హైదరాబాద్

ప్రభుత్వం కంటే పార్టీ ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రభుత్వానికంటే పార్టీ ముఖ్యం, పార్టీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట కవిత అన్నారు. పాత, కొత్త కలయికలతో పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని, పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని ఆమె అన్నారు. ఈ నెల 27న ఖమ్మంలో జరుగనున్న పార్టీ ప్లీనరీ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించగా, కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు మార్గదర్శకంగా, ఆదర్శంగా తీసుకుంటున్నాయని కవిత కొనియాడారు. గత కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఏ పథకాన్ని అయినా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించి ఆంధ్రకు తీసుకెళ్లేవారన్నారు. ప్రారంభోత్సవాలు రంగారెడ్డికి లబ్ధి ఆంధ్రకు చేకూరేదని ఆమె విమర్శించారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లాకు అప్పటి ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా రూ. 176 కోట్లు ఇవ్వగా, అందులో కేవలం రూ. 26 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కవిత విమర్శించారు. మరి దీనికి చేవెళ్ల చెల్లమ్మ సబితా ఇంద్రారెడ్డి ఏమి సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాజకీయ పార్టీగా మారిందని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీని బలోపేతం చేసి మరో 20 ఏళ్ళపాటు అధికారంలో కొనసాగేలా గట్టి పునాదులు వేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లాలో 63 కార్పొరేటర్ స్థానాలు ఉండగా అందులో 59 స్థానాలను గెలుచుకొని పార్టీ రికార్డు సృష్టించిందన్నారు. ఈ విజయం కార్యకర్తల కృషి ఫలితమేనని మంత్రి అన్నారు. రంగారెడ్డి జిల్లాను కృష్ణా, గోదావరి నదుల ద్వారా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు నిర్మాణం కానున్నాయన్నారు.
జిల్లాలో కాంగ్రెస్, టిడిపి, బిజెపీలు కనుమరుగు కాగా, కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయిందన్నారు. జిల్లాలో టిఆర్‌ఎస్‌ను తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్యకర్తల భుజాలపైనే ఉందన్నారు. ఖమ్మంలో జరుగబోయే ప్లీనరీని విజయవంతం చేయడంలో రంగారెడ్డి జిల్లా ముందుండాలని మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.