హైదరాబాద్

త్వరలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరం పరిధిలోని అక్రమ లే అవుట్లలో ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఇదివరకే లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) కింద స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి బల్దియా మరో ప్రయత్నం చేయనుంది. గతంలో సర్కిళ్ల స్థాయిలో ప్రత్యేక మేళాలను నిర్వహించినా, ఫలితం దక్కకపోవటంతో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి ఆదాయం సమకూర్చేందుకు అధికారులు మరో ప్రయత్నం చేయనున్నారు. అంతేగాక, వచ్చే నెల 31వ తేదీలోపు స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేయటంతో ఈ నెల 30వ తేదీన నగరంలోని అన్ని సర్కిల్ ఆఫీసుల్లో ప్రత్యేక మేళాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ఆయన శుక్రవారం ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద జీహెచ్‌ఎంసీకి మొత్తం 85వేల 291 దరఖాస్తులు అందగా, వీటిలో 28వేల 935 దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి, ప్రొసీడింగ్‌లను జారీ చేసినట్లు తెలిపారు. వీటిలో 20వేల 425 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 25వేల 726 దరఖాస్తులకు కావల్సిన ఇతర డాక్యుమెంట్లు, పత్రాలను జతపర్చాలని దరఖాస్తుదారులకు సమాచారం అందించగా, వీటిలో 25వేల 516 దరఖాస్తులకు సంబంధించి కావల్సిన ఇతర పత్రాలను కూడా జతపర్చినందున దరఖాస్తులు స్వయంగా సంబంధిత సర్కిల్ ఆఫీసులకు వచ్చి ఆమోదం పొందేందుకు వీలుగా ఈ నెల 30న ప్రత్యేక మేళాను నిర్వహించనున్నట్లుల తెలిపారు. జీహెచ్‌ఎంసీకి సంబంధించి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటికి మరో వారం రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. హైకోర్టులో టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి కంటెప్ట్ కేసులన్నింటికీ వారం రోజుల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సూచించారు.
పలు కేసుల విషయంలో వ్యక్తిగత హాజరుకావాలని వచ్చిన కోర్టు ఆదేశాలకు సంబంధించిన కేసులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన కేసులు హైకోర్టులో దాఖలు కాగానే వాటికి కౌంటర్లు వేయటం, ఆయా కేసులపై తగిన చర్యలు చేపట్టాలని, నిబంధనలను అనుసరించి పనిచేయని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ హెచ్చరించారు.
వివిధ కేసులకు సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ చేయగానే, వెంటనే ఆదేశాలు అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. ఈ సమావేశానికి చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి, ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కే.శ్రీనివాసరావు, టౌన్‌ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు.

ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి
మోమిన్‌పేట, నవంబర్ 8: ఇంకుడుగుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని ఎంపీడీవో శైలజా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం బూర్గుపల్లిలో ఇంకుడుగుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇంకుడుగుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకుడు మాణయ్య పాల్గొన్నారు.
అక్రమంగా బ్యాటరీ పరిశ్రమలు
* ఎస్‌ఓటీ పోలీసుల దాడులు
రాజేంద్రనగర్, నవంబర్ 8: నిబంధనలను అతిక్రమించి ఇష్టానుసారంగా కొనసాగుతున్న బ్యాటరీ పరిశ్రమలపై శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. కాటేదాన్ పారిశ్రామికవాడలో నిబంధనలకు విరుద్ధంగా కొంత కాలంగా బ్యాటరీ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ఎస్‌వోటీ పోలీసు అధికారి రవీందర్ నేతృత్వంలో సిబ్బంది మూడు పరిశ్రమల్లో ఏకదాటిగా దాడులు చేశారు. నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా బ్యాటరీ పరిశ్రమలలో రసాయన సీసం బట్టీలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పరిశ్రమలపై దాడులు చేసి లక్ష రూపాయలు విలువ చేసే బ్యాటరీ సీసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.

బండ్లగూడకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ రాక
నార్సింగి, నవంబర్ 8: బండ్లగూడలోని శ్రీశారదాధామానికి డిసెంబర్ 29న ఆర్‌ఎస్‌ఎస్ ఛీప్ మోహన్ భగవత్ రానున్నట్లు విద్యాభారతి దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం శారదాధామంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీసరస్వతి శిశుమందిరాల్లో చదివిన పూర్వ విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. పూర్వ విద్యార్థులైన తెలంగాణ మంత్రి హరీష్ రావు, బీజేపీ నాయకుడు రామ్‌మాధవ్, రాష్ట్ర ఆర్‌ఎస్‌ఎస్ కార్యదర్శి కాచం రమేష్, రాష్ట్ర సేవికా సమితి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సీత హాజరుకానున్నట్లు వెల్లడించారు.

పరిశుభ్రత.. పచ్చదనం
* బోడుప్పల్‌లో ఫ్లెక్సీలు, బోర్డుల తొలగింపు
* ప్లాస్టిక్ వినియోగంపై జరిమానా
ఉప్పల్, నవంబర్ 8: మన నగరం.. మన బోడుప్పల్ కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన పరిశుభ్రత, పచ్చదనం కింద అధికారులు సిబ్బందితో కలిసి నగర శుద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రధాన రహదార్లతో పాటు కాలనీలలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బోర్డులను తొలగించి హరితహారం కింద నాటిన మొక్కలకు నీటిని సరఫరా చేసి పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. కాలనీలలో వీధి దీపాలను ఏర్పాటు చేసి వారాంతపు సంతలో నిషేద ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్న దుకాణాదారులకు జరిమానా విధించారు. ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్ క్లియర్‌కు
కార్యాచరణ సిద్ధం చేయాలి
ఉప్పల్, నవంబర్ 8: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో 36 వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇట్టి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సంస్థ కార్యదర్శి ఎం.రాంకిషన్ ఆదేశించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రతి ఉద్యోగి సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. శుక్రవారం సంస్థలో జరిగిని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ఈనెల 11 నుంచి పని చేయాలని, 17వేల మంది దరఖాస్తులను ఆమోదించినప్పటికీ సంబధిత దరఖాస్తుదారులు రుసుం చెల్లించనందున వారందరికీ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించాలని అన్నారు. 9వేల దరఖాస్తులు ఇంకా కొన్ని పత్రాలు సమర్పించాలని కోరినందున వారందరు తక్షణమే సదరు పత్రాలను అందించేట్లు చూడాలని పేర్కొన్నారు. సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను 13వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. వివరాలకు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు. ప్లానింగ్ డైరెక్టర్లు శ్రీనివాస్, నరేంద్ర, అపర్ణ, సీఈఓ శరత్ చంద్ర, సీఐఓ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.
పుస్తకాలు ‘మేథోశక్తి’ని పెంచుతాయి
కాచిగూడ, నవంబర్ 8: విద్యార్థులు పుస్తకాలను చదవడంతో మేథోశక్తి పెంపొందుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్ అన్నారు. ప్రముఖ రచయితలు బేహరా ఉమా మహేశ్వర రావు, బెలగాం భీమేశ్వర రావు రచించిన ‘తెనాలి రామలింగడు, నానిబాబు సాహస యాత్ర’ బాల సాహిత్య గ్రంథాలు ఆవిష్కరణ సభ సరోజారాయ్ కమ్యూనికేషన్స్, మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లక్ష్మణ్ పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు.
విద్యార్థులకు చిన్నతనం నుంచే పుస్తకాలను చదివించాలని సూచించారు. రెండు పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త డా.పత్తిపాక మోహన్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట రమణ, సంస్థ అధ్యక్షుడు డా.హిప్నో కమలాకర్ పాల్గొన్నారు.

లక్ష్యాలను ఎంచుకోవాలి
వనస్థలిపురం, నవంబర్ 8: విద్యార్థులు చెడుదారులను ఎంచుకోకుండా డిగ్రీ నుంచే తమ లక్ష్యాలను ఎంచుకోవాలని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నాగోలులోని శుభం కనె్వన్షన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన అవంతి డిగ్రీ, పీజీ కళాశాలల ఉమాంగ్-2కే19 27వ ప్రేషర్స్‌డే వేడుకలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి, అవంతి విద్యాసంస్థల చైర్మన్ ఎం.శ్రీనివాస్ రావు హాజరై ప్రారంభించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్నేహపూర్వమైన వాతవరణంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకపోతున్నాయని గుర్తు చేశారు. కష్టపడి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఏపీ మంత్రి, అవంతి విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ భారత్‌కు ఎప్పుడు సూపర్ హీరో స్వామి వివేకానంద అని, అతని సూక్తులు, ఆలోచనలను పాటించి ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరాలని చెప్పారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, భారత దేశంలో మానవ వనరులు అధికంగా ఉన్నాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ డైరెక్టర్ దినకర్ బాబు, రవి కుమార్ పలి, సంతోష్ నాగార్జున, మురళీకృష్ణ కొండేటి, అవంతి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి ఎం.ప్రీయాంక, ఎండీ ఐ.శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షులు నందిని, ప్రిన్సిపాల్ జే.శివకుమార్, డైరెక్టర్లు వై.జయప్రద, డీ.వెంకట్ రావు పాల్గొన్నారు.

సంగం జాతర ఏర్పాట్లు ప్రారంభం
మెహిదీపట్నం, నవంబర్ 8: కార్తీక పౌర్ణమి పండుగ పరుస్కారించుకుని సంగం దేవాలయం వద్ద పవిత్ర సంగమంలో స్నానాలు ఆచేరించేందుకు నగరంలోంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా వేలాది మంది భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ వెలిసిన శ్రీసీతారామాలక్ష్మణులను దర్శించుకుంటే భక్తులకు కోరిన కోర్కెలు నేరవేరుతాయని ఇక్కడి నానుడి. దీంతో నాటి నుంచి నేటి వరకు సంగం జాతరకు భారీగా తరలివచ్చి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. లంగర్‌హౌస్ బాపూఘాట్ సంగం వద్ద ఉన్న శ్రీరామచంద్ర మఠం పక్కనుంచి ఈసీ, మూసీల సంగం కలయికతో త్రివేణి సంగం నదిగా ఏర్పడింది. ఈ సంగం నదిలో చనిపోయిన వారి ఆస్తికలను కలిపితే రాయిగా మార్చే శక్తి ఉందని మఠంలోని శ్రీరాహుల్‌దాస్ బాబా పేర్కొన్నారు. రాష్ట్రంలోని రెండవ భద్రాచలంగా పేరుగాంచిన సంగం రామాలయం వద్ద కార్తిక పౌర్ణమి రోజు భక్త రామాదాసును గోల్కొండ కోటలో చెరసాల నుంచి విడిపించడానికి వచ్చిన శ్రీరామలక్ష్మణులు ఇక్కడ ఓ చెట్టు కింద నిదురించారని బాబా తెలిపారు. వెకువజామున పౌర్ణమి రోజున శ్రీరామలక్ష్ముణులు సంగం నదిలో స్నానం ఆచరించారని పేర్కొన్నారు. పౌర్ణమి రోజున భారీగా భక్తులు త్రివేణి సంగం నదిలో స్నానాలు ఆచరించేందుకు వస్తారని, త్రివేణి సంగం వద్ద జేసీపీతో పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. భక్తులు ఇబ్బందులు కలుగుకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మఠాధిపతి రాహుల్‌దాస్ బాబా తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్‌ను కోరారు.

‘సమస్య మీది - పరిష్కారం మాది’ బాక్స్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 8: సనత్‌నగర్ నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సరికొత్త ప్రయత్నం ప్రారంభించారు. ప్రజల తమ సమస్యలు, ఫిర్యాదులను తరుచూ తన దృష్టికి తీసుకువస్తున్నట్లు, ఇకపై ప్రజలు తమకు ఇష్టమొచ్చినపుడల్లా ఫిర్యాదులను తన దృష్టికి తీసుకువచ్చేలా ‘సమస్య మీది - పరిష్కారం మాది’ అనే బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మొదటిసారిగా పద్మారావునగర్‌లో ఏర్పాటు చేసిన బాక్సును మంత్రి తలసాని శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజలు ఎన్నో సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటిలో అత్యధిక శాతం పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజలకు ఇంకా సమస్యలు గానీ, ఫిర్యాదులు గానీ ఉంటే ఈ బాక్సులో వేయవచ్చునని సూచించారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఈ బాక్స్‌ను తెరిచి అందులోని సమస్యలను పరిశీలించి, పరిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆ తర్వాత దినసరి కూలీల అభ్యర్థన మేరకు సికిందరాబాద్ ఎస్‌పీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన అన్నపూర్ణ రూ.5కే భోజనం కౌంటర్‌ను మంత్రి ప్రారంభించి, స్థానికులకు భోజనం వడ్డించారు. బన్సీలాల్‌పేట మున్సిపల్ క్వార్టర్స్ వద్దనున్న ముస్లిం బస్తీలో రూ.6లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ నళిని పద్మావతి పాల్గొన్నారు.

అట్టుడికిన నగరం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 8: మహానగరం మరోసారి నిరసనలు, పాదయాత్రలు, ఆందోళనలతో అట్టుడికింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఇతరత్ర డిమాండ్లతో ఆర్టీసీ చేపట్టిన సమ్మె ఇప్పటికే 35రోజులకు చేరింది. మరోవైపు తహశీల్దార్ విజయా రెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. నగరంలోని అన్ని తహశీల్దార్ల ఆఫీసులకు తాళాలు వేసి, ఉద్యోగులంతా కలెక్టరేట్ చేరుకుని, శుక్రవారం నిరసనలు వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా శుక్రవారం అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు చేపట్టిన పాదయాత్రలో నేతలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.
పాదయాత్రతో వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసేందుకు ఉదయం యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పాదయాత్ర చేసేందుకు నేతలు గాంధీభవన్‌కు రాకముందే భారీగా మోహరించిన పోలీసులు నేతలను ఇంటర్మీడియట్ బోర్డు వద్ధ అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకోవటంతో పాటు చాలా సేపు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నాంపల్లి చౌరస్తా, బజార్‌ఘాట్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్స్ రోడ్డు, ఆబిడ్స్, ఎంజే మార్కెట్, జాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది. ఆర్టీసి సమ్మెకు సంఘీభావంగా శనివారం మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి.
ఆటోడ్రైవర్స్ జేఏసీ మద్దతు
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శనివారం నిర్వహించనున్న ఛలో ట్యాంక్‌బండ్ మిలియన్ మార్చ్‌కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కూడా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. టీఏడీజేఏసీ నేత మహ్మద్ అమానుల్లా ఖాన్, నేతలు లక్ష్మినర్సయ్య, హమీద్ అన్సారీ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అమానుల్లాఖాన్ మాట్లాడుతూ మిలియన్ మార్చ్‌లో ఆటోడ్రైవర్లంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పనుల్లో జాప్యం చేస్తూ, అవినీతికి పాల్పడుతున్న వెస్ట్‌జోన్ ఆర్‌టీఓ వెంకటేశ్వర్ రావును బదిలీ చేయాలని, ఇదే డిమాండ్‌తో త్వరలోనే ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ, ఆయిల్ కార్పొరేషన్ల
ఒప్పందాలను పునఃసమీక్షించాలి
సికింద్రాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ, ఆయిల్ కార్పొరేషన్‌ల మధ్య జరిగిన ఒప్పందాలను పునఃసమీక్షించాలని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో డివిజనల్ మేనేజర్ రాజేష్‌కు పార్టీ తరపున వినతి పత్రం సమర్పించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ల మధ్య ఒప్పందం కుదరటంతో దాదాపు 115 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పెట్రోల్ బంకులను ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించి, తద్వారా వచ్చే ఆదాయం మొత్తం ఆర్టీసీ సంస్థకు చెందాలని కోరారు. కానీ, ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రైవేట్ వ్యక్తులకు డీలర్‌షిప్ ఇచ్చి 60 శాతం కమీషన్‌తో ఔట్‌సోర్సింగ్ చేశారని ఆరోపించారు. ఈ రకంగా కేటాయించిన పెట్రోల్ బంకుల అనుమతులను రద్దు చేసి, ఇప్పటి వరకు వచ్చిన కమీషన్‌ను ఆర్టీసీ ఖాతాలో జమ చేయాలని కోరారు. ఒప్పందాలను పూర్తిగా పునఃసమీక్షించాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు.

ముగ్గురు పరార్

* ఎట్టకేలకు పట్టివేత
సైదాబాద్, నవంబర్ 8: సైదాబాద్ ప్రభుత్వ పరిశీలన గృహం అధికారుల నిర్లక్ష్య వైఖరితో గృహం నుంచి బాలల పరారీ ఘటనలు తరుచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గృహంలో అధికారుల పర్యవేక్షణ డొల్లతనమే పరారీ ఘటనలు పునరావృతానికి కారణమవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సైతం ముగ్గురు బాలనేరస్థులు అదును చూసి గృహం నుంచి పారిపోగా వారిని శుక్రవారం అదుపులోనికి తీసుకొని గృహానికి తరలించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చోరీ కేసులో నిందితులైన ముగ్గురు బాలనేరస్థులను పోలీసులు కొద్ది రోజుల క్రితం సైదాబాద్‌లోని ప్రభుత్వ పరిశీలన గృహానికి తరలించారు. గురువారం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని అదునుగా చేసుకొని ముగ్గురు బాలలు గృహం వంటగది వద్ద గోడ దూకి పరారయ్యారు. గృహం సిబ్బంది సమాచారంతో విచారణ చేపట్టిన సైదాబాద్ పోలీసులు శుక్రవారం అబిడ్స్‌లో సంచరిస్తున్న ముగ్గురిని పట్టుకొని తిరిగి పరిశీలన గృహానికి చేర్చినట్లు సమాచారం.

మేడ్చల్ కలెక్టరేట్‌ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు

*ఆర్ధిక పతనం దిశగా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
*మాజీ మంత్రి గీతారెడ్డి
కీసర, నవంబర్ 8: ఆర్ధిక పతనం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పయనిస్తున్నాయని మేడ్చల్ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేలాది కార్యకర్తలతో కలిసి మేడ్చల్ కలెక్టరేట్‌ను కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు.
గీతారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్తుందని అన్నారు. ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని, దీంతో పరిశ్రమలు మూత పడటంతో నిరుద్యోగం పెరిగి పోతోందని ఆవేదన వ్యక్తం చేసారు. కేసీఆర్ దరంహకార వైఖరితో అవినీతి కాంక్షతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బ్రష్టు పట్టించారని, దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పడుతున్నారని వాపోయారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు నిధులతో ధనిక రాష్ట్రంగా ఇస్తే, అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా మార్చారని పేర్కొన్నారు.
60 ఏళ్లలో కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు రూ.60వేల కోట్లు అప్పుచేస్తే, కేవలం ఆరేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను కేసీఆర్ అప్పు చేసి, ప్రతి వ్యక్తిపై లక్ష రూపాయల భారం మోపారని అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా ఉండాలే గానీ, సామ్రాజ్యవాదం పెంచేదిగా ఉందని పేర్కొన్నారు. డీఆర్వో మధుకర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేసారు. ముందస్తుగా కీసర సీఐ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు భారీ బందోబస్తుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కార్యక్రమంలో మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, నందిగంటి శ్రీ్ధర్, మూడుచింతలపల్లి జడ్పీటీసీ హరివర్దన్ రెడ్డి, నాయకులు వెంగళ్ రావు, శివారెడ్డి, తోటకూర జంగయ్య యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, దుర్గారాణి, చరణ్ కౌశిక్, మల్లేశ్ గౌడ్, రాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, మొర్గు ముత్యాలు పాల్గొన్నారు.
షాద్‌నగర్ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలనతోనే దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా మారిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్‌నగర్ నుండి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో డివిజన్‌లోని ఆరు మండలాల నుండి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో చలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరి వెళ్లారు. శంకర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ఫ్రభుత్వాలు విస్మరించడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు బాబర్ అలీఖాను, దంగు శ్రీనివాస్ యాదవ్, బాలరాజు గౌడ్, మాధవ్, మధు పాల్గొన్నారు.