అంతర్జాతీయం

చైనా-పాక్ ఆర్థిక కారిడార్‌లో చేరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 21: భారతదేశం పాకిస్తాన్ పట్ల శత్రుత్వానికి స్వస్తిచెప్పి వందలాది కోట్ల డాలర్ల వ్యయంతో చేపడుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో చేరడంద్వారా తమతో కలిసి దాని ప్రయోజనాలను పొందాలని పాకిస్తాన్‌కు చెందిన ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు పిలుపునిచ్చారు. క్వెట్టాలోని బలూచిస్తాన్ ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్మీ దక్షిణ కమాండ్ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ ఆమిర్ రియాజ్ ఈ సూచన చేశారు. భారతదేశం పాకిస్తాన్‌తో శత్రుత్వానికి స్వస్తిచెప్పి ఇరాన్, అఫ్గానిస్థాన్ తదితర మధ్య ఆసియా దేశాలతో కలిసి 4600 కోట్ల డాలర్ల వ్యయంతో చేపడుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో చేరి దాని ప్రయోజనాలను అనుభవించాలని ఆయన అన్నట్లు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక తెలిపింది. బలూచిస్తాన్‌లోని వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గ్వాడార్ రేవుగుండా చైనాలోని పశ్చిమ ప్రాంతాలను అరేబియా సముద్రంతో అనుసంధానం చేసే ఉద్దేశంతో చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లే ఈ కారిడార్‌పై భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, బలూచిస్థాన్‌లో విచ్ఛిన్నకర కార్యకలాపాల్లో భారత్ పాత్ర ఉందని పాక్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రియాజ్ ఈ సూచన చేయడం గమనార్హం. బలూచిస్తాన్‌లో శాంతిభద్రతల బాధ్యత రియాజ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన దక్షిణ కమాండ్‌దే కావడం గమనార్హం. పాకిస్తాన్‌ను అస్థిరం చేయడానికి శత్రు దేశాల ఏజంట్లుగా పని చేస్తున్న ఇతర దేశాల్లో ప్రవాస జీవితం గడుపుతున్న కొంతమంది నాయకుల నినాదాలకు మోసపోవద్దని ప్రజలను హెచ్చరిస్తూ రియాజ్ పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ప్రజలకు వారి పన్నాగాలు బాగా తెలుసుగనుక వారి నినాదాలు పని చేయవని కూడా ఆయన చెప్పారు. బలూచిస్తాన్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడ్డం గురించి మాట్లాడుతూ మిలిటెంట్లు తుపాకులను చూపించి తమ సిద్ధాంతాలను జనంపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే వారిని తాము చిత్తు చేశామని ఆయన చెప్పుకొన్నారు. గత పదేళ్లకాలంలో ఉగ్రవాదం, విచ్ఛిన్నకర కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుతూ 700 మందికి పైగా ఫ్రాంటియర్ కోర్ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారని ఆయన చెప్పారు.