హైదరాబాద్

ముంచుకొస్తున్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

`హైదరాబాద్, మే 7: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం వేలాది కోట్లతో బడ్జెట్ తయారు చేస్తున్న బడ్జెట్‌లో జరుపుతున్న కేటాయింపుల ప్రకారం నిధులు వెచ్చించటం లేదన్న విమర్శలు ఒక ఎతె్తైతే, నాలాల పూడికతీతకు కేటాయించిన నిధులు మాత్రం ప్రతి ఏటా పూర్తి స్థాయిలో ఖర్చవటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రతి ఏటా నాలాల్లోని పూడికతీత పనులు చేపడుతున్నామంటూ అధికారులు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారే తప్ప, ఓ మోస్తారు వర్షం పడితే చాలు నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. పూడికతీత పేరిట ఏటా కోట్లాది రూపాయల నిధులు కరిగిపోతున్నా, నాలాల్లోని పూడిక మాత్రం తొలగటం లేదు. పదహారేళ్ల క్రితం 2000లో నగరాన్ని వరదలు ముంచెత్తినపుడు మున్ముందు నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు అప్పటి ప్రభుత్వం కిర్లోస్కర్ కమిటీతో అధ్యయనం చేయించింది. నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటి వరకు ఏ మాత్రం అమలు కాలేదు. పైగా ఈ సారి ఎండలు రికార్డు స్థాయిలో మండిన సంగతి తెలిసిందే! ఇదే తరహాలో వర్షాలు కూడా కాస్త ముందు నుంచే భారీగా కురిసే అవకాశాలున్నాయంటూ ఒకవైపు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇప్పటికే ప్రారంభించామని జిహెచ్‌ఎంసి అధికారులు చెప్పుకుంటున్న నాలా పూడికతీత పనులు ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించుకోవాలంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలాఖరుకల్లా నగరంలోని అన్ని నాలాల్లోని పూడికను తొలగించాలంటూ కిర్లోస్కస్ కమిటీ స్పష్టమైన సిఫార్సులు చేసినా, నేటికీ అమలుకు నోచుకోవటం లేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే నాలాలు పొంగి ప్రవహించి మురుగునీరు, వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం నగరంలో కురిసిన ఎనిమిది సెంటీమీటర్ల వర్షానికే పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా నీళ్లు వచ్చాయి.
ప్రతి ఏటా పెరుగుతున్న వ్యయం
ఇరవై అడుగుల లోతుండే భారీ నాలాల్లో అడుగుభాగం నుంచి సుమారు పదిహేను అడుగుల ఎత్తు వరకు నేటికీ నాలాల్లో బురద, చెత్తాచెదారం దర్శనమిస్తుందంటే అధికారులు ఏ స్థాయిలో పూడికతీత పనులు చేపడుతున్నారో అంఛనా వేసుకోవచ్చు. ఏటేటా పూడికతీతకు ఖర్చు చేస్తున్న నిధులు పెరుగుతున్నాయే తప్పా, నాలాల్లోని పూడిక తగ్గటం లేదన్న ఆరోపణలున్నాయి. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందక ముందు ఏడు సర్కిళ్లకే పరిమితమైన నగరంలోని నాలాల్లో పూడికతీతకు ఏటా రూ. 6 కోట్లను కేటాయించేవారు. నగరంలో అయిదు భారీ నాలాలు, మరో పద్నాలుగు మధ్య తరహా, 22 రెండు చిన్న తరహా నాలాలున్నాయి. అయితే రూపాంతరం చెందిన తర్వాత శివార్లలోని పలు నాలాలు కూడా గ్రేటర్ బల్దియా పరిధిలోకి రావటంతో గడిచిన పదేళ్ల నుంచి ఖర్చు పెరుగుతూ వస్తోంది. ఈ ఏటా రూ. 24 కోట్లను కేటాయించి, పనులను ప్రారంభించినా, పలు చోట్ల ఇంకా పనులు ప్రారంభం కాలేదు. ఇక అడపాదడపా పనులు కొనసాగుతున్న ప్రాంతంలో పూడికను తీసి, పక్కనే వేయటంతో వర్షం కురిసి మళ్లీ అది నాలాల్లోకి చేరుతోందంటే మన ఇంజనీర్ల నైపుణ్యత ఏ పాటిదో అంచనా వేసుకోవచ్చు.
కరవైన భద్రతా ప్రమాణాలు
సాధారణ భారీ నాలాల్లో పొక్లెయిన్ సహాయంతో పూడికను తొలగించాల్సి ఉన్నా, అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికుల భద్రత కోసం ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కొన్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంది. అదే మధ్య తరహా, చిన్న తరహా నాలాల్లో లోపలికి దిగి పూడిక, బురద, చెత్తను తొలగించే కార్మికులకు మాస్కులు, గ్లౌజెస్‌లు, ప్రత్యేకమైన డ్రెస్, బూట్లు, అవసరమైతే ఆక్సిజన్ సిలెండర్లను కూడా కేటాయించాల్సి ఉంది. ఈ ప్రమాణాలను కార్మికులకు కేటాయిస్తే ఏదైనా ప్రమాదం జరిగినా, వారి ప్రాణాలకు పెద్దగా ముప్పు ఏర్పడే అవకాశముండదు. కానీ కొందరు కాంట్రాక్టర్లు అడ్డాకూలీలతో మొక్కుబడిగా పనులు చేపడుతూ, వారి ప్రాణాలు పోయేందుకు కారకలవుతున్నారు. కొద్దిరోజుల క్రితం నగరంలో ఇదే తరహాలో జరిగిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే!