హైదరాబాద్

వెళ్లిరా.. మళ్లీరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, బేగంపేట, సెప్టెంబర్ 23: ఎటు చూసినా వినాయక మండపాలు..ఎటు విన్నా జై బోలో గణేష్ మహారాజ్ కీ జై..అన్న నినాదాలే. ప్రతి మండపం ముందు విచిత్ర వేషధారణలు, యువకుల నాట్య విన్యాసాలతో నిమజ్జనం నేత్ర పర్వంగా కొనసాగుతోంది. బాలాపూర్, ఖైరతాబాద్ భారీ గణనాధుల నిమజ్జనానికి పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. పదకొండు రోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న ఆది దేవుడి నిమజ్జనం ఆదివారం ఆద్యంతం భక్తిశ్రద్ధలు, పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఘనంగా జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిమజ్జనం పూర్తి చేసుకుని ఆటోట్రాలీలో వెళ్తుండగా, ఆబిడ్స్‌లో ఆ వాహనం బోల్తా పడి నలుగురికి గాయాలయ్యాయి. చివరిరోజు కావటంతో ఆదివారం ఖైరతాబాద్ భారీ వినాయకుడ్ని దర్శించుకునేందుకు ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకోవటంతో పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఏడు గంటలకు గణనాధుడి నిమజ్జన ఊరేగింపు ప్రారంభమైంది. బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు తొమ్మిది గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు చార్మినార్ దాటించింది. అప్పటికే ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్‌లోని ఆరో నెంబర్ క్రేన్‌పై ఎక్కాడు. వినాయకుడికి అపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రత్యేక హారతి ఇచ్చిన తర్వాత నిమజ్జనం చేశారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి నిమజ్జన ఊరేగింపులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అలియాబాద్, గౌలీపురా, లాల్‌దర్వాజ, ఉప్పుగూడ, ఛత్రినాఖ, హుస్సేనీ ఆలం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఊరేగింపులు రాత్రి ఎనిమిదిన్నర గంటల కల్లా లాల్‌దర్వాజ మలుపునకు చేరుకున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా పాతబస్తీకి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి. ఇటు ఎన్టీఆర్ మార్గ్ వరకు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు. బేగంబజార్, ఎంజేమార్కెట్ ఇతరాత్ర ప్రాంతాల్లో వినాయక నిమజ్జన ఊరేగింపుల విషయంలో పోలీసులు, మండప నిర్వాహకుల మధ్య స్వల్ప వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌లలో ఏర్పాటు చేసిన 30 క్రేన్ల వద్ద నిమజ్జనం ఊపందుకుంది. రెండు నుంచి అయిదు అడుగుల లోపు ఎత్తు కల్గిన విగ్రహాల నిమజ్జనం తొంభై శాతం సాయంత్రం ఆరు గంటల కల్లా పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని 12 క్రేన్ల వద్ద ఒంటి గంట వరకు 500 విగ్రహాలు, నాలుగు గంటల కల్లా 1500, ఆరు గంటల కల్లా ఐదు వేల విగ్రహాలు, అలాగే రాత్రి ఎనిమిది గంటల కల్లా 6500 విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు తెలిపారు. హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ గగనతలం నుంచి ఏరియల్ సర్వే నిర్వహిస్తూ వివిధ శాఖలకు చెందిన క్షేత్ర స్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలిచ్చారు. పాతబస్తీలో పరిస్థితిని కమిషనర్ అంజనీ కుమార్ ఎప్పటికపుడు పర్యవేక్షించారు. నగర పోలీసు కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎప్పటికపుడు క్రేన్ల వద్ద భద్రతను, ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత వినాయక నిమజ్జనోత్సవాలతో పోలిస్తే ఈసారి నిమజ్జనానికి జనం తగ్గారని చెప్పవచ్చు. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ వినాయకుడ్ని ముందుగానే నిమజ్జనం చేయటంతో, చూసేందుకు వచ్చిన జనం ఒకింత అసంతృప్తికి గురయ్యారు. రెండు, మూడు అడుగుల నుంచి అయిదు అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాలు వేల సంఖ్యలో మధ్యాహ్నానికల్లా నిమజ్జనమయ్యాయి. ఖైరతాబాద్, బాలాపూర్ మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భారీ విగ్రహాల నిమజ్జనం సాయంత్రం ఏడు గంటల తర్వాత మొదలైంది. పాతబస్తీ నుంచి ఎంజేమార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్‌ల నుంచి లిబర్టీ మీదుగా వెళ్లే గణనాధులను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లించారు. వీటిలో నాలుగైదు అడుగుల ఎత్తు కలిగి, ఇంట్లో ప్రతిష్ఠించుకున్న చిన్న చిన్న విగ్రహాలను బీఆర్‌కే భవన్ చౌరస్తా, ఇక్బాల్ మినార్ వద్ద నుంచి యూ టర్న్ తీసుకుని ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలించారు. నిమజ్జనానికి వచ్చే దారిలో పోలీసుల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేసినా, మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా సాధారణ ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వరకు అనుమతించారు. మూడు గంటల వరకు పాతబస్తీకి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి.

పోలీసుల అత్యుత్సాహం :
బందోబస్తు, పోలీసుల బలగాల మోహరింపు ప్రజలను ఇబ్బందులను పెట్టేందుకు ఏ మాత్రం కాదని, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని పోలీసు కమిషనర్ ప్రకటించినా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా మారింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనదారులను అనుమతించలేదు. అప్పటికీ నిమజ్జనం ఊపందుకోక ముందే, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నా, అత్యవసర సేవలందించే సిబ్బందిని సైతం అనుమతించకపోవటం పలువుర్ని అసహనానికి గురి చేసింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద పార్కింగ్ చేసిన భక్తుల వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పోలీసు వాహనంలోకి ఎక్కించటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వాగత వేదికలు..ప్రసాద వితరణ:
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న వినాయక మండపాలకు అడుగడుగునా స్వాగతం పలికేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి మొదలుకుని పాతబస్తీ మీదుగా లిబర్టీ చౌరస్తా వరకు, మెహిదీపట్నం నుంచి మొదలుకుని తెలుగుతల్లి విగ్రహం వరకు, సికిందరాబాద్ బైబిల్ హౌజ్ మొదలుకుని లోయర్ ట్యాంక్‌బండ్ అమ్మవారి దేవాలయం వరకు వందలాది మంది స్వాగత వేదికలను ఏర్పాటుచేసి గణనాధులకు, మండప నిర్వాహకులకు ఘనంగా స్వాగతం పలికారు. గతంలో గణేష్ ఉత్సవ సమితి, బీజేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికల నుంచి ప్రముఖులు స్వాగతం పలికారు. వేదికలతో పాటు ఈసారి పలు వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలు వేర్వేరుగా ఏర్పాటుచేసి ప్రసాద వితరణ చేశాయి. నారాయణగూడ , హైదర్‌గూడ, ఎం.జె.మార్కెట్, బషీర్‌బాగ్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారసంస్థలు భారీగా ప్రసాద వితరణ నిర్వహించాయి.

ఆంక్షలు..అవస్థలు:
నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు అమలు చేసిన ఆంక్షలు వాహనదారులను అవస్థలపాలు చేశాయి. పలుచోట్ల పాదచారులు కూడా కష్టాలు పడకతప్పలేదు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల వాహనాలను అక్కడే పార్క్ చేసి, నడుచుకుంటూ రాగా, మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎట్టకేలకు ట్యాంక్‌బండ్ మీదకు చేరుకున్నారు. కాగా, పలు ప్రాంతాల్లో బారికేడ్లను కూలదోసి వాహనదారులు చొచ్చుకొని వచ్చారు.

చాంద్రాయణగుట్టలో...
చాంద్రాయణగుట్టలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రూ.2.45లక్షలకు గౌలిపుర ప్రాంతానికి చెందిన కే.సువర్ణచారి కైవసం చేసుకున్నాడు. చాంద్రాయణగుట్ట గాంధీ విగ్రహాం వద్ద యంగ్ స్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మండపం వద్ద జరిగిన వేలంలో రాచులూరి శ్రీహరిరాజ్ రూ.1.15లక్షలకు దక్కించుకున్నాడు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్.నవీన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గాజుల వెంకట్మ్రణ, నరేష్‌గౌడ్, ప్రమోద్‌కార్వంకార్, పీ.నరేష్ గౌడ్ పాల్గొన్నారు. చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్, ఫలక్‌నూమ, అలియాబాద్, లాల్‌దర్వాజ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వినాయకులను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వినాయకులు లాల్‌దర్వాజాకు చేరుకోవడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
జంగమ్మెట్‌లోని తెలంగాణ వీరభద్రీయ కుల సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహించారు. పండపంలో ఏర్పాటు చేసిర భారీ వినాయకుడికి సంఘం ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డీ.సత్యనారాయణ, కే.రఘునాథ్, కోశాధికారి జీ.ఈశ్వర్‌తో పాటు యవజన సంఘం ప్రతినిధులు కాటపల్లి మహేందర్ నాథ్, గిరిధర్, పవన్, ప్రదీప్, గిరి, లాడ్డు, కే.రవీచందర్, శ్రీనివాస్, సంజు, సత్యం తదితరులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాడ్డూ వేలం పాటలో కాటపల్లి సాయి రూ.41వేలకు సొంతం చేసుకున్నాడు. జంగమ్మెట్ శ్రీకృష్ణ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడి వద్ద లాడ్డూను రూ.56వేలకు యాదయ్య యాదవ్ కైవసం చేసుకున్నాడు.