హైదరాబాద్

భేష్.. గడువుకు ముందే పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనులు ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన మైండ్ స్పేస్ ఫ్లైఓవర్‌ను 16నెలల్లోనే పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవటం పట్ల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలందర్ కుమార్ జోషీ.. జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. శుక్రవారం ఉదయం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్‌తో కలిసి మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో అనుసరించిన విధానం, పనులు చేపట్టిన తీరు, ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వాహనదారులకు కలిగే ప్రయోజనాలను జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీ్ధర్ వివరించారు. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన ఈ ఫ్లైఓవర్ జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ల ప్రత్యేక చొరవ, స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించటంతో 16నెలల్లోనే పూర్తి చేయగలిగామని వివరించారు. కొంతకాలం క్రితం అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్, ఎల్‌బీనగర్ కామినేని ఆసుపత్రి వద్ద ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ త్వరలోనే మరికొన్ని ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కల్గించనున్నట్లు శ్రీ్ధర్ వివరించారు.
ట్రాఫిక్ జోన్‌గా చెప్పుకునే మైండ్‌స్పేస్, ఐటీ కారిడార్ మధ్య ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావటంతో ఇకపై రాకపోకలు మరింత వేగంగా సాగి, ట్రాఫిక్ సమస్య తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఎంతో ముందుచూపుతో, ఓ ప్రణాళిక బద్దంగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్ణీత గడువులోపు పూర్తి చేసిన జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు మిగిలిన పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, నగరంలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎస్ సూచించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన పాల్గొన్నారు.

నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ బ్రాంచి పునఃప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 9: దేశంలోని అన్ని ప్రముఖ పబ్లిషర్స్ ముద్రించే అన్ని రకాల పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ చిక్కడపల్లి బ్రాంచిని పునఃప్రారంభించినట్లు శాఖ జనరల్ మేనేజర్ కోయ చంద్రమోహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శాఖను శనివారం సాయంత్రం ఐదు గంటలకు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కోశాధికారి పీ.రాజేశ్వర రావు, రచయిత్రి శిలాలోలిత, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.రఘు, శంకరం వేదికకు చెందిన యలపర్తి రాజేంద్రప్రసాద్, మలుపు పబ్లికేషన్‌కు చెందిన బాల్‌రెడ్డి, యూటీఎఫ్ తరపున చావ రవి, కేవీపీఎస్ నుంచి స్కైలాబ్‌బాబు, ఎస్‌ఎఫ్‌ఐ నుంచి కోట రమేశ్ హాజరుకానున్నట్లు చంద్రమోహన్ తెలిపారు.

సందడిగా సదర్ ఉత్సవాలు
మెహిదీపట్నం, నవంబర్ 9: దీపావళి పండుగ పురస్కారించుకుని కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో యాదవులు సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యాదవ్‌లు నిర్వహించే ప్రతిష్టాత్మక పండుగ సదర్ ఉత్సవాలకు ఏర్పాట్లు భారీగా చేశారు. కార్వాన్, జియాగూడ, లంగర్‌హౌస్, గుడిమల్కాపూర్ డివిజన్‌లలో సదర్ ఉత్సవాలలో అత్యంత ఖరీదైన దున్నలను యాదవ్‌లు తీసుకవచ్చారు. దున్నలను అందంగా ముస్తాబు చేశారు. దున్నలను బ్యాండ్ మేళాలతో ఉత్సవాలను నిర్వహించారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దున్నపోతులకు పోటీలు నిర్వహించారు. విజేత యాజమానికి బహుమతులను పంపిణీ చేశారు. వీటిని చూడటానికి పలు ప్రాంతాలలోని జనం పెద్ద ఎత్తున వచ్చి తిలకించారు. కాగా బీజేపీకి చెందిన అభ్యర్థి అమర్ సింగ్.. సదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆకుల గోవర్ధన్ రావు, వినేష్ సింగ్, ఇంద్రాసేనా రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్: దీపావళి పర్వదినం అనంతరం యాదవులు ఆత్మీయంగా నిర్వహించే సదర్ ఉత్సవాలను మేడ్చల్‌లో గురువారం రాత్రి ఆట్టహసంగా నిర్వహించారు. మేడ్చల్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆరవణలో మేడ్చల్ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజలతో పాటు ఆయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆదరగొట్టే తరహాలో దున్నపోతుల విన్యాసాలను ఎంతో అసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, సంఘం మండల అధ్యక్షుడు మధుకర్ యాదవ్, నాయకులు నర్సింహా, సత్యనారాయణ పాల్గొన్నారు.