అంతర్జాతీయం

‘రియల్’ హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. అందరి అంచనాలూ తలకిందులు చేస్తూ శే్వత సౌధాన్ని చేజిక్కించుకున్నారు. చివరి క్షణం వరకూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిదే విజయమనుకున్న అంచనాలూ, ఊహాగానాలు పటాపంచలయ్యాయి. ఎందరు వ్యతిరేకించినా.. చివరికి టికెట్ ఇచ్చిన రిపబ్లికన్ పార్టీయే వద్దనుకున్నా.. మెజార్టీ అమెరికన్లు ట్రంప్ నాయకత్వానే్న కోరుకున్నారు. ఆయన సారధ్యంలోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాజకీయంగా ఆరితేరిన హిల్లరీ క్లింటన్ ఆశల్ని వమ్ము చేస్తూ వైట్‌హౌస్‌లోకి అడుగు పెడుతున్న రియల్ హీరోగా ట్రంప్ తనదైన ముద్ర వేశారు. ఇటు సొంత పార్టీ నేతలు, ప్రపంచ దేశాలు, ప్రత్యర్థి పార్టీ అధినేతలు అడుగడుగునా విమర్శించినా.. ట్రంప్ వస్తే అమెరికా గతి ఇంతే సంగతులు అంటూ హెచ్చరికలు చేసినా మెజార్టీ అమెరికన్ల మద్దతు చూరగొన్న ఆయన 45వ అధ్యక్షుడిగా శే్వతసౌధంలో అడుగు పెడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేని.. కేవలం వ్యాపారమే జీవితంగా ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కావడం ఇదే మొదటిసారి. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా తనదైన చరిత్ర సృష్టించాలని ఆశించిన హిల్లరీకి ఈ పరాజయం మింగుడు పడనిదే. మొత్తం మీడియా తన చుట్టూ తిరిగినా అనుకున్న స్థాయిలో ఆమె అమెరికన్లను ఆకట్టుకోలేకపోయారు. ట్రంప్‌కు 288 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రాగా హిల్లరీకి 215 మాత్రమే లభించాయి. మొత్తం 538 ఓట్లు కలిగిన ఎలక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు గెలిచిన వ్యక్తే దేశాధ్యక్షుడు కాగలుగుతాడు. పెన్సిల్వేనియా, ఓహియో, ఫ్లోరిడా, టెక్సాస్, నార్త్‌కరోలినా వంటి రాష్ట్రాల్లో మెజారిటీ ఓట్లను కైవసం చేసుకోవడం వల్లే 70 ఏళ్ల ట్రంప్ చారిత్రక విజయాన్ని సాధించగలిగారు. అందరి అంచనాలనూ తారుమారు చేయగలిగారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం తన ప్రచార ప్రధాన కార్యాలయంలో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ ‘దేశ ప్రజలు అందరూ సమైక్యంగా పని చేయాల్సిన తరుణమిది’ అని పిలుపునిచ్చారు. అలాగే, తాను అమెరికన్లు అందరికీ అధ్యక్షుడినని, అమెరికాలో ఉంటున్న ప్రతి పౌరుడికీ నాయకుడిని అంటూ ప్రతిజ్ఞ చేశారు. అదేక్రమంలో హిల్లరీ క్లింటన్ ప్రచార తీరును కూడా అభినందించిన ట్రంప్ ‘ఆమె చాలా కష్టపడ్డారు. ఆమెకు ఈ దేశం ఎంతో రుణపడి ఉంది’ అని పేర్కొన్నారు. తమది ప్రచారం కాదని, ఓ ఉద్యమమని అభివర్ణించారు. ఈ ఉద్యమంలో అన్ని కులాలు, అన్ని నేపధ్యాలు, అన్ని మత విశ్వాసాలు కలిగిన ప్రజలు కలిసి పని చేశారన్నారు. ఇదే ఐక్యతా స్ఫూర్తితో అమెరికాకు పూర్వవైభవాన్ని కలిగించేందుకు కలసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏ దేశానికీ లేనంత శక్తి సామర్థ్యం, సంపత్తి, విస్తృతి అమెరికాకు ఉందన్నారు. దీన్ని ఆసరా చేసుకుని వౌలిక నిర్మాణాలను మరింత పటిష్టం చేసుకోవాలని, ఇందులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని హర్షధ్వానాల మధ్య ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో 29 రాష్ట్రాల్లో ఆయన విజయం సాధించారు. చివరి క్షణం వరకూ అధ్యక్ష పదవి తనదేననుకున్న హిల్లరీ విజయం 18 రాష్ట్రాలకే పరిమితమైంది. డెమొక్రాట్లకు కంచుకోటలుగా భావించిన అనేక రాష్ట్రాల్లో సైతం మెజారిటీ ఓట్లను ట్రంప్ సంపాదించగలిగారు. జీవితమంతా వ్యాపార రంగంలోనే రాణించిన ట్రంప్‌కు రాజకీయాలు తెలియవని, ఆయనకు అధ్యక్ష పదవి కల్లలేనంటూ వచ్చిన అంచనాలన్నీ ఒక్కొక్కటిగా వెలువడిన ఫలితాలతో అడుగంటిపోయాయి. ట్రంప్ విజయాన్ని ప్రధానంగా దోహదం చేసింది అమెరికా వ్యవస్థపై ఉద్యోగ వర్గాలకు ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడమే. ఈ వర్గంలోవున్న నైరాశ్యాన్ని అత్యంత బలమైన ప్రచారాస్త్రంగా ట్రంప్ వినియోగించుకోగలిగారు. ముఖ్యంగా ఇమ్మిగ్రాంట్లకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు ఈ ఎన్నికల్లో ఓట్ల బంగారుగనిగానే ఆయనకు కలిసొచ్చాయి. నామినేషన్ల సమయంలోనే సొంత పార్టీ నేతలైన రిపబ్లికన్లు ఆయన్ను అవహేళన చేశారు. మహిళలపైన, వలసదారులపైన ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానే్న రేపాయి. ఆ నేపథ్యంలో ట్రంప్‌ను బలపర్చడానికే మెజారిటీ రిపబ్లికన్ నేతలు వెనుకాడారు. ప్రైమరీలో ట్రంప్ దూసుకొచ్చినా ఆయన ధోరణితో బెంబెలెత్తిన రిపబ్లికన్లు ఒకదశలో అభ్యర్థిత్వం నుంచి కూడా తప్పించాలన్న ఆలోచనా చేశారు. ఉన్నఫళంగా అమెరికా ఓటర్లు ట్రంప్‌కు అనుకూలంగా మారడానికి కారణం ఈ-మెయిల్ కుంభకోణాన్ని తిరిగి తెరవాలని ఎఫ్‌బిఐ నిర్ణయించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రతికూలత ఎదుర్కొన్న హిల్లరీకి చివరి క్షణంలో క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ అప్పటికే ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెబుతున్నారు అమెరికా ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంతగా వివాదాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు, పరస్పర దూషణలు, వ్యక్తిగత విమర్శలతో హిల్లరీ ట్రంప్‌లు పరస్పరం విరుచుకుపడ్డారు. హిల్లరీపై వచ్చిన ఈ-మెయిల్ కుంభకోణం నుంచి ట్రంప్‌పై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల వరకూ యావత్ ప్రచారం అత్యంత హేయమైన రీతిలో వివాదాస్పదంగానే సాగింది.