హైదరాబాద్

‘ఇంకుడు’తో ముంపు నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ వరద నీటి కాలువలు కనుమరుగైపోవటం, నాలాలు కబ్జా పాలై బక్కచిక్కిపోవటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినపుడు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నగరంలో 11 సెంటమీటర్ల వర్షం కురిసి, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాంతంలో పలు దఫాలుగా పర్యటించిన కమిషనర్, జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, టౌన్‌ప్లానింగ్ అధికారులు తరుచూ ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకిపోవటమే ప్రధాన మార్గమని భావిస్తున్నారు. సరిగ్గా 19 ఏళ్ల క్రితం నగరంలో వరదలు సంభవించినపుడు, ఇలాంటి పరిస్థితులు మున్ముందు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై అప్పటి ప్రభుత్వం నియమించిన కిర్లోస్కర్ కమిటీ నివేదిక ప్రకారం ప్రతి వర్షాకాలానికి ముందు నాలాల్లోని పూడికను తీయటంతో పాటు వాటిపై వెలసిన ఆక్రమణలను తొలగించి, వాటిని విస్తరించుకోవాలని సూచించింది. కానీ, పట్టణ ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యలు అనే అంశంపై ఇటీవలే నగరంలో అధ్యయనం నిర్వహించిన జేఎన్‌టీయూ ఇచ్చిన నివేదికలో నాలాల ప్రస్తావన లేకపోయినా, ఎక్కడికక్కడ నీరు భూమిలోకి ఇంకిపోయేలా చర్యలు చేపడితే ముంపు ముప్పు నుంచి కొంత వరకు బయట పడవచ్చునని సమర్పించిన నివేదికలను ఇపుడు అమలు చేసేందుకు బల్దియా సిద్ధమవుతోంది. సంవత్సరంలో నాలుగు నెలల వర్షాకాలం సీజన్‌లో కేవలం పక్షం నుంచి నెలరోజులు మాత్రమే పొంచి ఉన్న ముంపు భయంతో భారీ అపార్ట్‌మెంట్లు వంటివి తొలగించటం సమంజసం కాదని అధికారులు సైతం భావిస్తున్నారు. కొంతకాలం క్రితం అకాల వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతల కారణంగా ముంపు తీవ్రత కొంత వరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. దీప్తిశ్రీనగర్ కాలనీ, పటేల్ చెరువు నుంచి గంగారం చెరువు వరకు గతంలో ముంపు సంభవించినా, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఇపుడు భిన్నంగా మారాయని పేర్కొంటున్నారు. భూమిలోకి నీరు ఇంకే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెబుతున్నారు. గతంలో దుర్గం చెరువు నుంచి మల్కం చెరువు, అక్కడి నుంచి ఇబ్రహీంబాగ్ చెరువు, అక్కడి నుంచి మూసీ వరకు వరద నీరు సక్రమంగా ప్రవహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఉండేదని, ఇపుడు దుర్గం చెరువు నుంచి మల్కం చెరువు వరకు ఆ వ్యవస్థ సక్రమంగానే ఉన్నా, ఇబ్రహీంబాగ్ చెరువు నుంచి మూసీ వరకు ప్రవహించే వ్యవస్థ పట్టణీకరణతో కొంత కనుమరుగు కావటంతో వ్యవస్థను పునఃవ్యవస్థీకరించాల్సి ఉందని, ఇందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.