జాతీయ వార్తలు

నీరవ్‌కు బిగిస్తున్న ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 16: దేశాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. 11,400 కోట్ల రూపాయల భారీ కుంభకోణం కేసులో సూత్రధారి నీరవ్ మోదీకి చెందిన జువెలరీ సంస్థ గీతాంజలి గ్రూప్‌పై సీబీఐ శుక్రవారం నాడు మరో కేసు నమోదు చేసింది. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నీరవ్ సంస్థలు, కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ఈ స్కామ్‌కు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేటు పడింది. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కోసం సీబీఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనుంది. దేశంలోనే పీఎన్‌బీది అతిపెద్ద కుంభకోణం. కుంభకోణం వెలుగులోకి రాగానే అసలు సూత్రధారి నీరవ్ మోదీ, అతడి కుటుంబ సభ్యులు దేశం విడిచి వెళ్లిపోయారు. కాగా గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ ఛోక్సీపై శుక్రవారం సీబీఏ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నీరవ్ మోదీ అంకులే ఛోక్సీ. ఈనెల 13న పీఎన్‌బీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఛోక్సీపై కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. నీరవ్, ఛోక్సీల పాస్‌పోర్టులు రద్దుచేశారు. కాగా స్కామ్ వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏకంగా 4,886 కోట్లు నష్టపోయింది. ముంబయి, పూణే, సూరత్, జైపూర్, హైదరాబాద్, కొయంబత్తూర్ నగరాలతోపాటు 20 చోట్ల గీతాంజలి గ్రూపుసంస్థల్లో విస్తృతమైన సోదాలు జరిగాయి. ఈ గ్రూపునకు చెందిన ఫ్యాక్టరీలు, ఆఫీసులు, ప్లాంట్లలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ ప్రతినిధి స్పష్టం చేశారు. విదేశాలకు పారిపోయిన నీరవ్ కుటుంబ సభ్యుల కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించినట్టు ఆయన వెల్లడించారు. నీరవ్ మోదీ కుటుంబం ఆచూకీ తెలుసుకోడం కష్టంకాదని సీబీఐ ధీమా వ్యక్తం చేస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి పీఎన్‌బీకి 11,400 కోట్ల రూపాయల టోపీవేసినట్టు వారు తెలిపారు. జవవరిలో ఆఖరి వారంలోనే మోదీ కుటుంబం దేశం విడిచివెళ్లిపోయిందని వారన్నారు. నీరవ్ సోదరుడు నిషాల్‌కు బెల్జియం పౌరసత్వం ఉంది. అతడూ అదే రోజు దేశం విడిచి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఆ కుటుంబం పర్యటనపైనా దర్యాప్తు చేశారు. నీరవ్ భార్య అమీ అమెరికా పౌరసత్వం కలిగి ఉంది. ఆమె జనవరి ఆరోతేదీనే దేశం వదలివెళ్లిపోయింది. మెహుల్ ఛోక్సీ జనవరి 4న పలాయానం చిత్తగించాడు. నీరవ్‌మోదీ, ఛోక్సీల పాస్‌పోర్టులు రద్దు చేయడానికి ఈడీ, సీబీఐ భావిస్తున్నాయి. బిలీయనీర్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్‌లోని సంపన్నుల జాబితాలో టాప్‌టెన్‌లో ఉన్నారు. 2013 నుంచి అతడి హవా సాగుతోంది. ఈ కుటుంబం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 280 కోట్లకు ముంచేసిందని అధికారులు తెలిపారు. కుంబకోణం వెలుగుచూసిన 15 రోజుల్లో తొలిసారి పీఎన్‌బీ సీబీఐని ఆశ్రయించింది.
మరోపక్క నీరవ్‌మోదీ కుటుంబ సభ్యులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. కంపెనీ డైరెక్టర్లకు స్వయంగా నోటీసులు అందించారు. నీరవ్, ఛోక్సీలు తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ వారిద్దరూ అప్పటికే దేశం విడిచి వెళ్లిపోయినట్టు సమాచారం వచ్చింది. ఛోక్సీ గీతాంజలీ జెమ్స్‌కు ప్రమోటర్‌గా ఉన్నాడు. గురువారం గీతాంజలి గ్రూపుసంస్థల్లో సోదాలు నిర్వహించి ఆభరణాలు, బంగారం, వజ్రాలు, విలువైన పత్రాలు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శుక్రవారం వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న సొత్తు మార్కెట్ విలువ 5,100 కోట్ల రూపాయలుంటుందని పేర్కొన్నారు. మోదీ నివాసం, ఆయన సోదరుడు, భార్య, అంకుల్ ఇళ్లు, భాగస్వాముల నివాసాలపై శుక్రవారం సీబీఐ దాడులు జరిపింది. ఆర్ యుఎస్ డైమండ్స్, సోలాల్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ స్టెల్లార్ డైమండ్స్ అలాగే ఇద్దరు బ్యాంక్ అధికారులైన గోకుల్‌నాథ్ షెట్టీ (ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యారు), మనోజ్ కారత్‌ల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. నీరవ్‌మోదీ భార్య అమీ, సోదరుడు నిషాల్ భారత్ పౌరులుకాదని, జనవరి 1-6 తేదీల మధ్య వారు దేశం విడిచి వెళ్లిపోయారని సీబీఐ స్పష్టం చేసింది.
కాగా 11,400 కోట్లరూపాయల కుంభకోణం కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన మరో 8 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండైన అధికారుల్లో జనరల్ మేనేజర్ స్థాయి అధికారి ఒకరు ఉన్నారు. స్కామ్ వెలుగుచూడగానే బుధవారం పది మంది బ్యాంక్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కుంభకోణంతో సంబంధం ఉందన్న అనుమానంతో ఇప్పటికి 18 మందిని సస్పెండ్ చేసినట్టు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలాఖరునాటికి అన్ని చెల్లింపులుంటాయని తెలిపారు. కుంభకోణానికి సంబంధించి 36 అకౌంట్లపై లోతుకంటూ ఆరాతీస్తున్నారు.