హైదరాబాద్

కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నేడు ప్రత్యేక కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: మహానగర పాలక సంస్థ విధి విధానాలు, అభివృద్ధి పనులు, పౌరసేవల నిర్వహణలో ప్రజలు, ప్రజాసంఘాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు నియమించాల్సిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం గురువారం జిహెచ్‌ఎంసి కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇందులో స్థారుూ సంఘం సభ్యుల ఎన్నిక, అలాగే వార్డు కమిటీల నియామకంతో పాటు ఏరియా సభల ఏర్పాటు వంటి అంశాలపై కీలకమైన చర్చ జరిగే అవకాశాలున్నాయి. చట్టం ప్రకారం అయిదు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నికోవల్సి ఉండగా, ఇందుకు దరఖాస్తుల స్వీకరణ చివరి నిమిషం వరకు మొత్తం 106 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయిదుగురు కో-ఆప్షన్ సభ్యుల్లో ఇద్దరు మైనార్టీలను నేడు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఎన్నికుని, మిగిలిన మరో ముగ్గురి ఎన్నిక కోసం రెండు నెలల తర్వాత మరోసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం మేయర్ ఎన్నిక జరిగిన నాటి నుంచి మూడు నెలల్లోపు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవల్సి ఉన్నందున ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. నేటి కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు మైనార్టీ కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుని, మిగిలిన ముగ్గుర్ని తర్వాత మరోసారి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నుకోవచ్చునని పాలక మండలి భావిస్తోంది. కానీ ఈ ఇద్దరు కో ఆప్షన్ మైనార్టీ సభ్యులు తెరాస పార్టీకి చెందిన వారెవరున్నారు? వీరిలో తెరాస మజ్లిస్ పార్టీల అవగాహన కుదిరి ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా ఉన్నారా? అన్నది ఈ నెల 7న ఎన్నిక జరిగే రోజున తేలనుంది.
స్థారుూ సంఘం సభ్యులపై కసరత్తు
కో ఆప్షన్ సభ్యులతో పాటు మొత్తం 150 మంది కార్పొరేటర్లున్న జిహెచ్‌ఎంసిలో స్థారుూ సంఘం కూడా అందుబాటులోకి రానుంది. మున్సిపల్ నిబంధన ప్రకారం స్థారుూ సంఘం సభ్యులను ఎంత మందిని ఎన్నుకోవాలన్న విషయాన్ని ఖరారు చేస్తూ లేఖ రాయాలన్న సర్కారు ఆదేశాల మేరకు అధికారులు మొత్తం 15 మంది సభ్యులను ఎన్నుకోవల్సి ఉంటుందని సమాచారం పంపినట్లు తెలిసింది. సీక్రెట్ బ్యాలెట్ ఎన్నిక ద్వారా బరిలో ఉన్న అభ్యర్థుల్లో 15 మందికి ప్రస్తుతమున్న 150 మంది కార్పొరేటర్లు ఓట్లు వేస్తారు. వీరిలో ప్రాధాన్యత ప్రాతిపదికన ఎక్కువ ఓట్లు దక్కిన తొలి పదిహేను మంది కార్పొరేటర్లను స్థారుూ సంఘం సభ్యులుగా గుర్తిస్తారు.
వార్డు కమిటీల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ
వార్డు కమిటీల నియామకానికి ఈ నెల 6నుంచి జోనల్ సర్కిల్ స్థాయిల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20వరకు స్వీకరించి ఆ తర్విత 21 నుంచి 27 వరకు వాటిని స్క్రూటినీ చేసి ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత మరోసారి కౌన్సిల్ సమావేశమై ఈ కమిటీలకు ఆమోదం తెలపనున్నట్లు ఆయన తెలిపారు. సంఘాలు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంధ సంస్థలకు చెందిన వారు సైతం ఇందులో సభ్యులుగా చేరేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.

నకిలీ సర్ట్ట్ఫికెట్ల కేసులో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్, ఏప్రిల్ 6: వివిధ యూనివర్సిటీలకు సంబంధించి నకిలీ డిగ్రీ పట్టాలు తయారు చేస్తున్న ముఠాను వెస్ట్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వివిధ యూనివర్సీటీలకు చెందిన నకిలీ సర్ట్ట్ఫికెట్‌లను అమాయక ప్రజలకు విక్రయిస్తున్న మలక్‌పేటలోని ఓ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి అఫ్‌షాన్ సిద్ధికీ, మహ్మద్ అఖిల్ అహ్మద్‌ను అరెస్టు చేసి పలు నకిలీ సర్టిఫికెట్లలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తి మహ్మద్ హయాత్‌హుస్సేన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రజారోగ్యంతో చెలగాటం
చెత్తతరలించే పాత
వాహనాల తొలగింపు
ప్రత్యామ్నాయ వాహనాలేవీ
పనిచేసేందుకు
ముందుకురాని కాంట్రాక్టర్లు
ఎక్కడికక్కడే
పేరుకుపోతున్న చెత్త

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: మహానగర పాలక సంస్థ అధికారులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. చెత్తను తరలించే వాహనాల విషయంలో ఏ మాత్రం ముందుచూపు లేకుండా అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ 15 ఏళ్లు దాటిన వాహనాలను తొలగిస్తున్నారు. ఆర్టీఏ నిబంధనల ప్రకారం, తడిసి మోపడవుతున్న నిర్వహణ వ్యయం ప్రకారం వీటిని తొలగించటం సబబే అయినా, చెత్తను తరలించేందుకు వీటి స్థానంలో ప్రత్యామ్నాయ వాహనాలను సమకూర్చటంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా పలు చోట్ల చెత్త కుప్పలుగా పేరకుపోయి, ప్రజారోగ్యానికి ముప్పు కల్గించేలా తయారైంది. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలోని 24 సర్కిళ్ల పరిధుల్లో ప్రతిరోజు పోగవుతున్న సుమారు 4144 మెట్రిక్ టన్నుల చెత్తను ఇళ్ల నుంచి, ఆ తర్వాత గ్యార్బేజీ పాయింట్ల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించేందుకు నిన్నమొన్నటి వరకు సుమారు 900 వాహనాలు రాకపోకలు సాగించేవి. వీటిలో సుమారు 279 వాహనాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయని, వీటికి ఎక్కువ డీజిల్ ఖర్చవ్వటంతో పాటు నిర్వహణ వ్యయం కూడా రోజురోజుకి పెరగటంతో వీటిని ఆలిండియా స్క్రాప్ సంస్థకు ఈ వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు రెండు దఫాలుగా సుమారు 90 వాహనాలను తొలగించారు. అయితే ఇంతకు ముందు పూర్తి స్థాయిలో 900 వాహనాలు నిరంతరం చెత్త తరలింపు ప్రక్రియను చేపట్టినా, వీటి రాకపోకలను అదనపు కమిషనర్(ఆరోగ్యం, పారిశుద్ధ్యం), చీఫ్ ట్రాన్స్‌పోర్టు అధికారితో పాటు ఇంజనీర్లు ఎప్పటికపుడు పర్యవేక్షించినా, నగరంలోని అనేక ప్రాంతాల్లో మనకు చెత్త కుప్పలుగా కన్పించేది. కొన్ని రోజులుగా ఈ వాహనాల్లో దాదాపు 90 వాహనాలను తొలగించటం, వాటి స్థానంలో ప్రతాయ్నాయ వాహనాలను సమకూర్చలేదు. అయితే జిహెచ్‌ఎంసికి అత్యవసర సమయంలో అదనపు వాహనాలను సమకూర్చే కాంట్రాక్టర్లు ఇపుడు వాహనాలను పంపేందుకు ససేమిరా అంటున్నారు. గత సంవత్సరం జూలై మాసంలో నగరాన్ని 400 స్వచ్ఛ యూనిట్లుగా విభజించి గవర్నర్, ముఖ్యమంత్రులే నేరుగా క్షేత్ర స్థాయిలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అద్దె వాహనాలను పంపిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు ససేమిరా అనటమే దీనికి కారణమని తెలిసింది.
ఇపుడు వారితో అవసరమున్నందున వారికి దశల వారీగా అధికారులు బిల్లులు చెల్లిస్తున్నా, వీటి బిల్లులు వచ్చేందుకు ఎంత కాలం పడుతుందోనన్న భయంతో కాంట్రాక్టర్లు వాహనాలను సమకూర్చటం లేదు. ఫలితంగా ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. మరికొన్ని ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లలోనూ చెత్త కుప్పలుగా దర్శనమిస్తొంది.
రాంకీకి అప్పగించే దిశగా..
ప్రస్తుతం నగరంలో పోగవుతున్న చెత్తను సకాలంలో ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించే వాహనాలను దశల వారీగా తొలగిస్తూ, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా అధికారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయకపోవటం మున్ముందు పారిశుద్ధ్య పనులను రాంకీ సంస్థకు అప్పగించేందుకు యత్నించటమేనని పలువురు కార్మికులు వాదిస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన ఉద్యోగులను, వాహనాలను, యంత్రాలన్నింటిని ఆ సంస్థకు అప్పగించి శానిటేషన్ విధుల నుంచి తప్పించుకోవాలని జిహెచ్‌ఎంసి అధికారులు భావిస్తోన్నట్లు సమాచారం.
కొత్త వాహనాలు కొనండి!
జిహెచ్‌ఎంసి ముందు కార్మికుల ధర్నా
చెత్తను తరలించే పాత వాహనాలను తొలగిస్తున్న అధికారులు వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిహెచ్‌ఎంసి కార్యాలయం ముందు ధర్నా చేశారు.
జిహెచ్‌ఎంసి తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా అనంతరం నేతలు రాంబాబు, కె. అమరేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంటు మల్లిఖార్జున్ తదితరులు కమిషనర్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించి చర్చించారు.

అందుబాటులోకి ఆధునిక పార్కింగ్

మేయర్ల సదస్సులో రామ్మోహన్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా ‘్ఫన్‌లాండ్’ దేశం సహాయంతో ఆధునిక పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ రకమైన పార్కింగ్ వ్యవస్థ దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ నగరంలో సమకూర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి తోడు దిల్లీ మహానగరం మాదిరిగా భవన శిథిలాల నుంచి మళ్లీ ఇటుకలు, ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు డెబ్రీస్ రీ సైక్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు నగరంలో స్థాలాన్ని అనే్వషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన మేయర్ల సదస్సుకు ఆయన హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హజరైన ఈ కార్యక్రమంలో మేయర్ సమావేశానుద్దేశించి మాట్లాడుతూ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన హైదరాబాద్ నగర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక విజిన్‌తో ముందుకెళ్తున్నారని వివరించారు. సుమారు కోటి జనాభా ఉన్న నగరవాసులకు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని రకాల పౌరసేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
వీటిని మరింత మెరుగుపరిచేందుకు, ప్రజాసమస్యలు, వారి నుంచే వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ ఆఫీస్, ప్రత్యేక యాప్ వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నుంచి ప్రజలకు శాశ్వత ఉపశమనం కల్గించేందుకు గాను ఇటీవలే ప్రభుత్వం స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) కింద ప్రత్యేకంగా మల్టీలేవెల్ ఫ్లై ఓవర్లు, స్కైవేలు నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. దీంతో పాటు జిహెచ్‌ఎంసి కేవలం పౌరసేవల నిర్వహణ, అభివృద్ధిలోనే గాక, సామాజిక సేవలో తనవంతు పాత్రపోషించేందుకుగాను రూ. 5కే సబ్సిడీ ఆహార పథకాన్ని ఎంతో పకడ్బందీగా అమలు చేస్తోందని వివరించారు. నగరంలో అర్ధాకలితో అలమటించేవారికి మధ్యాహ్నం పూట భోజనాన్ని అందించేందుకు ప్రారంభించిన ఈ రూ. 5ల సబ్సిడీ ఆహార పథకాన్ని మున్ముందు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.
అంతేగాక, నగరంలో రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు గాను పచ్చదనాన్ని పెంపొందించేందుకు కాలనీ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రస్తుతమున్న పార్కులకు మెరుగైన నిర్వహణ కోసం కాలనీ సంక్షేమ సంఘాలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించాలన్న కీలకమైన నిర్ణయాలు ఇటీవలి కాలంలో తీసుకున్నట్లు ఆయన వివరించారు.

గ్రేటర్‌లో నీటి ఎద్దడిని నివారణ
జలమండలి ఎండి కార్యాలయం ముందు సిపిఎం ధర్నా
నీటి వ్యాపారం అరికట్టాలని
ఖాళీ కుండలతో ప్రదర్శన

హైదరాబాద్, ఏప్రిల్ 6: గ్రేటర్‌లో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ సిపిఎం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు ఖాళీ కుండలతో పాల్గొని కుండలను పగులగొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి సిపిఎం నగర కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఎం.మహేందర్, ఎం.దశరథ్, శశికళ, జి.విఠల్ పాల్గొని ప్రసంగించారు. వేసవి ప్రారంభంలోనే నగరంలో నీటి కష్టాలు పెరిగి అనేక ప్రాంతాల్లో సరఫరా సమయం, నీటి ప్రెజర్ తగ్గిపోయాయి. వాటర్ పైప్‌లైన్ లేని ప్రాంతాలో ట్యాంకర్లతో వారోనికి ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. శివారు ప్రాంతాల్లో అనేక కాలనీలు బస్తీల్లో ఈ సమస్య జటిలంగా తయారైందని చెప్పారు. గుడిసెవాసులకు, రాజీవ్ గృహకల్ప, వాంబే ఇళ్ల ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తూ సామాన్యులు, పేదల ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆరోపించారు. భారీ కంపెనీలకు నీటి సరఫరా పెంచారని విమర్శించారు. మంచినీటిని ఆదాయ వనరుగా, వ్యాపార సరుకుగా కాకుండా ప్రజలు జీవించే హక్కుగా భాగంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నీటిసరఫరా 355 ఎంజిడిలను సక్రమంగా పంపిణీ చేస్తే నీటి సమస్యలు ఉండవని, గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో సంపన్నులు ఉన్న ప్రాంతాలకు అత్యధికంగా వాటర్ టాంకర్లను కేటాయించడం సరికాదని దుయ్యబట్టారు. నగరంలోని 14వ డివిజన్‌లో 900 వాటర్ టాంకర్లతో జలమండలి నీటిసరఫరా చేస్తుండగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలున్న డివిజన్-6కు మాత్రం 200పైగా టాంకర్లను కేటాయించారని అన్నారు. వాటర్ పైప్‌లైన్ లేకపోవడంతో టాంకర్లపైనే ఆధారపడిన అనేక శివారు ప్రాంతాల బస్తీలకు వారానికి ఒకసారి మాత్రమే టాంకర్లతో నీటి సరఫరా అవుతుందని చెప్పారు. ప్రతిరోజు టాంకర్లతో నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. కార్మికవాడలు, గుడిసెల ప్రాంతాలకు ఉదయం తొమ్మిది గంటలలోపే టాంకర్లను సరఫరా చేయాలని, వివిధ ప్రాంతాల్లోని లేబర్ అడ్డాల్లో ఏర్పాటు చేసిన రూ..5 భోజన కేంద్రాల వద్ద జలమండలి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జంటనగరాలకు గోదావరి మొదటి ఫేజ్‌లో 172 ఎంజిడిల నీటిని డిసెంబర్ 2014 నాటికే వస్తాయని లోకాయుక్తకు నివేదిక అందించిన జలమండలి.. ఇప్పటివరకు కేవలం 86 ఎంజిడిల నీటిని మాత్రమే సరఫరా చేయగలిగిందని, గోదావరి నుంచి పూర్తిస్థాయిలో నీటిని నగరానికి రాబట్టేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధర్నాలో పాల్గొన్న మహిళలు, సిపిఎం నాయకులు ఖాళీ కుండలను జలమండలి కార్యాలయం ముందు పగలకొట్టి నిరసన వ్యక్తం చేసారు. జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణకు సిపిఎం గ్రేటర్ కార్యదర్శి శ్రీనివాస్ నాయకత్వంలో వినతిపత్రం సమర్పించారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ర్యాలీకి అనుమతించని పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించాలనుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌కు అత్యంత సమీపంలోనే ప్రధాని దిష్టిబొమ్మను కార్యకర్తలు దగ్దం చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ అధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి డి. శ్రీ్ధర్ బాబు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీ భవన్ ఆవరణ నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నారు.
ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయితే గేటు పక్కనే కొంత దూరం నడిచి దిష్టి బొమ్మను దగ్గం చేశారు.
అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారిస్తున్నదని, బిజెపియేతర, ఎన్డీయేతర ప్రభుత్వాలను కూల్చివేసి, రాష్టప్రతి పాలన విధిస్తున్నదని విమర్శించారు. ప్రజా సమస్యలను లేవదీస్తున్న ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ దేశ ద్రోహులతో దోస్తీ చేస్తున్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కిషన్‌రెడ్డి శక్తికి మించిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. హెచ్‌సియులో జరిగిన దారుణాలకు కేంద్రంలోని బిజెపి పాలనే కారణమని ఆయన విమర్శించారు.

దక్షిణ మండలం పరిధిలో
131 మందిపై రౌడీషీట్
హైదరాబాద్, ఏప్రిల్ 6: కాల్‌మనీ, బస్తీలో ఇతరులను తరుచుగా వేధిస్తూ, మహిళలు, బాలికల పట్ల విచక్షణ రాహితంగా ప్రవర్తించిన, వివిధ కేసుల్లో నిందితులైన దాదాపు 131 మందిపై దక్షిణ మండలం పోలీసులు రౌడీషీట్ తెరిచారు. బుధవారం పాతబస్తీ పూరాణిఅవేలిలోని డిసిపి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో డిసిపి వి.సత్యనారాయణ, అదనపు డిసిపి బాబురావు, ఏసిపి అశోక్‌చక్రవర్తితో కలిసి మాట్లాడారు. పాతబస్తీలో నేరాలను అదుపు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రధానంగా కొంతమంది అక్రమంగా ఫైనాన్స్‌లను నడుపుతూ అమయక ప్రజల వద్ద అధికంగా వడ్డీలు వసూళ్లు చేస్తున్నవారిపై కూడా కేసులు నమోదు చేశామని చెప్పారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్థించి అనేక నేరాలకు పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 131 మందిపై నూతనంగా రౌడీ షీట్స్ తెరిచిన్నట్లు తెలిపారు. వీరిలో 105 మందిపై 105 మందిపై రౌడీషీట్స్, 25 మందిపై అనుమానిత షీట్స్, ఒకటి సిడిసి కింద కేసు నమోదు చేసిన్నట్లు డిసిపి తెలిపారు. పాతబస్తీలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు శాఖపరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు. పాతబస్తీలోని ప్రతి పోలీస్టేషన్ పరిధిలో కార్డన్‌సెర్చ్, వివిధ గోడౌన్‌లపై దాడులు నిర్వహించి అనేక కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

మాల్ ప్రాక్టీస్: ఏడుగురి అరెస్టు
హైదరాబాద్, ఏప్రిల్ 6: ఇంటర్మీడియట్ దూర విద్యాకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో మాల్‌ప్రాక్టీకు పాల్పడిన కేసుకు సంబంధించి తొమ్మిది మందిలో ఏడుగురిని దక్షిణ మండలం టాస్క్ఫోర్సు, మొగల్‌పుర పోలీసులు కలిసి వల పన్ని పట్టుకున్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని మాల్ ప్రాక్టీస్‌లో సహాకరించిన పరీక్ష కోఆర్డినేటర్‌తో పాటు వివిధ కళాశాల, పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంచి తొమ్మిది ప్రశ్నపత్రాలతోపాటు అన్సర్‌షీట్స్, మూడుమోడల్ పేపర్లు, తొమ్మిది వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో మలక్‌పేట్‌కు చెందిన ప్రభుత్వ స్కూలు టీచర్ మహ్మద్ అబ్దుల్లా (47), జిల్లేలగూడాకు చెందిన ప్రభుత్వ స్కూలు టీచర్ పి.కోదాండరామారావు (44), ప్రభుత్వ కళాశాల లెక్చరార్ సయ్యద్ సాబేర్ (51), గ్యాలాక్సీ జూనియర్ కాలేజీ క్లర్క్ సయ్యద్ ఆరీఫ్ (24), సయ్యద్‌సమ్మద్ హుస్సేన్(35), మహ్మద్‌అబ్దుల్‌షర్జీల్(21), మహ్మద్ అఫ్జల్(27) ఉన్నారు. తప్పించుకున్న వారిలో మరో ఇద్దరు.. రాజు, ప్రభుత్వ సిటీ కాలేజీ లెక్చరర్ ఉన్నారు. విలేఖరుల సమావేశంలో డిసిపి వి.సత్యనారాయణ, అదనపు డిసిపి టాస్క్ఫోరు ఎన్.కోటిరెడ్డి పాల్గొన్నారు.

ఓటరు జాబితా సవరణ నిరంతర ప్రక్రియ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 74లక్షల పై చిలుకు మంది ఓటర్లుండటంపై ముందు నుంచే అనేక అనుమానాలున్నాయని, వీటిని నివృత్తి చేసేందుకు పూర్తి స్థాయిలో ఓటరు జాబితాను ప్రక్షాళన చేయనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పట్లో జిహెచ్‌ఎంసి పరిధిలో ఎన్నికలేమీ లేనందున, ఓటరు జాబితా సవరణను నిరంతర ప్రక్రియగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను జాబితాలో ఒకే ఫొటో, ఒకే తరహా సమాచారంతో నమోదైన ఓట్లను తొలగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇ-డూప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందని, దీంతో ఆటోమెటిక్‌గా బోగస్ ఓట్ల తొలగింపు జరుగుతుందని, దీనికి సమాంతరంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు, సర్కిల్ స్థాయి డిప్యూటీ కమిషనర్లు మాన్యువల్‌గా ఓటర్ల సవరణ జరుగుతుందని వివరించారు. దీంతో కావల్సినంత సమయాన్ని వెచ్చించి గ్రేటర్‌కు పారదర్శకతతో కూడిన ఓటరు జాబితాను తయారు చేసేందుకు మే నెలాఖరు వరకు తాము డెడ్‌లైన్‌గా గడువు నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణపై ధవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీల నేతలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో సుమారు 74లక్షల పై చిలుకు ఓటర్లున్నట్లు నమోదైన గణాంకాల పట్ల సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలతో పలు అనుమానాలున్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే సుమరా 19.71లక్షల ఓటర్లకు నోటీసులు జారీ చేశాయమని తెలిపారు. ఒకే రకం ఫొటో, సమాచారంతో సుమారు 7లక్షల పై చిలుకు ఓట్లు నమోదై ఉన్నాయని, ఇందులో హైదరాబాద్‌లోనే 4లక్షల 63వేల పై చిలుకు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన జాతీయ జనాభా నమోదు కార్యక్రమంలో భాగంగా కూడా ఈ ఓటరు జాబితా సవరణను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
రెండు, మూడు సార్లు వెళ్లండి
ఓటరు జాబితా సవరణ నూటికి నూరు శాతం జరిగేందుకు వీలుగా బిల్‌వోలు, సర్కిళ్ల వారీగా డిప్యూటీ కమిషనర్లు జాబితాపై తగిన పరిశీలన జరిపేందుకు ఒకటికి రెండు, మూడు సార్లు ఓటరు ఇంటికి వెళ్లి తనిఖీ చేయటం గానీ, ఇరుగుపొరుగు వారిని వాకబు చేసి గానీ ఓటరు ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని నిర్దారించుకోవాలని కమిషనర్ సూచించారు.

యుఎల్‌సి బాధితులకు ఉగాది కానుక
ఆంధ్రభూమిబ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఖజనా నింపుకునేందుకు ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణతో భారీ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చేసిన ప్రయత్నం సఫలీకృతం కాకపోవడంతో అనువైన స్థలాలను గుర్తించి వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (యుఎల్‌సి) పరిధిలోని స్థలాలను క్రమబద్ధీకరించేందుకు విధివిధానాలను రూపకల్పన చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల వద్ద వివిదాస్పదంగా ఉన్న సుమారు 1300 ఎకరాల యుఎల్‌సి భూముల వివాదానికి తెరపడనుంది.
యుఎల్‌సి భూముల క్రమబద్ధీకరణతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు అనువైన స్థలాల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో అన్యాక్రాంతమైన సుమారు 17వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు గతంలో వివిధ జీవోలు జారీ చేసినా వాటితో క్రమబద్దీకరించుకుని ప్రభుత్వానికి డబ్బు చెల్లించేందుకు ఎక్కువ శాతం మంది ఆసక్తి కనబర్చకపోవడంతో ఆదాయ వనరులను సమకూర్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో నివాస ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న చిన్నచిన్న విస్తీర్ణంతో పాటు అమ్మకానికి అనుకూలంగా ఉన్న స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.