అంతర్జాతీయం

భారత్-పాక్ సరిహద్దును ఇక మూసేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైసల్మేర్, అక్టోబర్ 7: భద్రతా కారణాల దృష్ట్యా 2018 డిసెంబర్ నాటికల్లా పాకిస్తాన్‌తో సరిహద్దులను పూర్తిగా మూసివేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. సరిహద్దుల్లో పరిస్థితిపై నాలుగు సరిహద్దు రాష్ట్రాల మంత్రులు, అధికారులతో శుక్రవారం జైసల్మేర్‌లో సమావేశమై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలతో 2018 డిసెంబర్ నాటికల్లా పాక్ సరిహద్దులను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఒక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఒక సరిహద్దు భద్రతా గ్రిడ్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పిన ఆయన ఇందుకోసం పాక్‌తో సరిహద్దులు కలిగి ఉన్న రాష్ట్రాలతో సహా దీనితో సంబంధం ఉన్న అన్ని వర్గాలనుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ‘ఇది కొత్త ఆలోచన. భాగస్వాములందరినుంచీ సలహాలను స్వీకరించిన తర్వాత గైడ్‌లైన్స్‌ను రూపొందిస్తాం’ అని రాజ్‌నాథ్ చెప్పారు. 2018 డిసెంబర్‌నాటికల్లా పాకిస్తాన్‌తో సరిహద్దులు పూర్తిగా మూసివేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు కేంద్ర స్థాయిలో హోం కార్యదర్శి, భద్రతా దళాలనుంచి బిఎస్‌ఎఫ్, రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. సరిహద్దులను మూసివేసే కార్యాచరణ పథకంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటామని హోం మంత్రి చెప్పారు. సరిహద్దులుగా నదులు, సర్‌క్రీక్‌లాంటి ప్రాంతాలు కూడా ఉన్న దృష్ట్యా సరిహద్దులను పటిష్ఠంగా మూసివేసేందుకు టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటామని రాజ్‌నాథ్ చెప్పారు.
ఈ సమావేశానికి రాజనాథ్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల హోం మంత్రులు ప్రదీప్ సిన్హ్ జడేజా, గులాబ్ చంద్ కటారియా, జమ్మూ, కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ రాజ్‌శర్మ హాజరయినట్లు ఒక అధికారి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై భారత సైన్యం మెరపుదాడులు జరిపిన తర్వాత భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన దృష్ట్యా సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజన్స్ ఏజన్సీలు సైతం హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. రాజస్థాన్‌లో రెండు రోజుల పర్యటనకోసం వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ బల్మేర్, జైసల్మేర్‌లోని సరిహద్దు ప్రాంతాలను కూడా సందర్శించనున్నారు.
నేతలు సంయమనం పాటించాలి
కాగా, భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన ప్రస్తుత సమయంలో వ్యాఖ్యలు చేసేటప్పుడు పూర్తి సంయమనంతో ఉండాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజకీయ నేతలకు హితవు చెప్పారు. సైనికులు చేసిన త్యాగాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశంలో విలేఖరులు ప్రశ్నల వర్షం కుపించారు. అయితే హోం మంత్రి వీటికి నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. సైనికుల మృతదేహాలతో కేంద్రం రాజకీయం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఆ మాటలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని రాజ్‌నాథ్ అంటూ, దేశం ముందు పెను సవాలు ఉన్నప్పుడు మనమంతా కూడా మన జవాన్లకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న ఈ సమయంలో దేశ ప్రజలంతా కూడా భద్రతా దళాలు, సైన్యంపట్ల విశ్వాసం ఉంచి వారికి మద్దతుగా నిలవాలని ఆయన అన్నారు. ‘అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలి. జాతి యావత్తు సైన్యానికి మద్దతు ఇవ్వాలి’ అని రాజ్‌నాథ్ అన్నారు.