హైదరాబాద్

పేదవర్గాలను చదువుకు దూరం చేసేందుకే విద్యాసంస్థలపై వేధింపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 8: పేద, బడుగు, బలహీనవర్గాలను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగానే ప్రైవేట్ విద్యాసంస్థలను తనిఖీల పేరిట వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘ప్రైవేట్ విద్యావ్యవస్థపై ప్రభుత్వ వైఖరి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బిసి విద్యార్ధి సంఘం అధ్యక్షుడు అంజియాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్, తెలంగాణ ఉద్యమవేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ నాయకులు సతీష్, ఎస్‌ఎన్. రెడ్డి, రాందాస్, సిద్ధేశ్వర్, రమణారెడ్డిలతో పాటు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థను రూపుమాపుతానన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలపై పోలీసులచే తనిఖీలు చేయించడం అమానుషమని అన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫీజు బకాయిలు చెల్లించకుండా వాటిని అడిగినందుకు కక్ష సాధింపుగా తనిఖీల పేరుతో భయాందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్‌కు అండగా ఉన్న తమను మానసికక్షోభకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణను ముఖ్యమంత్రి కేసిఆర్ పోలీస్ రాజ్యంగా మార్చేందుకు చూస్తున్నారని మధుయాష్కీ అన్నారు. తెలంగాణ విద్యార్ధులను చితగ్గొట్టిన పోలీసులకు 900 కోట్లు ఇచ్చిన ఘనత కేసిఆర్‌దని అన్నారు. కోట్లాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను వదిలిపెట్టి, పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజులతో విద్యనందిస్తున్న చిన్న విద్యాసంస్థలను భయాందోళనకు గురిచేయడం సరికాదని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా విద్యాసంస్థలను పోలీసులతో తనిఖీ చేయించిన దాఖలాలు లేవని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తనిఖీలు చేయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యావ్యవస్థలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలో చెప్పకుండా వేధింపులకు గురిచేయడం సబబేనా అని వారు ప్రశ్నించారు. నూతన రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ముఖ్యమంత్రికి నచ్చినట్టు చేస్తామంటే కుదరదని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నికైన ముఖ్యమంత్రి వారి సమస్యలు వినేందుకు సైతం ఇష్టపడటం లేదని యాష్కీ విమర్శించారు. దొరల గడీల మీద ఉన్న ప్రేమ, బడుల మీద ఉండదని, ఎస్సీ, ఎస్టీ, బిసిలు చదువుకుంటే వారికి ప్రశ్నించే తత్వం వస్తుందని విద్యావ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని చెరుకు సుధాకర్ దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న న్యాయపోరాటానికి తాను ముందుంటానని యాష్కీ హామీ ఇచ్చారు.