అంతర్జాతీయం

ప్రతిభకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 1: కొంతకాలంగా తన ఇమ్మిగ్రేషన్ విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమేర వెనక్కుతగ్గారు. ఈ విషయంలో తన వైఖరి సడలించిన ఆయన ప్రతిభ ఆధారంగానే ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల భారత్ వంటి దేశాలకు చెందిన హైటెక్ నిపుణులు ఎంతో లబ్ధి చేకూరుతుందని, కెనడా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయని అమెరికా కాంగ్రెస్ సంయుక్త సభను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ విధానంవల్ల ఎంతగానో డాలర్ల ఆదా అవుతాయని కార్మికుల వేతనాలూ పెరుగుతాయని వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమెరికా టాప్, అమెరికా స్పిరిట్ అన్న నినాదాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఇతర దేశాలకు చెందినవారి పరిస్థితి ఏమిటన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా ప్రసంగం లక్షలాది మంది వలసదారుల్లో సందేహాలు, అనుమానాలను తొలగించింది. అబ్రహాం లింకన్‌ను స్మరించుకుంటూ ఆయన మాటలను ఉటంకించిన ట్రంప్ ‘లింకన్ మాటలు అక్షర సత్యాలు. వాటిని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని తెలిపారు. తక్కువ నైపుణ్యం, ప్రతిభగల వారిని ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం ప్రోత్సహిస్తోందని, దీనికి బదులు మెరిట్ ఆధారంగా ఈ విధానాన్ని రూపొందిస్తే ఎన్నో ప్రయోజనాలు వస్తాయని ట్రంప్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకే కాకుండా అన్ని కుటుంబాలకు ప్రయోజనం జరుగుతుందని అన్నారు. అమెరికా ఉద్యోగాలను పరిరక్షించుకోవాలంటే న్యాయబద్ధమైన వలసలకు సంబంధించిన వ్యవస్థను కూడా సంస్కరించాల్సిన అవసరం ఎంతో ఉంటుందన్నారు. ప్రస్తుత విధానంవల్ల అమెరికా కార్మికులకు నష్టం జరుగుతోందని, అదేవిధంగా పన్ను చెల్లింపుదారులపైనా భారం పడుతుందని చెప్పారు. నిజమైన, సానుకూల ఇమ్మిగ్రేషన్ విధానంవల్లే అమెరికన్లకు ప్రయోజనం కలుగుతుందని, దేశ భద్రత బలోపేతం అవుతుందని, చట్టాల పట్ల కూడా గౌరవం పెరుగుతుందని ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇమ్మిగ్రేషన్ సమస్యతోపాటు ఇంకా ఎన్నో సవాళ్లు పొంచి ఉన్నాయని వాటన్నింటినీ ఉమ్మడిగానే ఎదుర్కొనగలుగుతామని అన్నారు. దేశ సుదీర్ఘ చరిత్రలో ఎదురైన సవాళ్లను అమెరికా స్పూర్తితోనే అధిగమించామని, దానే్న ఇప్పుడు కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రతిపక్ష డెమోక్రాట్లపైనా, మీడియా సంస్థలపైనా ఎలాంటి విమర్శలు లేకుండా ట్రంప్ ప్రసంగం సాగింది. హెచ్1బి వీసాలపై అమెరికాకు వచ్చే విదేశీయుల్లో అత్యధికులు భారతీయులే. శాస్తవ్రేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, అత్యధిక నైపుణ్యం గలిగినవారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.
ఐఎస్‌ఐఎస్‌ను నిర్మూలించి తీరుతాం
అమెరికాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులకు స్థావరం కానివ్వబోనని ట్రంప్ అన్నారు. ‘నేను గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా.. ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని విశ్వాసాలకు చెందిన పురుషులు, మహిళలు, పిల్లలను హతమార్చిన చట్టవ్యతిరేక ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ని నాశనం చేయడానికి ప్రణాళికను రూపొందించవలసిందిగా రక్షణ శాఖను ఆదేశించాను’ అని ట్రంప్ అన్నారు. ‘అమెరికాలో ఉగ్రవాదాన్ని తయారుకానివ్వం. ఉగ్రవాదులకు మన దేశాన్ని స్థావరం కానివ్వం’ అని ట్రంప్ అన్నారు. తన పాలనాయంత్రాంగం త్వరలోనే దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి, మనకు హానితలపెట్టే వారిని దూరంగా ఉంచడానికి కొన్ని కొత్త చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇస్లామిక్ ఛాందసవాద ఉగ్రవాదం నుంచి మన జాతిని కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అమెరికాలో జరిగిన పలు ఉగ్రవాద దాడులను ఈ సందర్భంగా ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాలోకి ప్రవేశించినవారు ఈ దేశానికి మద్దతివ్వాలని, ఈ దేశ ప్రజలను, విలువలను ప్రేమించాలని ట్రంప్ అన్నారు. ప్రపంచంతో అమెరికాకు అర్థవంతమైన సంబంధాలకోసం తన విదేశాంగ విధానం దోహదపడుతుందన్నారు. ఉమ్మడి ప్రయోజనాలకోసం అమెరికా కొత్త స్నేహితులను, కొత్త భాగస్వాములను కనుగొనాలను కుంటోందన్నారు. మనం సామరస్యాన్ని, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని, యుద్ధాన్ని, ఘర్షణలను కాదని అన్నారు.