపై బీటీ వేయటం, పలుచోట్ల బీటీ రోడ్లకు సీసీ మరమ్మతులు చేయటం రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏ మెయిన్ రోడ్‌లో ఏ చిన్న పనికి తవ్వకాలు జరిపినా, అడుగుల కొద్దీ మందంతో రోడ్డు బయటపడుతోంది. ముఖ్యంగా ఫ్లై ఓవర్ల కింద రోడ్లపై రోడ్డును వేయటంతో రోడ్డు నుంచి ఫ్లైఓవర్ల మధ్యనున్న గ్యాప్ తగ్గుతోంది. వాస్తవానికి ఉన్న రోడ్డును తొలగించి, కొత్త రోడ్డును వేయాల్సి ఉన్నా, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా రోడ్డుపై రోడ్డు వేస్తే పనవుతుందని అనుకుంటున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే ఫ్లై కింద నుంచి కనీసం ఆర్టీసి బస్సు కూడా వెళ్లని పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రద్దీ ప్రాంతాల్లో మనం సిగ్నల్ పడినపుడు డివైడర్లను గమనిస్తే మన ఇంజనీర్ల నైపుణ్యత ఏ పాటిదో అర్థమవుతోంది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పూర్తిగా మునిగిపోయేలా రోడ్డు వేసి ఉండటం కన్పిస్తోంది. ఐఆర్‌ఎస్ ప్రమాణాల ప్రకారం ఒకచోట రోడ్డు వేయాలంటే ఉన్న రోడ్డును మిల్లింగ్ చేసి, తొలగించిన తర్వాతే నిర్మించాల్సి ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో అలా జరగటం లేదు. ఫలితంగా ప్రజాధనం వృథా కావటంతో పాటు ప్రజలకు కష్టాలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లు నగరవాసులకు నరకాన్ని చూపుతున్నాయి. అయినా అధికారులు అప్పటికపుడు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, వాహనదారులకు శాశ్వత ప్రాతిపదికన రోడ్లను అందుబాటులోకి తేవటంలో విఫలమవుతున్నారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టడంలో, కొత్తగా రీ కార్పెటింగ్ చేయటంలో గ్రేటర్ బల్దియా ఇంజనీర్లలో ఉన్న పని నైపుణ్యత అంతంతమాత్రమేనని తెలుస్తుంది. గత కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు 2012 జీవవైవిధ్య సదస్సును పురస్కరించుకుని చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇంజనీర్లు కనీసం మేస్ర్తిలుగా కూడా పనిచేయటం లేదు. కనీసం మేస్ర్తిలైనా గ్రేటర్ ఇంజనీర్ల కన్నా ఎంతో బాగా పనిచేస్తారంటూ ఆయన అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. రోడ్ల నిర్మాణం, రీ కార్పెటింగ్‌కు సంబంధించి అమలు చేయాల్సిన ఇండియన్ రోడ్డు కాంగ్రెస్(ఐఆర్‌ఎస్) నిబంధనల ప్రకారం రోడ్డు నిర్మించే ముందు వరద నీటి కాలువలను ఇరువైపులా తప్పకుండా ఏర్పాటుచేసి, ఎంత వర్షం కురిసినా, రోడ్డుపై నీరు ఆగకుండా చర్యలు చేపట్టాలి. అలాగే రోడ్డు భూగర్భంలో మధ్యలో నుంచి విద్యుత్ కేబుళ్లు గానీ, వాటర్ పైప్‌లైన్లు గానీ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ దశాబ్దాల క్రితం ఐఆర్‌ఎస్ నిబంధనలను అమలు చేస్తూ నిర్మించిన రోడ్లకు ఇరువైపులా వరద నీటి కాలువలను ఏర్పాటు చేసినా, కాలనుగుణంగా ఎప్పటికపుడు చేపడుతున్న రోడ్డు విస్తరణ కారణంగా ప్రస్తుతం వెడల్పు పెరిగి, ఆ వరద నీటి కాలువలు రోడ్డు మధ్యలోకి వచ్చాయి. అంతేగాక, వరద నీటి కాలువలు కనుమరుగైపోవటంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వర్షం నీరు రోజుల తరబడి నిలుస్తుంది.

ప్రత్యేక వైద్య శిబిరాల షెడ్యూల్ ఖరారు
23న పాతబస్తీ నుంచి మొదలు
నిర్వహణలో సంబంధిత శాఖల భాగస్వామ్యం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 21: నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలు, వ్యాధుల బారిన పడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం నిర్వహించనున్న ప్రత్యేక వైద్య శిబిరాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23వ తేదీన నగరంలోని పార్దివాడ, గొల్లకిటికీ తదితర ప్రాంతాల నుంచి ఈ శిబిరాలు ప్రారంభించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి వైద్యారోగ్యశాఖాధికారి డా.ఐ.ఎ.సరళాకుమారి వెల్లడించారు. జిల్లాలో తరుచూ సీజనల్ వ్యాధులకు గురయ్యే 61 ప్రాంతాల్లో 111 వైద్య శిబిరాలను నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ మలేరియా నివారణ యాంటిలార్వా ఆపరేషన్‌లో పాల్గొనే 640 బృందాలను వైద్యారోగ్యశాఖ ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఇతర సిబ్బందిని, మలేరియా విభాగాన్ని ఈ శిబిరాల నిర్వాహణలో భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీహెచ్‌ఓలు స్పెషల్ డ్రైవ్‌ను మానిటర్ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
10వ తేదీ వరకు నిరంతరంగా...
ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వైద్య శిబిరాలు వచ్చే నెల 10వ తేదీ వరకు నిరంతరంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 23న చోటాశంకర్‌నగర్, వహిద్‌నగర్, అఫ్జల్‌నగర్, గులాబ్‌సింగ్ బౌలీ, పార్దివాడ, గొల్లకిటికీ, ప్రశాంత్‌నగర్, డిఫెన్స్‌కాలనీ, ఖాజానగర్, బోలానగర్, సింగడిబస్తీ, ఎన్‌బీటీనగర్, కుమ్మరివాడ, హరినగర్, ఎ.జే.విశాలరంగానగర్, అంజుమన్ స్కూల్, అలాగే 24న కాలాడేరా, దయానంద్‌నగర్, ఆనందన్‌నగర్, ఫరూక్‌నగర్, జమల్లికుంట, నదీంకాలనీ, లక్ష్మినరసింహనగర్, లేబర్ అడ్డా, బాపూజీనగర్, మోహన్‌నగర్, 26న చంచల్‌గూడ స్లమ్, కమలానగర్, ఫర్హత్‌నగర్, తాడ్‌బంద్, హాకీంపేట, నిజాంకాలనీ, కౌసావాడి, గౌలీగూడ చమాన్, కార్మికనగర్, మురాద్‌నగర్, జ్యోతినగర్, తాళ్లబస్తీ, మాణికేశ్వరినగర్, 27న నూర్‌ఖాన్ బజార్, అఫ్జల్‌సాగర్, చత్రపతిశివాజీనగర్, 30న మేకలమండి బస్తీ, నాంపల్లి రైల్వేట్రాక్, సుల్తాన్‌బజార్, బ్యాండ్‌లైన్, అచ్చయ్యనగర్, నాగమయ్యకుంట, ఎన్‌ఆర్‌ఆర్‌పురం, సైట్-3, వీకర్ సెక్షన్‌కాలనీ, 3న అమన్‌నగర్, భవానీనగర్, బడాబజార్, ఆర్‌కే పేట, రహీంపేట, జుమేరాత్‌బజార్, చకెన్‌వాడి, పీసీనగర్, 4వ తేదీన బండ్లగూడ, జంగీరాబాద్, నూరినగర్, భోజగుట్ట, వెంకటేశ్వరనగర్, ఇందిరానగర్, సుభాశ్‌నగర్, బల్కంపేట, 7న శివాజీనగర్, అశోక్‌నగర్, ఇందిరానగర్, కేశ్వస్వామినగర్, డబీరాబాద్, షేక్‌పేట, పెద్దగేట్, విఠల్‌వాడీ, అన్నపూర్ణనగర్, ఖాద్రీబాగ్, ఎంఎస్ మక్తా, సూర్యనగర్, లక్ష్మినగర్, పాటిగడ్డ, పటేల్‌నగర్, హిందీనగర్‌లలో ఈ వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 8న నాయక్‌నగర్, జంగంపేట్, కొండారెడ్డిగూడ, ఎస్‌పీనగర్, దూద్‌బౌలీ, బండ్లగూడ, అల్లూరి సీతారామారాజునగర్, మొఘల్‌నగర్, పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, రాజ్‌నగర్, బీజేఆర్ నగర్, అడ్డగుట్ట, 10న దేవీబాగ్, బిలాల్‌దర్గా, చౌటాబజార్, దన్‌కోటా, యండి లైన్స్, నింబోలి అడ్డా, కుమ్మర్‌వాడి, బతుకమ్మకుంట, లాలాపేట ప్రాంతాల్లో ఈ శిబిరాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హౌసింగ్ బోర్డు కాలనీలో తనిఖీలు
చేవెళ్ల, ఏప్రిల్ 21: ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించాలనే ఉద్ధేశ్యంతో శంషాబాద్ డీసీపీ పద్మజ అధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారు ఝామున చేవెళ్ల పోలీసుస్టేషన్ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో చేవెళ్ల ఏసీపీ స్వామి, సీఐ గురువయ్య, పది మంది ఎస్సైలు, 9మంది ఎ ఏస్సైలు మొత్తం 185మంది సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 25 బైక్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకుని 11మంది పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డీసీపీ పద్మజ మాట్లాడుతూ.. ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడానికి కార్డెన్ సర్చ్ తనిఖిలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో వెయ్యి ఇండ్లను తనిఖీలు చేశామని తెలిపారు. ఈ నిర్భంద తనిఖీలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని పేర్కోన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ స్వామి, సీఐ గురువయ్య, ఎస్సైలు శ్రీ్ధర్ రెడ్డి, భీముకుమార్, మిగిత ఎస్సైలు, ఏ ఏస్సైలు, సిబ్బంది ఉన్నారు.

బాక్సర్ హుసాముద్దీన్‌ను సత్కరించిన ఆర్మీ
హైదరాబాద్, ఏప్రిల్ 21: కామనె్వల్త్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం అంధించిన నాయబ్ సుబేధా, బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్‌ను సికింద్రాబాద్‌లోని వన్ ఈఎంఈ సెంటర్‌లో శనివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంసీఎంఈ కామాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్ విచ్చేసి కామెనె్వల్త్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించన మహ్మద్‌ను సత్కరించి అభినందించారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో నిర్వహించిన కామనె్వల్త్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం అంధించిన హుసాముసద్దీన్ దేశానికే గర్వకారణమన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి
కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రీల్ 21 : నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు శాయ శక్తుల కృషి చేస్తానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం ఆల్వీన్‌కాలనీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రూ.194.29 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొని శంకుస్థాపన చేశారు.
మాట్లాడుతూ.. ఆల్వీన్‌కాలనీ ఫేజ్-1లో రూ.24.19 లక్షలతో, షంషీగూడలో రూ.65.1 లక్షలతొ, ఆల్వీన్‌కాలనీ ఫేజ్-2లో రూ.45 లక్షలతొ, విజయనగర్‌కాలనీలో రూ. 9.99 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, తులసీనగర్‌లో రూ.35 లక్షలతోనిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డిఈ కృష్ణ, ఎఈ సుభాష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మం, నాయకులు సంజీవ రెడ్డి, లద్దె నాగరాజు, బాల్‌రాజు, రామకృష్ణ గౌడ్, కాశీనాథ్‌యాదవ్, భాస్కర్, చిన్నోళ్ల శ్రీను, శివరాజ్ గౌడ్, రామకృష్ణ, మున్నా, సమ్మారెడ్డి పాల్గొన్నారు.

షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన అందులో 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవే ఉంటాయని బీజేపీ తెలంగాణ విమోచన కమిటి చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి వివరించారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పంచాయతీ రంగంపల్లిలో బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ కక్కునూరి వెంకటేష్ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులను భారీ స్థాయిలో విడుదల చేసిందని వివరించారు. సర్పంచుల పదవీ కాలం ముగిస్తున్నా నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఒక్కరూపాయి కూడా రాలేదని వాపోయారు. గ్రామాలలో నిర్మించుకునే మరుగుదొడ్లకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనున్నట్లు వివరించారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తుందని, ఆ నిధులను పనులకు వినియోగించుకుండా పక్కదారి మళ్లీంచి రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు ఉపయోగిస్తుందని వివరించారు. ఈ పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రచారం చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమిత్‌షా బృందాలు పర్యటనలు కొనసాగిస్తున్నాయని, ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ మనోహర్ రెడ్డి, బాబుదోర, ప్రకాష్‌చారి, నారాయణ, శివరాజు, పాపయ్య, సురేష్, యాదయ్య, మురేందర్, విష్ణుకాంత్, హన్మంతు పాల్గొన్నారు.

మంచినీటి పైపులైన్ పనులు పూర్తి చేయాలి
* ఎమ్మెల్యే కేపీ వివేక్
జీడిమెట్ల, ఏప్రిల్ 21: మంచినీటి పైపులైన్ పనులను సకాలంలో పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అధికారులను, గుత్తేదార్లను ఆదేశించారు.
జీడిమెట్ల డివిజన్ అయోధ్యనగర్‌లో జరుగుతున్న మంచినీటి పైపులైన్ పనులను ఎమ్మెల్యే వివేక్ పరిశీలించారు. వివేక్ మాట్లాడుతూ.. పైపులైన్ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీజీఎం బాస్కర్, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ గ్రామంలో నియోజకవర్గానికి చెందిన 32మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10,03,500ల చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేక్ అందజేశారు. వివేక్ మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి భారీగా నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు.
పేదల పక్షపాతిగా కేసీఆర్ నిలబడుతున్నారని, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ఖరీదైన వైద్య సేవలు తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా పట్టించుకోరా?
ఉప్పల్, ఏప్రిల్ 21: జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పల్ ఆరో డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. అనుమతి లేకుండా, అనుమతికి విరుద్ధంగా జరుగుతున్న ఇంటి నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. వీటిపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖిరిని నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగింది. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించి అనంతరం సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా బహుళ అంతస్థులతో నిర్మాణాలు చేపట్టినా పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడంలో అంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదస్థద స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూడాల్సిన అధికారులు మరీ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని నిర్మాణాలు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బీజేవైఎం జిల్లా కార్యదర్శి రేవెల్లి రాజు హెచ్చరించారు. కార్యక్రమంలో అపర్ణ కుమార్, నవీన్ యాదవ్, సంపత్, సుధాకర్, సుమన్ చారి, పరుశరామ్, గోవింద్ కుమార్ పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
చేవెళ్ల, ఏప్రిల్ 21: వచ్చే ఏన్నికలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని సీహెచ్ ఆర్ గార్డెన్‌లో చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ట్లాడుతూ కేంద్రంలో ఏన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి తగ్గిపోయిందన్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షమ పథకాలు దళారుల కాకుండా అర్హులైన లబ్ధిదారులకే అందుతున్నాయని చెప్పారు. ప్రజలంత బీజేపీని పూర్తిగా విశ్వసిస్తున్నారని, ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుటుంన్నారని అరోపించారు. 28వ తేదిన తుక్కుగూడలో 30వేల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు బొక్కనర్సింహ్మరెడ్డి తెలిపారు.
ప్రతి గ్రామం నుంచి ఈ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శేరి నర్సింగ్ రావు, ప్రేమ్‌రాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంజనేయులుగౌడ్, కంజర్ల ప్రకాష్, నియోజకరవర్గం కన్వీనర్ జంగారెడ్డి, పార్టీ నాయకులు విఠల్ రెడ్డి, పాండు రెడ్డి, క్యామ పద్మజనాభం ఉన్నారు.