అంతర్జాతీయం

కొలంబియా అధ్యక్షుడికి నోబెల్ శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓస్లో, అక్టోబర్ 7: కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుయెల్ సాంటోస్‌ను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వరించింది. దాదాపు అయిదు దశాబ్దాలుగా తన దేశంలో యుద్ధ నివారణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా శాంతి పురస్కారాన్ని అందిస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. తిరుగుబాటు దారులతో సాంటోస్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొలంబియా ఓటర్లు తిరస్కరించిన నెల రోజుల్లోనే ఆయనకు శాంతి పురస్కారాన్ని ప్రకటించటం గమనార్హం. ‘‘కొలంబియాలో అర్ధ శతాబ్దిగా కొనసాగుతున్న అంతర్యుద్ధ నివారణకు సాంటోస్ నిర్మాణాత్మాకంగా చేసిన కృషికి గుర్తింపుగా శాంతి పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం’’ అని నోబెల్ కమిటీ ప్రకటించింది. గత నెలలో ఎఫ్‌ఏఆర్‌సి తిరుగుబాటు దారుల నేత రోడ్రిగో లాండొనో అలియాస్ తిమోలియోన్‌తో సాంటోస్ శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. అక్టోబర్ 2న ఈ ఒప్పందంపై కొలంబియాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అయితే ఇందులో ఓటర్లు సాంటోస్ తిరుగుబాటుదారులతో చేసుకున్న ఒప్పందాన్ని తిరస్కరించారు. ఆ తరువాత శాంతి పురస్కారం సాంటోస్‌కు రాదనే నిపుణులు భావించారు. కానీ శాంతి కోసం సాంటోస్ చేసిన ప్రయత్నాలను ప్రోత్సహించటమే లక్ష్యమని నోబెల్ కమిటీ పేర్కొంది. నిజానికి రెఫరెండంలో తిరుగుబాటు దారులతో ఒప్పందం తిరస్కారానికి గురి కావటంతో కొలంబియా ఇంకా ప్రమాదంలో పడింది. దేశంలో హింసాత్మక ఘటనలు పెచ్చుమీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సాంటోస్‌కు శాంతి పురస్కారం ప్రకటించటం వల్ల కొలంబియాలో అన్ని పార్టీలు దేశంలో ప్రశాంతత సుస్థిరతల కోసం కృషి చేస్తాయని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. గత అయిదు దశాబ్దాలలో కొలంబియాలో నెలకొన్న సంక్షోభంలో దాదాపు రెండున్నర లక్షల మంది మృతి చెందారు. 45వేల మంది జాడ తెలియకుండా పోయారు. వామపక్ష గెరిల్లా గ్రూపులు, డ్రగ్ గ్యాంగ్‌లు కొలంబియాను అనిశ్చితిలోకి నెట్టేశాయి. నోబెల్ శాంతి పురస్కారం కొలంబియాలో శాంతి కోసం పరితపిస్తున్న ప్రజలకు, యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు నివాళి అని నోబెల్ కమిటీ ప్రకటించింది.