హైదరాబాద్

అన్ని జిల్లా కేంద్రాల్లో ‘శిల్పారామా’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10 : తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు, జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి వచ్చేలా చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన ‘శిల్పారామం’పై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామం అందరినీ ఆకట్టుకుంటోందని, అదే తరహాలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా శిల్పారామాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా మొదట వరంగల్, మెదక్ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత దశలవారీగా ఇతర జిల్లా కేంద్రాల్లో కూడా శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలోని వివిధ సాంప్రదాయ పండగలను శిల్పారామాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చందూలాల్ తెలిపారు. దేశంలోని వివిధ హస్తకళల వస్తువులను శిల్పారామాల ద్వారా ప్రజలకు విక్రయించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. దీని ద్వారా ఒకవైపు హస్తకళలు అంతరించకుండా కాపాడినట్టువుతుందని, అలాగే కళాకారులకు ఉపాధి లభిస్తుందని వివరించారు. చేనేత, హస్తకళల ప్రదర్శనలను భారీ ఎత్తున చేపట్టబోతున్నామన్నారు. దేశంలోని వివిధ సంస్కృతులను, సంప్రదాయాలను తెలుసుకోవాలంటే శిల్పారామం సందర్శించాల్సిందే అన్న భావన అందరిలో కలిగేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో త్వరలో ఇంటర్నేషనల్ ఫుడ్ బజార్‌ను ఏర్పాటు చేస్తామని, వివిధ దేశాల వంటకాలు ఇందులో లభిస్తాయని మంత్రి చందూలాల్ వివరించారు. శిల్పారామంలోని ‘నైట్ బజార్’ను ఆధునీకరించి, పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు పాల్గొన్నారు.