హైదరాబాద్

శాశ్వత పరిష్కారం కోసం తాత్కాలిక ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి: నగరంలో పెరుగుతున్న జనాభాకు అనువుగా రోడ్లను విస్తరించి, అవసరాలకు తగిన విధంగా ఫ్లైఓవర్లు, స్కైవేలు వంటివి నిర్మిస్తున్నందున, ప్రజలకు కొన్ని తాత్కాలిక ఇబ్బందులు తప్పవని, శాశ్వత పరిష్కారం సమకూరుతున్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వానికి సహకరించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు కోరారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి పైప్‌లైన్ కోసం తప్పని పరిస్థితుల్లో రోడ్లు తవ్వారని, ఫలితంగా ప్రజలకు కాస్త ఇబ్బందులు తప్పటం లేదని వ్యాఖ్యానించారు.
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు రూ.263 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా లేనివిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు. పట్టణీకరణ ఈప్రాంతంలోనే వేగంగా జరుగుతుండడంతో ప్రజలు ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అనేక కార్యాలయాలుండటం, బహుళ అంతస్తు భవనాల నిర్మాణాలు అధికంగా జరగుతుండడంతో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని తెలిపారు. నగరంలోని 111 కి.మీ. ఎలివేటర్ కారిడార్లను ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రూ.23వేల కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో రూ.3వేల కోట్ల పనులు జరుగుతుండగా, వీటిలో కొన్ని పూర్తి చేశామని పేర్కొన్నారు. మరో రూ.2353 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని, రూ. 2686 కోట్ల పనులకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్, జనాభాకు తగ్గటుగా వౌలిక వసతులను ఏర్పాటు చేసుకోకపోతే నగర జీవన ప్రామాణాలు పడిపోయే ప్రమాదం ఉందని అన్నారు. రహదారుల విస్తరణతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం చేసి, ప్రజారవాణ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నగరంలో ప్రజా రవాణా ఆశించిన స్థాయిలో లేదని మన కంటే నాలుగు రేట్లు జనాభా ఎక్కువ ఉన్న ముంబై నగరంలో 70 శాతం మంది ప్రజలు రైలు, బస్సులలో ప్రయాణం చేస్తున్నారని వివరించారు. 30 శాతం మంది మాత్రమే ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నారు. మన నగరంలో ప్రజలు మాత్రం 34 శాతం మంది మాత్రమే ప్రజా రవాణ వ్యవస్థ వినియోగిస్తుంటే 66శాతం మంది ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సాగించడంతో ట్రాఫిక్ తీవ్రమైందని అన్నారు. రెండో దశ మెట్రో అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్ వరకు 16 కిలోమీటర్ల కారిడార్‌ను ఆగస్టులో ముఖ్యమంత్రి ప్రారంభిచనున్నట్లు చెప్పారు. 3వ దశ హైటెక్ సిటీ వరకు వచ్చే మార్గమని, దీన్ని అక్టోబర్ వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఎంఎంటీఎస్ రెండో దశ వేగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి నిధులను కూడా విడుదల చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం మెట్రోలో రోజుకి 85వేల మంది ప్రయాణం చేస్తున్నారని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి 14లక్షల మంది ప్రయాణించే లక్ష్యం ఉందని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌ను విస్తరించడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించవచ్చని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని, హైదరాబాద్‌లో మొదటి దశలో 500 ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చనున్నట్లు తెలిపారు. వారం క్రితం కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌లో 12 ఎకరాలలో పార్కును ప్రారంభించామని గుర్తుచేశారు. రోడ్లు తవ్వకుండా ట్రెంచ్ లెస్ టెక్నాలజీతో పైపులైన్ వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎపుడూ లేనివిధంగా రోడ్ల విస్తరణ పనుల జరుగుతున్నాయని చెప్పారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ జరగనన్ని అభివృద్ధి పనుల తన నియోజకవర్గంలో జరుగుతున్నాయని చెప్పారు. అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ రాగం సుజాత, జోనల్ కమిషనర్ హరిచందన, చీఫ్ ఇంజనీర్ శ్రీ్ధర్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, నాగేందర్ యాదవ్, పూజిత, జగదీశ్వర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, జానకీ రామరావు పాల్గొన్నారు.