జాతీయ వార్తలు

సహారానుంచి మోదీకి ముడుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహసానా, డిసెంబర్ 21: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. గుజరాత్‌లో బుధవారం ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ సహారా గ్రూపునుంచి మోదీ తొమ్మిదిసార్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. బిర్లా సంస్థ నుంచి కూడా నరేంద్ర మోదీకి ముడుపులు అందాయన్న రాహుల్ వీటన్నింటికీ ఆదాయపన్నుశాఖ వద్ద ఆధారాలున్నాయని వెల్లడించారు. ‘మోదీ ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఐటి వద్ద ఆధారాలున్నాయి. అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు’ అని ఆయన విమర్శించారు. ప్రధాని అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, దీనికి మోదీ ముందుకు రావాలని రాహుల్ తెలిపారు. కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మాట్లాడడానికి తనకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆరోపించారు. వాస్తవాలు బయటపెడతాననే భయంతోనే అధికారపక్షం తన నోరునొక్కేసిందని ఆయన అన్నారు. ఏకపక్షంగా పెద్దనోట్లు రద్దు చేసిన మోదీ ప్రభుత్వం అయోమయంలో పడిపోయిందని రాహుల్ ఎద్దేవా చేశారు. ఏం చేయాలో పాలుపోక రోజుకోరకంగా రూల్స్ మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తన ట్వీట్టర్‌లో రాహుల్ విమర్శలు గుప్పించారు. మోదీ దుస్తులు మార్చుకున్నట్టు రోజుకో రూల్‌ను తెరమీదకు తెచ్చి ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నారని మంగళవారం ఆరోపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విమర్శల దాడి పెంచారు. ఈ నెలాఖరు వరకూ 5 వేలు మాత్రమే డిపాజిట్ చేయాలన్న నిబంధనను ఆయన తప్పుపట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దురదృష్టవశాత్తూ రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వరుస ట్వీట్‌లతో ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు పెద్దనోట్ల రద్దును సమర్థించి, ప్రజల ఆగ్రహాన్ని గమనించి మాటమార్చారని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మెహసానాలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సభకు హాజరైన జనం

విజయవంతమా.. విఫలమా?

నిర్భయ క్షిపణి తాజా పరీక్షపై నోరు మెదపని అధికారులు

బాలాసోర్ (ఒడిశా), డిసెంబర్ 21: పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయను బుధవారం నాడిక్కడి ఐటిఆర్ కేంద్రం నుంచి పరీక్షించారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలిగే పటిమ ఈ క్షిపణికి ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రయోగ పరీక్ష జరిగిన కొన్ని నిమిషాల్లోనే అది విఫలమైనట్లుగా కథనాలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. గతంలో నిర్భయ క్షిపణిని పరీక్షించిన ప్రతిసారీ కూడా అది ఆశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ఈ తాజా ప్రయోగ పరీక్ష కూడా విఫలమైందంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై రక్షణ వర్గాలు కానీ, ఈ ప్రయోగంలో కీలకపాత్ర వహించిన డిఆర్‌డిఓ గానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ ప్రయోగం విఫలమైందన్న కథనాలపై కూడా స్పందించలేదు. నిర్భయ క్షిపణి తొలి పరీక్ష 2013 మార్చిలో జరిగింది. అయితే అప్పట్లో అందులోని ఓ కీలకభాగం సరిగా పనిచేయకపోవడంతో ప్రయోగించిన కొద్దిసేపటికే దాన్ని విఫలం చేశారు. 2014 అక్టోబర్ 17న జరిగిన రెండో పరీక్ష విజయవంతమైంది. అయితే 2015 అక్టోబర్ 16న జరిగిన ప్రయోగ పరీక్ష మొదలైన 700 సెకన్లకే దాన్ని విఫలం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రయోగ పరీక్ష విజయవంతమైందా విఫలమైందా అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

మీ అవినీతి చరిత్ర
అందరికీ తెలుసు

రాహుల్‌పై రవిశంకర్ ప్రసాద్ ఎదురు దాడి

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేసిన అవినీతి ఆరోపణలను బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. గంగానదిలా అత్యంత పవిత్రుడైన నరేంద్ర మోదీపై రాహుల్ అవినీతి ఆరోపణలు చేయటం సిగ్గుచేటని ఆయన అన్నారు. అగస్టా హెలికాప్టర్ కుంభకోణంలో తమ కుటుంబ సభ్యుల పేర్లు రావటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాహుల్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రే అవినీతి మయమని ఆయన దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కుంభకోణంలో బెయిల్‌పై ఉన్న రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. సుప్రీం కోర్టు తోసిపుచ్చిన అంశాలను పట్టుకుని మోదీపై ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. రాహుల్ మెహసానాలో బహిరంగ సభలో ప్రధానిపై చేసిన ఆరోపణలన్నీ పాతవి, నిరాధారమైనవన్నారు.్ఢల్లీతోపాటు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించిన ప్రజలు ఇప్పుడు పార్టీ మున్సిపాలిటీ స్థాయికి కూడా పనికిరాదని నిరూపించారని మంత్రి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తన నాయకత్వంలో కాంగ్రెస్‌ను ఓటమిపాలు చేస్తున్నారని, అందుకే నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని మంత్రి విమర్శించారు. మోదీ గత రెండున్నర సంవత్సరాల నుంచి ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారని ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని దోచేయడమేకాకుండా, దోపిడీకి పాల్పడ్డవారికి రక్షించారని మంత్రి ఆరోపించారు. 2జి స్పెక్ట్రమ్, బొగ్గుబ్లాకులు, కామనె్వల్త్ కుంభకోణాలు దేశ ప్రజలందరికీ తెలుసని మంత్రి స్పష్టం చేశారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తన బావ రాబర్ట్ వాద్రా అవినీతి గురించి ఒక్కమాటైనా రాహుల్ గాంధీ చెప్పారా? మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోని అవినీతిని ఆపేందుకు ఏమైనా చేశారా? అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
రాహుల్ అబద్ధాల కోరు: బిజెపి
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేసిన ఆరోపణలను బిజెపి ఖండించింది. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర బుధవారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర నైరాశ్యంతోనే రాహుల్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీపై వచ్చిన అవినీతి ఆరోపణలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చిందని ఆయన గుర్తుచేశారు. రాహుల్ ఆరోపణలు సుప్రీం కోర్టును అవమానించడమేనని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బ్లఫ్ మాస్టర్‌గా తయారయ్యారని బిజెపి నేత విమర్శించారు. మోదీపై రాహుల్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి ఏముందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆరోపణలు సీరియస్‌గా తీసుకోవల్సిందేమీ లేదని, ఆయన విమర్శలు చూసి పిల్లలు నవ్వుకుంటున్నారని చెప్పారు.

అందుబాటులోకి 5.92లక్షల కోట్లు

గత నెల 10 నుంచి ఈ నెల 19వరకు 220 కోట్ల 500, 2000 నోట్లను విడుదల చేశామన్న ఆర్‌బిఐ

ముంబయి, డిసెంబర్ 21: పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకులు రూ.5.92 లక్షల కోట్లకు పైగా నగదును ప్రజలకు విడుదల చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) బుధవారం తెలిపింది. పెద్దనోట్ల రద్దు తరువాత గత నెల 10 నుంచి ఈ నెల 19వరకు 2.2 బిలియన్ల (220) కోట్ల రూ. 500, 2000 నోట్లను విడుదల చేసినట్లు ఆర్‌బిఐ తెలిపింది. నోట్ల రద్దు తరువాత ఆర్‌బిఐ నగదును విడుదల చేసినప్పటికీ ఆ మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత పెద్ద నోట్లతో పోలిస్తే చాలా తక్కువ. ఈ నెల 10నాటికి ఆర్‌బిఐ, ఇతర ద్రవ్య భోషాణాలకు రూ.12.44 లక్షల కోట్ల విలువగల పాత 500, 1000 నోట్లు చేరాయి. నవంబర్ 8న అర్ధరాత్రి 500, 1000 నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని ప్రకటించిన తరువాత తగినంత మొత్తంలో వివిధ విలువ గల నోట్లను బ్యాంకుల ద్వారా ప్రజలకు సరఫరా చేయడానికి తాను చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బిఐ వివరించింది. నవంబర్ 10నుంచి డిసెంబర్ 19వరకు బ్యాంకులు రూ.5,92,613 కోట్ల విలువ గల నగదును తమ కౌంటర్లు లేదా ఎటిఎంలద్వారా ప్రజలకు సరఫరా చేశాయని ఆర్‌బిఐ పేర్కొంది. పెద్దనోట్ల రద్దు అమలులోకి వచ్చిన రోజయిన నవంబర్ 9న అన్ని బ్యాంకులు, 2.20 లక్షలకు పైగా గల ఎటిఎంలను మూసివేశారు. ప్రజలకు సరఫరా చేయడానికి బ్యాంకులకు వివిధ డినామినేషన్లు గల మొత్తం 22.6 బిలియన్ల నోట్లను విడుదల చేసినట్లు ఆర్‌బిఐ వివరించింది. వీటిలో 20.4 బిలియన్ల నోట్లు రూ.10, 20, 50, 100 విలువ గల చిన్న నోట్లు కాగా, మిగతా 2.2 బిలియన్ల నోట్లు రూ. 2000, 500 విలువ గల పెద్ద నోట్లని పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేయడంతో నవంబర్ 10నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న పాతనోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారు. వ్యక్తులు, కంపనీలు బ్యాంకుల నుంచి తమ డబ్బును ఉపసంహరించుకోవడంపై ఆర్‌బిఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త కరెన్సీని తగినంత విడుదల చేయకపోవడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ఎటిఎంలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. ఇదిలా ఉండగా, పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగుస్తోంది.

ఉర్జిత్ బ్రీఫింగ్ వాయిదా

ముందుగా ఆర్థిక శాఖ వివరాల సేకరణ నోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీ నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి పార్లమెంటు కమిటీ ముందు ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గురువారం చేయాల్సిన ప్రజెంటేషన్ వాయిదా పడింది. ఈ అంశాన్ని తర్వాత చేపడతామని ప్రకటించిన పార్లమెంటరీ కమిటీ పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులనుంచి ముందుగా వివరాలు సేకరించాలని నిర్ణయించింది. గురువారం నుంచే ఈ వివరాల సేకరణ మొదలుపెడతామని వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఈ ప్యానెల్ ప్రకటించింది. ఆర్‌బిఐ గవర్నర్ కంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల వివరణను వినాలని ఈ కమిటీ నిర్ణయించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చే వివరాలు కీలకం కాబట్టి అది ముగిసిన తర్వాతే ఆర్‌బిఐ గవర్నర్‌ను పిలుస్తామని ఈ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఆర్థిక కార్యదర్శి అశోక్ లవాసా తదితర సీనియర్ అధికారులు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి దాని ప్రభావం గురించి పార్లమెంటరీ కమిటీకి వివరిస్తారు. వీరితోపాటు ఇతర నిపుణుల అభిప్రాయాలను కూడా ఈ కమిటీ సేకరించే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 9నుంచి 500, 1000 రూపాయల కరెన్సీ రద్దు కావడంతో గత 43 రోజులుగా దేశవ్యాప్తంగా సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. పాత నోట్లు చెల్లక కొత్త నోట్లు లేక రోజువారీగా నరక యాతన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలను, పరిస్థితులను, అలాగే దాని ప్రభావం గురించి ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులనుంచి పార్లమెంటరీ ప్యానల్ వివరాలను సేకరించే అవకాశముంది. నగదు కొరతను తీర్చేందుకు ఎప్పటికప్పుడు ఆర్‌బిఐ కొత్త ప్రకటనలు చేస్తున్నా అవి మర్నాడే మారిపోయే పరిస్థితి తలెత్తింది. వారానికి 24వేలు ఇస్తామని మొదట చెప్పినా అది ఎక్కడా అమలుకాలేదు. అలాగే గత ఆరు వారాలుగా ఇటు కేంద్రం, అటు రిజర్వ్‌బ్యాంక్ తీవ్రమవుతున్న పరిస్థితులకు అనుగుణంగా కరెన్సీ లభ్యతకు సంబంధించిన నిర్ణయాలను, నిబంధనలను మారుస్తూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పార్లమెంటరీ ప్యానెల్‌కు ఇచ్చే వివరాలకు కీలక ప్రాధాన్యత ఏర్పడింది.

ఆ నల్లడబ్బును
ఏం చేస్తారు?

200 రాజకీయ పార్టీల జాబితాను ఐటికి పంపిన ఇసి

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశంలో చాలా సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం కాగితాలకే పరిమితమైన దాదాపు 200 రాజకీయ పార్టీలను పన్ను మినహాయింపు ప్రయోజనాల జాబితానుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. 2005 నుంచి చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయలేదని గుర్తించిన ఎన్నికల కమిషన్ వాటిలో 200 పార్టీల గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. కాగా, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని ఆదాయం పన్ను శాఖ అధికారులకు లేఖ రాయాలని ఇసి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ పార్టీల్లో చాలా పార్టీలు కేవలం కాగితాలపైనే ఉన్నాయని, విరాళాలు స్వీకరించడం ద్వారా జనం నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడానికి తోడ్పడుతున్నాయని ఎన్నికల కమిషన్ బలంగా నమ్ముతోంది. అందువల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాల జాబితానుంచి తొలగించిన ఈ రాజకీయ పార్టీల జాబితాను ఆదాయం పన్ను శాఖకు ఇసి త్వరలోనే పంపి, ఏదయినా రాజకీయ పార్టీ మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు కనుగొంటే సంబంధిత చట్టాల కింద చర్య తీసుకోవాలని కోరాలని అనుకుంటోంది.
ఎన్నికల చట్టాల కింద ఏదయినా పార్టీని రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయడానికి ఇసికి అధికారమున్నప్పటికీ ఏదయినా పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం మాత్రం దానికి లేదు. రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని ఇసి చేసుకున్న అభ్యర్థన న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కేవలం కాగితాలకే పరిమితమై దీర్ఘకాలంగా ఎన్నికల్లో పోటీచేయని పార్టీలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితానుంచి తొలగించడానికి ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని 324 అధికరణం కింద తనకున్న అధికారాలను ఉపయోగించుకుంటోంది.
దేశంలో 1780కి పైగా రిజిస్టరయినప్పటికీ గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇవికాక మరో 7 జాతీయ పార్టీలు, 58 రాష్టస్థ్రాయి పార్టీలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో నల్లధనం ప్రవాహాన్ని అంతం చేయడానికి ఎన్నికల కమిషన్ పలు సంస్కరణలను ప్రతిపాదించింది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.