సంపాదకీయం

ఇంద్రవెల్లి అమరులను స్మరించుకుందాం ( (రేపు ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవం))

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరాటాలు, త్యాగాలు లేని అభివృద్ధిని ప్రపంచంలో ఎక్కడైనా ఊహించగలమా? పోరాటాలకు, అభివృద్ధికీ మధ్య దాగిన సంబంధ బాంధవ్యాలు ఎంతటి విలక్షణమైనవో అంతటి
వైవిధ్య భరితమైనవి కూడా. ఈ అంతస్సూత్రాన్ని గుర్తించడానికి నిరాకరించే పాలకవర్గాలకు అన్ని పోరాటాలూ అభివృద్ధి
నిరోధకాలుగానే గోచరిస్తాయి.
మరణించిన వ్యక్తి పగవాడైనా చేతులెత్తి నమస్కరించడం మన సంప్రదాయం. ఒక లక్ష్యం కోసం ప్రాణాలర్పించిన వారిని జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా గుర్తించి గౌరవించడం అనాదిగా కొనసాగుతున్న సంస్కృతి. తమ లక్ష్య సాధనకు ఆ అమరవీరులు అనుసరించిన మార్గాల పట్ల ఎన్ని విభేదాలున్నప్పటికీ, వారి త్యాగాల్ని అగౌరవపరిచే చర్యల్ని మాత్రం ఏ ఒక్కరూ సమర్ధించరు, సహించరు. అందుకే భగత్‌సింగ్, అల్లూరి, సుభాష్‌చంద్ర బోస్, కుమ్రం భీం, చాకలి ఐలమ్మ వంటి అనేకమంది వీరులకు జాతి యావత్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది. జోడెన్‌ఘాట్ వద్ద కుమ్రం భీం ప్రాణాలర్పించిన ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన స్మృతి చిహ్నంగా తీర్చిదిద్దడం ఆ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. దశాబ్దాలు గడుస్తున్నా ఇంద్రవెల్లి అమరుల విషయంలో ఎందుకో ఆ స్ఫూర్తి కొరవడింది. గత 35 ఏళ్లుగా ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఆంక్షలతో కూడిన వివక్ష కొనసాగడం ఆదివాసీ గోండు సమాజంతోపాటు యావత్ తెలుగు నేలను తీవ్రంగా కలవరపరుస్తోంది.
1981 ఏప్రిల్ 20న నాటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పోలీసుల అనుచిత చర్య మూలంగా జరిగిన కాల్పుల్లో అనేకమంది ఆదివాసీ గోండు గిరిజనులు ప్రాణాలు కోల్పోవడం, వందలాదిమంది గాయాలపాలవడం యావత్ దేశాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. వారి త్యాగాలకు గుర్తుగా నాటి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజన రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కూలీ సంఘం సంయుక్తంగా మాజీ శాసనసభ్యుడు గంజి రామారావు నేతృత్వంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించుకోవడం చరిత్ర. కారణాలేవైనా నాటి నుంచి నేటిదాకా ఆ స్థూపం వద్ద చనిపోయినవారి కుటుంబసభ్యులు ప్రశాంతంగా నివాళులర్పించడం అసాధ్యంగా మారిపోయింది. స్థూపంపై చనిపోయినవారి పేర్లను సూచించే ఒక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోవడం మరింతగా బాధిస్తున్న అంశం.
ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడైనా పోలీసు కాల్పుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతే వారి మృతదేహాలను గుర్తించి పంచనామా చేయించి అంతిమ సంస్కారాలకు వీలుగా మృతదేహాలను బంధువులకు అప్పగించడం ఆనవాయితీ. అది చట్టబద్ధ నియమం కూడా. కానీ ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒక్కరి మృతదేహాన్ని కూడా బంధువులకు అప్పగించకపోగా, గోండుల సంప్రదాయాలకు విరుద్ధంగా హడావుడిగా వాటిని కుప్పపోసి దహనం చేయడంతో కాల్పుల్లో ఎంతమంది చనిపోయారన్నది నేటికీ అంతుచిక్కని విషయంగా మిగిలిపోయింది.
నాటి ఘటనపై జాతీయస్థాయిలో విస్తృతమైన చర్చ జరిగిన ఫలితంగా ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్యులు మనోరంజన్ మహంతి నాయకత్వంలో ఒక నిజనిర్ధారణ బృందం రెండురోజులు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి సవివరమైన నివేదికను విడుదల చేసింది. కాల్పుల్లో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారన్నది ఆ నివేదిక సా రాంశం. చనిపోయినవారి సంఖ్యను ప్రభుత్వం 13గా ప్రకటించింది. అందులో రెండు గుర్తుతెలియని మృతదేహాలని, మిగతా 11 మంది మృతుల పేర్లను ప్రకటించింది. అప్పటి ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన గోండు పెద్దలను కదిలిస్తే, ఆ సంఖ్య 300పైమాటే అన్నది భయం గొలిపే అంశం. స్వతంత్ర భారతంలో చోటుచేసుకున్న మరో జలియన్‌వాలాబాగ్ నాటి ఇంద్రవెల్లి ఘటన అన్నది అతిశయోక్తి కాదు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రజలపై ప్రత్యేకంగా ఆదివాసీ గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ దౌర్జన్యాలకు ఇంద్రవెల్లి ఘటన పరాకాష్ఠగా నిలుస్తుంది. సబ్బండ కులాలు, తెగలు, వర్గాలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా అదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం అంత మంచిది కాదు. ఆదివాసీ గోండు గిరిజనుల పోరాట స్ఫూర్తికి చిహ్నంగా వెలుగొందాల్సిన ఇంద్రవెల్లి స్థూపం ఆలనాపాలన కొరవడి, ప్రాణాలర్పించినవారి పేర్లు కూడా లేకుండా అనామక స్థితిలో దయనీయంగా మిగిలిపోవడం బాధాకరం.
ఇంద్రవెల్లి స్మారక చిహ్నం కేవలం ఒక స్థూపం మాత్రమే కాదు, సమాజ పరిణామక్రమ చరిత్రలో అదొక విడదీయరాని భాగం. పోరాటాలు, త్యాగాల చరిత్ర అభివృద్ధి చరిత్రకు పునాది వంటిది. పోరాటాలు, త్యాగాలు లేని అభివృద్ధిని ప్రపంచంలో ఎక్కడైనా ఊహించగలమా? పోరాటాలకు, అభివృద్ధికీ మధ్య దాగిన సంబంధ బాంధవ్యాలు ఎంతటి విలక్షణమైనవో అంతటి వైవిధ్యభరితమైనవి కూడా. ఈ అంతస్సూత్రాన్ని గుర్తించడానికి నిరాకరించే పాలకవర్గాలకు అన్ని పోరాటాలూ అభివృద్ధి నిరోధకాలుగానే గోచరిస్తాయి. అలుపెరుగని పోరాటాలు అజరామరమైన త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారులు, ఉద్యమ పార్టీలు ఇంద్రవెల్లి స్మారక స్థూపాన్ని అదే స్థితిలో నిరాధారంగా వదిలేయడం క్షంతవ్యం కాదు. ఇంద్రవెల్లి స్మారక స్థూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు అందించడం అందరి బాధ్యత.

-సుధాకర్.ఎస్