అంతర్జాతీయం

అగ్రరాజ్యానికే సింహస్వప్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హవానా, నవంబర్ 26: విప్లవ సైన్యానికి సారథ్యం వహించి క్యూబాకు అద్భుతమైన విజయాన్ని సాధించిన మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో ఇకలేరు. క్యూబాలో సోవియట్ తరహా కమ్యూనిస్టు వ్యవస్థను బలంగా పాదుకొల్పడంతోపాటు అధ్యక్షుడిగా అర్ధ శతాబ్దంపాటు దేశాన్ని ముందుకు నడిపి తన హయాంలో అగ్రరాజ్యమైన అమెరికాకు, ఆ దేశానికి చెందిన పదిమంది అధ్యక్షులకు సింహస్వప్నంగా నిలిచిన ఫిడెల్ క్యాస్ట్రో 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఫిడెల్ క్యాస్ట్రో తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు (తమ్ముడు), ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో ప్రభుత్వ టెలివిజన్ చానల్ ద్వారా ప్రకటించారు. ‘టువర్డ్స్ విక్టరీ, ఆల్వేస్’ (ఎప్పుడూ విజయం దిశగానే) అనే నినాదంతో రౌల్ క్యాస్ట్రో తన ప్రకటనను ముగించారు. క్యాస్ట్రో చితాభస్మాన్ని ఆయన విప్లవ జన్మస్థలమైన తూర్పుప్రాంత నగరం శాంటియాగోలో డిసెంబర్ 4వ తేదీన సమాధి చేయడం జరుగుతుందని క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. 1926 ఆగస్టు 13వ తేదీన క్యూబా తూర్పు ప్రాంతంలో జన్మించిన క్యాస్ట్రో పూర్తి పేరు ఫిడెల్ క్యాస్ట్రో రజ్. స్పెయిన్ నుంచి వలసవచ్చిన క్యాస్ట్రో తండ్రి క్యూబాలో అమెరికా చక్కెర కర్మాగారాల్లో కార్మికుడిగా పనిచేసేవారు. అయితే ఆ తర్వాత ఆయనే సొంతగా ఒక తోటను సాగు చేసుకుని క్యూబాలో స్థిరపడ్డారు. నియంత ఫల్గెన్సియో బటిస్టా విధించిన జైలు శిక్ష నుంచి, మెక్సికోలో ప్రవాస జీవితం నుంచి బయటపడి 1959లో విప్లవ సేనలు సాధించిన విజయంతో శాంటియాగో నుంచి హవానాకు పయనమైన క్యాస్ట్రో 32 ఏళ్ల వయసులోనే క్యూబా అధికార పగ్గాలను చేపట్టి ఎన్నో సవాళ్లను, ప్రత్యేకించి అమెరికా నుంచి ఎదురైన పెనుసవాళ్లను దీటుగా అధిగమించారు. తద్వారా ఆయన అత్యంత పిన్న వయసులోనే తిరుగులేని సోషలిస్టు నాయకుడిగా అవతరించారు. అమెరికా విధించిన వాణిజ్య ఆంక్షలతోపాటు వందలాదిసార్లు జరిగిన హత్యా ప్రయత్నాల నుంచి సమర్థవంతంగా బయటపడి ధీరుడిగా నిలిచారు. సోషలిజం పట్ల తనకు గల ప్రగాఢమైన నిబద్ధతను క్యాస్ట్రో ఎన్నో సందర్భాల్లో చాటుకుని లాటిన్ అమెరికా నుంచి ఆఫ్రికా ఖండం వరకు ఎంతో మంది విప్లవ నాయకులకు దశాబ్దాల కాలంపాటు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
అయితే 2006లో క్యాస్ట్రోను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో దేశాధినేతగా ఆయన ప్రాభవం క్రమంగా క్షీణించడం మొదలైంది. జీర్ణకోశ సంబంధ వ్యాధి తరచుగా ఇబ్బంది పెట్టడంతో 2008లో తొలిసారి తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు దేశాధ్యక్ష బాధ్యతలను అప్పగించిన క్యాస్ట్రో ఆ తర్వాత కూడా అనారోగ్య సమస్యలనుంచి తేరుకోలేకపోవడంతో అధ్యక్ష పీఠాన్ని శాశ్వతంగా రౌల్ క్యాస్ట్రోకే అప్పగించాల్సి వచ్చింది. పాశ్చాత్య తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రపంచమంతటా విస్తరించడం, చైనా, వియత్నాం లాంటి కమ్యూనిస్టు దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థలు పురుడు పోసుకోవడం క్యూబాను ఆర్థికంగా కుంగదీసింది. దీంతో ఎన్నో దశాబ్దాల క్రితం (1961లో) తెగతెంపులు చేసుకున్న దౌత్య సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోబోతున్నట్లు వాషింగ్టన్, హవానా ప్రకటించి చర్చలకు ఉపక్రమించాయి.
2014 డిసెంబర్ 17వ తేదీన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోకు మధ్య ప్రారంభమైన ఈ చర్చలు ఫిడెల్ క్యాస్ట్రో సమక్షంలోనే జరిగాయి. జీవితకాల శత్రువైన అమెరికాతో కూబా కుదుర్చుకున్న చరిత్రాత్మక ఒప్పందాన్ని నెల రోజుల వౌనం తర్వాత క్యాస్ట్రో ఆశీస్సులతోనే అధికారికంగా ప్రచురించారు. ఆ తర్వాత ఒబామా గత ఏడాది మార్చి నెలలో హవానాలో చరిత్రాత్మక పర్యటన జరిపారు.