హైదరాబాద్

‘అన్నపూర్ణ’కు చోటు కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉన్నత లక్ష్యంతో రూపుదిద్దుకున్న రూ.5 భోజన పథకానికి కొంత మంది తూట్లు పొడుస్తున్నారు. తమ వ్యాపారాలకు అడ్డుగా ఉందన్న అక్కసుతో అన్నపూర్ణకు చోటులేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణకు రోజురోజుకు పేద వర్గాల ఆదరణ చూరగొంటుంటే అదే సమయంలో సమీప ప్రాంతాల్లో హోటళ్లు, క్యాంటిన్లు నిర్వహించుకునే యజమానులు మాత్రం అదే స్థాయిలో ఈ పథకంపట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే నిమ్స్‌లో జరుగుతున్న సంఘటన. పేదలకు తక్కువ ఖర్చుతో కార్పోరేట్ వైద్యం అందిస్తున్న నిమ్స్ ఆసుపత్రికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు సైతం వస్తుంటారు. నిత్యం రెండు వేల మందికి పైగా అవుట్ పేషెంట్లుగా నిమ్స్‌కు వస్తే, సుమారు 1200 మంది రోగులు ఇన్‌పేషెంట్లుగా ఉంటారు. ఇందులో అత్యధికులు పేద కుటుంబాలకు చెందినవారే ఉంటారు. ఇలాంటి వారికి కనీసం ఒక్క పూటైనా అన్నం పెట్టే సదుద్దేశంతో నిమ్స్‌లో రూ.5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం ఐదు వందల మంది వరకు ఇక్కడ తమ ఆకలి తీర్చుకుంటున్నారు. రోగులు, వారి సహాయకులతో పాటు ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బందికి కడుపు నింపుతుంది.
మొదట్లో భోజన కేంద్రాన్ని ఆసుపత్రి మొదటి గేట్ సమీపంలోని క్యాంటిన్ వద్ద ఏర్పాటు చేశారు. ఆసుపత్రి యాజమ్యానికి అతి తక్కువ అద్దె చెల్లిస్తూ లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు క్యాంటిన్ యజమాని దీనిని తరలించాలని పట్టుపట్టారు. అధికారులు స్పందించక పోవడంతో ఒత్తిడి తెచ్చి కొంత కాలానికి సమీపంలోనే మరోచోటికి తరలించారు. అప్పటికీ భోజన కేంద్రంతో తన వ్యాపారానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రగిలిపోయిన సదరు యజమాని తిరిగి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈసారి కేంద్రాన్ని మొదటి గేట్ వద్ద నుంచి నిమ్స్‌లోని పార్కింగ్ స్థలానికి సమీపంలో ఉన్న మరో ప్రాంతానికి తరలించారు. ఇది కొందరు రోగులకు సౌకర్యవంతంగా ఉండేది. చుట్టు చెట్లు ఉండటం, నిమ్స్‌కు మధ్యలో ఉండటంతో ఇబ్బందులు లేకుండా నీడపట్టున ఉండి భోజనం చేసేవారు. కాగా కేంద్రానికి సమీపంలో ఉండే కొనసాగుతున్న మరో క్యాంటిన్ నిర్వహకులు దీనిని వ్యతిరేకించి, తరలించాలని అధికారుల వెంటపడ్డారు. మొదట వీరి మాట పట్టించుకొని అధికారులు ఒత్తిడి పెంచడంతో అక్కడి నుంచి సైతం ముచ్చటగా మూడవ ప్రాంతానికి తరలించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆసుపత్రిలోని పార్కింగ్ స్థలంలో ఓ మూలన భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో పాటు చెట్ల నీడ కరువు అయింది. మరో రెండు నెలల్లో వేసవి రానుండటంతో రోగులు, వారి సహాయకులు సదరు కేంద్రం వద్ద భోజనం చేసే అవకాశమే లేకుండా పోతుందని వాపోతున్నారు. నిమ్స్ అధికారులు క్యాంటిన్ల నిర్వాహకులతో కుమ్మకు కావడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు. వేలాదిగా తరలివస్తున్న రోగులు చెల్లించే ఫీజులతో లక్షల్లో వేతనాలు పొందుతున్న అధికారులు ఈ తరహాగా వ్యవహరించడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశంలో భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.