హైదరాబాద్

రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలు కానున్నది. కొత్త జిల్లాల ఏర్పాట్ల ప్రక్రియను ముమ్మరం చేసిన ప్రభుత్వం ప్రజాప్రతినిధుల నుండి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తొలుత అధికార తెరాస పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో అభిప్రాయం సేకరించేందుకు బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. పార్లమెంటు సభ్యులు కొండా విశే్వశ్వర్ రెడ్డితోపాటు అధికార పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు పి.నారాయణరెడ్డి, జనార్దన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ పి.సునీతామహేందర్ రెడ్డి, శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కె.యాదయ్య, గాంధీ, సుధీర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, సంజీవరావు, తీగల కృష్ణారెడ్డి, వివేకానంద, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగేందర్‌గౌడ్‌లతో కొత్త జిల్లాలపై పార్టీ పరిశీలకులు పర్యాద కృష్ణమూర్తితో కలిసి మంత్రి సమాలోచనలు చేశారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా బాగా అభివృద్ధి చెందిందని, జిల్లా ప్రజల మనోభావాలకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తానని మంత్రి వివరించారు.
అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గం పటాన్‌చెరువులో కలుపుతారన్న విషయంపై శాసనసభ్యులు గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని భువనగిరిలో కలుపుతారన్న విషయాన్ని శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే రంగారెడ్డి జిల్లా ఎన్ని ముక్కలైనా దాని స్వరూపాన్ని మరో జిల్లాలో విలీనం చేయరాదని విజ్ఞప్తి చేశారు. ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని తాము చేస్తున్న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, కొత్త జిల్లాల ఏర్పాటుకోసం నియమించిన కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రి మహేందర్‌రెడ్డికి పర్యాద కృష్ణమూర్తి ఇద్దరూ రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలను కాపాడేవిధంగా ముఖ్యమంత్రికి సూచించి కొత్త జిల్లాలను ఏర్పాటుచేసేందుకు నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తొలుత రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ కేంద్రంగా కొత్తజిల్లా ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన శాసనసభ్యులు మిగతా ప్రాంతాలను ఎన్నిముక్కలు చేసినా మరో జిల్లాలో కలుపరాదని, అలాగే మరో ప్రాంతాన్ని ఈ జిల్లాలో కలుపరాదన్ని సూచించారు. ఈ విషయంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి అభిప్రాయసేకరణ చేయనున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముక్కలు కానున్న జిల్లా
వికారాబాద్ కేంద్రంగా తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజక వర్గాలు ఓ జిల్లాగా ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం. అలాగే రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటుచేసి దానికి రంగారెడ్డి జిల్లాగా ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హయత్‌నగర్ లేదా ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఇబ్రహీంపట్నం, ఎల్‌బినగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేయాలన్న యోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే కొత్తగా ఏర్పాటుచేసే రెండు జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాగా పేరుపెట్టబోతున్న జిల్లాలోనే మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన షామీర్‌పేట్ మండలాన్ని కలుపగా, కీసర, ఘట్‌కేసర్‌లను హయత్‌నగర్ కేంద్రంగా ఏర్పాటుచేసే జిల్లాలో కలుపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటుచేయబోయే జిల్లాల ప్రతిపాదనలను వెంటనే పంపించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన వివరాలను ప్రభుత్వానికి అందజేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతమున్న రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలవుతుండగా మేడ్చల్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాకు విభజించగా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, షాబాద్ మండలాలను రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోనికి తేవాలన్న యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది.