హైదరాబాద్

సిఎం క్యాంపు ఆఫీసు ఎదుటహోర్డింగ్ ఎక్కిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, మే 19: తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు ముందు ఇద్దరు విద్యార్థులు హోర్డింగ్ ఎక్కి హల్‌చల్ సృష్టించారు. దాదాపు రెండు గంటల పాటు హోర్డింగ్ పైనే ఉండడంతో ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం నగరంలో జరిగిన సంఘటన సంచలనం రేపింది. వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రభాకర్, చైతన్య హోర్డింగ్‌పైకి ఎక్కారు. అగ్రికల్చరల్ ఒకేషనల్ నిరుద్యోగ విద్యార్థులకు ఏఈఓ పోస్టుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, తమకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తేనే హోర్డింగ్ దిగుతామని భీష్మించుకు కూర్చొన్నారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు వారిని కిందకు దించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తమ వద్దకు వస్తే దూకేస్తామని హెచ్చరించడంతో 30 మంది పోలీసులు భారీ షామియానాలను తెరలా పట్టుకున్నారు. అయినా సదరు యువకులు దిగిరాక పోవడంతో సుమారు మూడున్నర గంటల పాటు హైడ్రామా కొనసాగింది. వరంగల్ జిల్లా భూపాల్‌పల్లికి చెందిన ప్రభాకర్, ఖమ్మం జిల్లాకు చెందిన చైతన్య 2006లో ఇంటర్ మీడియట్‌తో పాటు క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ కోర్సును పూర్తిచేశారు. గత ప్రభుత్వ హయాంలో సైతం ఒకేషనల్ విద్యను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించకపోవడంతో నిరుద్యోగులుగా ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం తమకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించినా కుదరకపోవడంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. దీంతో గురువారం ప్రభాకర్, చైతన్యలు మధ్యాహ్నం 2గంటల ప్రాతంలో సిఎం క్యాంపు కార్యాలయం ముందున్న శ్రీనివాస టవర్స్‌లోని హోర్డింగ్‌ను ఎక్కారు. సాయంత్రం ఐదుగంటల వరకు వీరు హల్‌చల్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తాము పదేళ్లుగా నిరుద్యోగులుగా మిగిలిపోయామని, ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన హామీ వస్తేనే దిగివస్తామని మొండికేశారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అక్కడికి చేరుకొని వారితో సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధితో చర్చించానని వారికి ఫోన్ ద్వారా కృష్ణయ్య వివరించడంతో వారు శాంతించారు. అదే సమయంలో పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి శ్రీనివాస్ టవర్స్‌లోని మెట్ల మార్గం ద్వారా హోంగార్డు వెంకటయ్యను హోర్డింగ్‌పైకి పంపించారు. ఇరువురు అభ్యర్ధులను మాటలతో నిలువరిస్తుండగా, అగ్నిమాపకశాఖకు చెందిన క్రేన్ సహాయంతో పోలీసులు వారిని పట్టుకొని కిందకు దించారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్ తరలించారు. ఒకేషనల్ పూర్తిచేసిన అభ్యర్ధులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 1985లో ఎన్‌టిఆర్ ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, దానిని ఇంత వరకు ఎవరూ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టనష్టాలకోర్చి విద్యను పూర్తిచేస్తే పదేళ్లయినా ఉద్యోగాలు రాకపోవడంతో మానసిక ఆందోళన చెందడం వల్లే హోర్డింగ్ ఎక్కామని వారు తెలిపారు.