రంగారెడ్డి

తెలంగాణలో నియంత పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ‘రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవం’ సందర్భంగా శనివారం చారిత్రాత్మక చార్మినార్ వద్ద సద్భావన కమిటీ చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన జరిగిన సభకు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజీవ్ సద్భావన అవార్డును మాజీ గవర్నర్ కే. రోశయ్యకు అందజేశారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును, మజ్లీస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని, ప్రధాని నరేంద్ర మోదీని తూర్పారబట్టారు. రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితి ఉందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని, ఒకవేళ మాట్లాడితే కొట్టిస్తారని, కేసులు పెడతారని ఆయన విమర్శించారు. పాతనగరానికి మెట్రో రైలు రాలేదు కానీ కేసీఆర్ మాత్రం రూ.300 కోట్లతో ఇల్లు నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు. మెట్రో రైలు వస్తే తమ రాత మారుతుందని ఆశించిన చిరు వ్యాపారులకు నిరాశే మిగిలిందన్నారు.
మద్దతు ఎందుకు?
బీజేపీకి టీఆర్‌ఎస్, మజ్లీస్ ఎందుకు మద్దతునిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బీజేపీకి మద్దతునిచ్చిందని, ఆ టీఆర్‌ఎస్‌తో మజ్లీస్ దోస్తీ చేసిందని ఆయన విమర్శించారు. పైగా ప్రధానికి మజ్లీస్ మద్దతునివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల్లోనూ బీజేపీకి మద్దతునిచ్చిందని ఆయన విమర్శించారు.
ముందస్తులో కాంగ్రెస్సే
బీజేపీ, టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా బతుకులు బాగుపడతాయని ఆశించిన వారందరికీ నిరాశే మిగిలిందన్నారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని ఆయన తెలిపారు.
దేశంలో మహిళలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని, మహిళలకు, మైనారిటీలకు రక్షణ కరువైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విద్వేషాలు రగిల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని, ఈ దేశం అందరికీ అని గుర్తించాలన్నారు.
విద్వేషాలు రగిల్చేందుకు ఒకవైపు, ప్రజల మధ్య ప్రేమ భావాలు పెంచేందుకు మరోవైపు కృషి జరుగుతున్నదని, ఈ రెండింటిలో మీరు ఎటు వైపు ఉంటారని రాహుల్ ప్రజలనుద్ధేశించి ప్రశ్నించారు. తాను శతృవుతో కూడా మాట్లాడుతానని ఆయన చెప్పారు.
పిచ్చి నిర్ణయం
నోట్ల రద్దు పిచ్చి నిర్ణయం అని ఆయన దుయ్యబట్టారు. నల్లధనం వెలికి తీసేందుకే నోట్ల రద్దు అన్నారని ఆయన చెబుతూ సంపన్నుల వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికే ఉపయోగపడిందని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు భారీ క్యూలైన్లలో నిలబడ్డారని, అంబానీ, విజయ్ మాల్యా వంటి ప్రముఖులు నిలబడలేదని ఆయన విమర్శించారు.
చౌకీదార్ కాదు చోర్
ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చౌకీదార్ కాదని, చోర్ అని ఆయన అంటూ ఈ మాట తాను అనలేదని, ఫ్రాన్స్ అధ్యక్షుడే అన్నారని తెలిపారు. వీర సావర్కర్ విగ్రహాన్ని ప్రధాని పార్లమెంటు ఆవరణలు పెట్టించారని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్ ప్రభృతులు అరెస్టయి జైలులో ఉన్నారని, ఆ సమయంలో వీర సావర్కర్ కూడా జైలుకెళ్లారని అన్నారు. అయితే తనను విడుదల చేయాలని, మీ పాదాలు పట్టుకుంటానని సావర్కర్ ఆంగ్లేయులకు లేఖ రాశారని రాహుల్ విమర్శించారు.
టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తేఉత్తమ్ హెచ్చరిక
టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లే అవుతుందని ప్రజలను హెచ్చరించారు. హిందు-ముస్లింలను విభజించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసీ టీఆర్‌ఎస్, బీజేపీలకు ఎందుకు మద్ధతునిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తాను చార్మినార్ సమీపంలోని యూనానీ ఆసుపత్రిలో జన్మించానని, ఓట్లు అడిగే హక్కు తనకే ఉందన్నారు. రాహుల్ కాబోయే ప్రధాని అని అన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో మాజీ ఎంపీలు వీ. హనుమంత రావు, రాపోలు ఆనంద భాస్కర్, అంజన్ కుమార్ యాదవ్, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
చాంద్రాయణగుట్ట నుంచి
హైదరాబాద్: చార్మినార్‌లో శనివారం నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావనా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభకు చాంద్రాయణగుట్ట నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీపీసీసీ నిర్వహణ కార్యదర్శి పర్వతాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. జంగమ్మెట్ ఇంజన్‌బౌలి నుంచి ఈ బైక్ ర్యాలీ అలియాబాద్, లాల్‌దర్వాజ మదుగా చార్మినార్ చేరుకుంది. పర్వతాల రాజేందర్ మాట్లాడుతూ రానున్నది కాంగ్రెస్ పాలనేనని, దేశ ప్రజలు రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడి పాలనతో విసుగు చెందిన అన్ని వర్గాల ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓటు అనే అయుధంతో సరైన బుద్ధి చెబుతారని అన్నారు.