అంతర్జాతీయం

సేవా సామ్రాజ్ఞి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ, సెప్టెంబర్ 4:విమర్శలను తట్టుకుంటూ..తాను అనుకున్న సేవా సామ్రాజ్యానికి తిరుగులేని సామ్రాజ్ఞిగా ఎదిగేందుకు మదర్ థెరెసా వేసిన ప్రతి అడుగూ సం క్లిష్టం..సవాళ్లు, సమస్యల మయ మే! వేటిని ఖాతరు చేయకుండా తాను అనుకున్న లక్ష్యానికి జీవిత కాలంలోనే చేరువ కాగలిగారు కాబట్టే థెరెసాకు మహోన్నతమైన ఖ్యాతి, కీర్తి లభించాయి. మదర్ థెరెసాకు క్యాథలిక్ సెయింట్‌హుడ్ అంత తేలిగా ఏమీ రాలేదు. మహోన్నత మానవీయ విలువలు ప్రోదిచేసుకున్న వ్యక్తిగా థెరెసాను శ్లాఘించి ఆమె మహిమల్ని ప్రత్యక్షంగా చూసిన వారు సైతం సెయిట్‌హుడ్ కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. కోల్‌కతాను కేంద్రంగా చేసుకుని దాదాపు నాలుగు దశాబ్దాల పాటు థెరెసా మానవీయ సేవలందించారు. మిషనరీ ఆఫ్ చారిటీస్ ద్వారా ఆమె పాదుగొల్పిన మానవీయ విలువలకు ఆమె జీవించి ఉండగానే ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోని ఓ మారుమూల ప్రాంతంలో మొదలైన థెరెసా జీవి తం, జీవనం ఉదాత్తంగానే సాగింది. కరుణామయిగా, బాధితుల పాలిట ఆపద్భందువుగా థెరెసాను కొనియాడని వారు లేరు. తన మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌ను అంతర్జాతీయంగా శక్తివంతమైన సేవా వేదికగా మార్చేందుకూ థెరెసా ఎనలేని కృషి చేశారు.అనుచరులు, అనుయాయులు థెరెసా గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా.. ఆమెకూ విమర్శల వెల్లువ తప్పలేదు. థెరెసాను ‘మతసామ్రాజ్యవాది’గా ఆస్ట్రేలియా ఫెమినిస్టు జెర్మేన్ గ్రీర్ తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అట్టడుగు, బలహీన వర్గాలను ఆసరాగా చేసుకుని థెరెసా తన మత ముద్రను బలంగా చాటేందుకే ప్రయత్నించారని గ్రీర్ పేర్కొంటే..బ్రిటన్‌కు చెందిన క్రిస్ట్ఫర్ హిచెన్స్ మరో అడుగు ముందుకేసి థెరెసా దగాకోరు, ఉన్మాది’అని ధ్వజమెత్తారు. విమర్శకుల మాటల తీవ్రత ఎలా ఉన్నా థెరెసా మానవీయ సేవాగుణం ముందు అవేమీ నిలబడలేక పోయాయి. తనను తులనాడే వారి కంటే కూడా తన సేవల్ని గుర్తించి.. సమకాలీన సమాజంలో వాటి ప్రాధాన్యతను గుర్తించిన వారి సంఖ్యే ఎక్కువ కావడంతో థెరెసా మహిమాన్విత వ్యక్తిత్వం విశ్వ విఖ్యాతమైంది. క్రైస్తవ సేవా భావనకు, దయాగుణానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది థెరెసాను శ్లాఘించారు. సమాజం కోసం సర్వం త్యజించిన వ్యక్తిగా, భవ బంధనాలను తెంచుకున్న ఆధ్యాత్మిక మూర్తిగా థెరెసాను కొలవని వారు లేరు. తను ఎంచుకున్న భారతావని థెరెసాను అక్కున చేర్చుకుని ఆదరించింది. ఆమె సేవాభావాన్ని గుండెలకద్దుకుంది. తమతోనే దశాబ్దాలు గడిపి ఆపన్నుల సేవే పరమావధిగా తరలించిన థెరెసాకు సెయింట్‌హుడ్ లభించడం భారతీయులందరికీ ఓ మహోన్నతమైన రోజనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1997లో థెరెసా మరణించిన రోజునే ‘ ఈ మహోన్నత వ్యక్తి సేవల్ని ప్రపంచ దేశాలు అనునిత్యం స్మరించుకుంటూనే ఉంటాయి. ఆమె నిస్వార్ధ సేవకు తరించిన ప్రతి ఒక్కరి గుండెల్లోనూ థెరెసా చిరస్మరణీయంగా ఉంటారు’అని బ్రిటీష్ మహారాణి ఎలిజిబెత్ వ్యాఖ్యానించారు. థెరెసా వ్యకిత్వం విషయానికొస్తే..ఆమె బయటికి ఎంత సాత్వికంగా, నిర్మలంగా, దయామయ మూర్తిగా కనిపించే వారో ఆమె అంతరంగం అంతే సంక్లిష్టం. అనేక విషయాల్లో సందేహాలు ఆమెను వెంటాడేవి. తాను ఏమీ తేల్చుకోలేక పోతున్నానంటూ కోల్‌కతా బిషప్‌కు పలు సందర్భాల్లో లేఖలూ రాశారు. 1910లో కొసావోకు చెంది న అల్బేనియా కుటుంబంలో జన్మించిన థెరెసా తన ఎనిదిదో ఏటే తండ్రిని కోల్పోయారు. పనె్నండేళ్లు వచ్చేసరికి ఆమెలో సేవాతత్పరత క్రమంగా బలపడుతూ వచ్చింది. 18ఏటే ఐరిష్ ఆర్డర్‌లో సభ్యత్వం తీసుకున్న థెరెసా 1929లో భారత్‌కు రావడానికి ముందు ఐర్లాండ్‌లో కొద్ది కాలం పాటు ఆంగ్ల భాష నేర్చుకున్నారు. 1950లో మిషనరీస్ ఆఫ్ చారీటీని ఏర్పాటు చేయడానికి ముందు సంపన్న కుటుంబాల పిల్లలకు భౌగోళిక శాస్త్రాన్ని బోధించారు. పేదల కోసం ఆమె చేసిన సేవలకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ అవార్డు తీసుకున్న సందర్భంగా మాట్లాడిన థెరెసా తన సేవా విధానంపై వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. పేదరికాన్ని తొలగించాలంటే జననాల రేటును నియంత్రించడమొక్కటే మార్గమన్న వాదనను తిరస్కరించిన థెరెసా గర్భస్రావాన్ని ‘తల్లి చేసే ప్రత్యక్ష హత్య’గా అభివర్ణించారు. తన మిషనరీ ద్వారా అభివృద్ధికి తోడ్పడాలన్న వాదనను నిరాకరించిన థెరెసా తాను మిషనరీ కార్యకర్తనే తప్ప సామాజిక సేవకురాలిని కాదన్నారు. ఆజన్మాంతం పేదల సేవలో తరించి వారి ఉద్ధరణే పరమావధిగా భావించిన థెరెసాకు సెయింట్‌హుడ్ మానవత్వానికి పట్టం.. మానవీయ సుగుణాలకు లభించిన గౌరవం.

మదర్ చూపిన అద్భుతాలు
ఆ బెంగాల్‌కు చెందిన ఓ రైతు భార్య మోనికా దాదాపు రెండు దశాబ్దాల పాటు కడుపులో ట్యూమర్‌తో బాధపడింది. ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్లినా ఏమీ ప్రయోజనం కనిపించలేదు. 1998 సెప్టెంబర్ 4(మదర్ థెరెసా మొదటి వర్ధంతికి సరిగ్గా ఒకరోజు ముందు)న మోనికా సోదరి ఆమెను మిషనరీస్ ఆఫ్ చారిటీకి తీసుకెళ్లింది. ‘అక్కడ మదర్ ఫోటో ఒకటి ఉంది. అక్కడ ఏమైందో నాకు తెలియదు. నేను తిరిగి వచ్చేసరికి నొప్పి ఎక్కువైంది. ఆ రాత్రి నా సోదరి మదర్ పతకం ఉన్న ఒక తాడును తీసుకువచ్చి నా కడుపుకు కట్టింది. రాత్రి ఒంటిగంటకు నేను లేచి చూసేసరికి నా కడుపు సాధారణ స్థితికి వచ్చింది. ట్యూమర్ మాయమైంది. నొప్పి మటుమాయమైంది.’’ అని మోనికా తెలిపారు. ఇది జరిగిన అయిదేళ్ల తరువాత 2003లో పోప్ జాన్‌పాల్ ఇది మదర్ చూపించిన అద్భుతంగా గుర్తించారు.
ఆ 2008లో ఆడ్రినో అనే వ్యక్తి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అతనికి వ్యాధి నయం కాదని వైద్యులు దాదాపుగా నిశ్చయానికి వచ్చారు. ఒక దశలో పరిస్థితి దిగజారిపోయింది. దీంతో ఆండ్రినో దంపతులు మదర్ థెరెసాను ప్రార్థించారు. సెప్టెంబర్ 2008లో ఆండ్రినో దాదాపుగా కోమాలోకి వెళ్లిపోవటంతో డాక్టర్లు మెదడుకు సర్జరీ చేయాలని నిర్ణయించారు. సర్జరీకి వెళ్లటానికి కొద్ది సేపటి ముందు ఆండ్రినోకు హఠాత్తుగా స్పృహ వచ్చింది. అతని తలనొప్పి మాయమైంది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. సర్జరీ అవసరమే లేదని వైద్యులు తేల్చారు. ఆండ్రినో తన కుటుంబంతో కలిసి హాయిగా క్రిస్మస్ జరుపుకున్నారు.

సెయింట్ థెరెసాపై పోస్టల్‌స్టాంప్

ముంబై: మదర్ థెరెసాకు దైవత్వ కల్పన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆమెపై ఆదివారం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. కేంత్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి మనోజ్ సిన్హా స్థానిక డివైన్ చైల్డ్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ స్టాంప్‌ను విడుదల చేసినట్లు ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. బిషప్ ఏజిలో గ్రాసిస్, మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ప్రతినిధి సిస్టర్ రూబెల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోల్‌కతాలో ఆమె ప్రారంభించిన సేవా ప్రస్థానం ప్రపంచ ఐకాన్‌గా మార్చిందని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.

కోల్‌కతాలో సంబరాలు
కోల్‌కతా: మదర్ థెరెసాకు దైవత్వ కల్పనను పురస్కరించుకుని కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ప్రధానకార్యాలయమైన మదర్ హౌస్‌లో ఆదివారం వేడుకలు జరిగాయి. వాటికన్ సిటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద పెద్ద తెరలను ఉంచారు. ఉదయం నుంచి మదర్ హౌస్‌ను ప్రజల సందర్శనకు తెరిచి ఉంచారు. అనేక రకాల పూలతో అద్భుతంగా అలంకరించారు. మదర్ సమాధికి వందలాది ప్రజలు నివాళులు అర్పించారు. మదర్‌ను సెయింట్‌గా పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించిన వెంటనే మదర్ హౌస్‌లోని నన్‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక గోడపై పెద్ద అక్షరాలతో ‘సెయింట్ థెరెసా ఆఫ్ కలకత్తా.. మాకోసం ప్రార్థించండి’ అన్న వాక్యాన్ని రాశారు.