హైదరాబాద్

బొట్టు బొట్టు.. ఒడిసి పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిమ్మిటి శ్రీ్ధర్
హైదరాబాద్: ప్రపంచ కాల గమనాన్ని శాసించే పంచ భూతాల్లో ఒకటి నీరు. భూమిపై మనుగడ సాగించే ప్రతి జీవికి మరో ప్రాణం.. పర్యావరణ విధ్వంసంతో వికృత రూపాల్లో సాగుతున్న అభివృద్ధి, ఎప్పటికపుడు పెరిగిపోతున్న పట్టణీకరణ, కమ్ముకొస్తున్న కాలుష్యంతో జీవ జలం కనుమరుగవుతోంది. పట్టణీకరణ నేపథ్యంలో అడవులను నరికేయటంతో ఎప్పటికపుడు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వర్షాభావం తగ్గుతూనే ఉంది. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుతో ప్రాణాలను నిలబెట్టే నీరు ప్రకృతి కనె్నర్ర చేసినపుడు అపారమైన నష్టాన్ని కలిగించి, ప్రజలకు కన్నీళ్లు మిగిలిస్తోంది. పట్టణాల్లో తాగు, పల్లెల్లో సాగునీరు కనుమరుగవుతూ పర్యావరణ సమతుల్యత, మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. నీటిపైన ఆధారపడి జీవిస్తున్న ప్రాణాలకు ఎన్నో గడ్డు పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రకృతి పరంగా వర్షాలు కురిసేందుకు పర్యావరణ పరంగా అవకాశాలు అంతంతమాత్రమే. ఒకవేళ కురిసినా, వర్షం నీటిని కాపాడుకునేందుకు సరైన వ్యవస్థ అందుబాటులో లేకపోవటం దురదృష్టకరం. ఈ క్రమంలో పాలకుల నిర్లక్ష్యం, ప్రజల అవగాహనరాహిత్యంతో గుక్కెడు నీటి కోసం జనం అనేక రకాల అవస్థలు పడుతోంది. అవసరాలు తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయంగా బోర్లు వేసి నీటిని సమకూర్చుకుంటున్నా, రోజురోజుకీ మిలియన్ల గ్యాలన్లలో వినియోగం పెరగటంతో నగరంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. కొన్ని చోట్ల వెయ్యి, 1500, రెండు వేల, మూడు వేల అడుగుల లోతు వరకు బోర్లు వేసినా, నీరు పడని దుస్థితి.
‘చుక్క’కోసం చుక్కలు చూడాలా?
విచ్చలవిడి వినియోగం.. మొక్కుబడిగా నీటి పరిరక్షణ చర్యలే కారణాలుగా చెప్పవచ్చు. ఈ రకమైన నిర్లక్ష్యం, నిర్లప్తత కొనసాగితే భావితరాలు చుక్క నీటి కోసం చక్కలు చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం కూడా నగరానికి తాగునీటిని అందించే జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటిపోవటం, అత్యవసర పరిస్థితుల్లో నగరవాసుల గొంతు తడిపే సింగూరు జలాశయంలో కూడా నీటి మట్టం పెరిగిపోవటంతో మున్ముందు తాగునీరు ఎలా అనే అంశంపై ప్రభుత్వం, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలో నగరవాసులు తన బాధ్యతను ఎరిగి కనీసం నీటిని పొదుపును అలవాటు చేసుకోవాలి. ఒక్కో బొట్టు నీటిని ఇప్పటి నుంచి పొదుపుగా వాడుకోవటం, చెరువులు, కుంటలు వంటివాటిని పరిరక్షించుకుంటే తప్ప నీటి సమస్యను అధిగమించలేం. కనీసం ఇప్పటి నుంచైనా నీటి పొదుపుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, వారిని అవగాహనవంతులను చేయటంతో పాటు నీటి విలువ తెలియజేసి, స్వచ్చంధంగా ప్రతి ఒక్కరూ నీటిని రక్షించుకునేందుకు నడుం భిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మేల్కొకుంటే మున్ముందు భావితరాలు గుక్కెడు నీటి కోసం చుక్కలు చూడాల్సిన దుస్థితి నెలకొందన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని ముఖ్యమైన విషయాలు
* హైదరాబాద్ నగరవాసులు వాడుకునే గోదావరి నీరు మనకు 186 కిలోమీటర్ల దూరం నుంచి వస్తోంది.
* కృష్ణాజలాలు 120 కిలోమీటర్ల దూర నుంచి వస్తున్నాయి.
* తీవ్ర వర్షాభావం ఏర్పడిన ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ నెలాఖరు నుంచి నగరంలో నీటి ఎద్దడి మరింత ఏర్పడే అవకాశముంది.
* నీటిని పొదుపుగా వినియోగించేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలి
* కూరగాయలు నల్లాకింద కడగటం వల్ల 20లీటర్ల నీరు వృథా అవుతోంది. ఒక లీటరు నీరుతో అయ్యే పనికి 20 లీటర్ల నీటిని వృథా చేస్తున్నట్లు అధ్యయనాలు తేల్చటంతో ఈ రకమైన వృథాను అరకట్టడం మనందరి బాధ్యత
* నోట్లో బ్రష్ చేసుకునేటపుడు వాష్ బేసిన్‌లో నల్లా అదే పనిగా వదిలితే నీరు వృథా అవుతుంది, ఒకే మగ్గు నీళ్లతో అయ్యే పనికి లీటర్ల కొద్ది నీరు వృథా చేయటం మంచిదేనా..ఆలోచించండి!
* బకెట్‌లో నీటిని పోసుకుని స్నానం చేసే ఇరవై లీటర్లు సరిపోతోంది. షవర్ కింద స్నానం చేస్తే 70 లీటర్ల నీరు వృథా అవుతోంది.
* నల్లాకు పైప్ పెట్టి వాహనాలు కడిగితే 75 నుంచి 150 లీటర్ల నీరు వృథా అవుతోంది. కేవలం ఒక బకెట్ నీటితో వాహనాన్ని శుభ్రం చేసుకోవచ్చు.
* మన ఇంట్లో నల్లాను సరిగ్గా కట్టేయకపోటవంతో లీకేజీ కారణంగా రోజుకి 45 లీటర్ల నీరు వృథా అవుతోంది. అందుకే నీటిని పొదుపుగా వాడుదాం...భవిష్యత్తును కాపాడుకుందాం!
‘నీటి పునర్వినియోగం’పై శ్రద్ధ ఏదీ?
అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో నీటి అత్యాధునిక ఎస్‌టీపీల సహాయంతో శుద్ధి చేసి పునర్వినియోగించటంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ, ఈ విషయంలో మనదేశంలోని అన్ని మహానగరాలు, పట్టణాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో జలమండలి కొంత మేరకు ప్రయత్నం చేసినా, అది ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టు తయారైంది. నీటిని శుద్ధి చేసి మొక్కలకు, భవన నిర్మాణం, పారిశ్రామిక వాడాల్లో ఇతర అవసరాల కోసం వినియోగించవచ్చుననే అంశంపై సరైన అవగాహన లేకపోవటం వల్లే పునర్వినియోగంలో మనం ముందుకు సాగటం లేదు.
బాధ్యత మరిచిన ప్రభుత్వ విభాగాలు
కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ వంటి మహానగరాల్లో భూగర్భ జలాల పరిరక్షణకు వివిధ ప్రభుత్వ శాఖలు బాధ్యతను మరిచాయి. నగరంలోని కోటి మంది జన జీవనాన్ని ప్రభావితం చేసే జలమండలి, జీహెచ్‌ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి భూగర్భ జలాల పరిరక్షణ కోసం ఆశించిన స్థాయిలో కృషి చేయటం లేదు. వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకిపోయేందుకు వీలుగా ఇప్పటికే ఇంకుడు గుంతల నిబంధన అమల్లోకి వచ్చింది. కానీ కొత్తగా ఎంతో పకడ్బందీగా, పటిష్టంగా అమలు చేసిన జీహెచ్‌ఎంసీ ఇపుడు కేవలం భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుదారుడు చెల్లిస్తున్న వాటర్ హార్వెస్టింగ్ ఛార్జీలను మాత్రమే స్వీకరించి, పనైపోయిందనుకుంటోంది. శివార్లలోని పలు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లోనూ హార్వెస్టింగ్ పిట్‌ల ఏర్పాటుపై స్వచ్ఛంద సంస్థలతో అవగాహన శిబిరాలను నిర్వహించిన జలమండలి నేటికీ వాటర్ హార్వెస్టింగ్ పిట్‌ల లక్ష్యాన్ని చేరుకోలేకపోవటం గమనార్హం.