అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, ఏప్రిల్ 29: ఫిలిప్పీన్స్‌లో తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు అనేక భవనాలు బీటలు తీశాయ. భయాందోళనకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇద్దరు పౌరులు గాయపడ్డారు. మిండానవో, ఇండోనేషియాల్లో సముద్ర కెరటాలు పెద్దఎత్తున ఎగిసిపడడంతో హెచ్చరికలు జారీ చేశారు. శనివారం తెల్లవారుజామున 4.23 గంటల ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీచేసి తరువాత ఉపసంహరించుకున్నారు. ఇళ్లలో నిద్రిస్తున్నవారు మంచాలపై నుంచి కిందపడిపోయారు. వీధుల్లోకి పరుగులు తీశారని అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రతకు ఓ ఆసుపత్రి, రెండు ప్రభుత్వ భవనాలు, ఒక ఓడరేవు దెబ్బతిన్నాయి. ఒక ఇల్లు కూలిపోయింది. విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం కలిగిందన్నారు.

ఉత్తర కొరియా
క్షిపణి ప్రయోగం విఫలం

వాషింగ్టన్, ఏప్రిల్ 29: ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని పదేపదే సవాలు చేస్తున్న ఉత్తర కొరియా శుక్రవారం మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. అయితే ఈ క్షిపణి ఉత్తర కొరియా భూభాగాన్ని కూడా దాటకుండానే విఫలమైందని అమెరికా శనివారం వెల్లడించింది. అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా వరుసగా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తుండటంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హవాయి కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల 33 నిమిషాలకు ఉత్తర కొరియా పుక్చాంగ్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించినట్లు గుర్తించామని, అయితే ఆ క్షిపణి ఉత్తర కొరియా భూభాగాన్ని కూడా దాటలేదని, ఇటువంటి క్షిపణులతో అమెరికాకు ఎటువంటి ముప్పు లేదని అమెరికా పసిఫిక్ కమాండ్ అధికార ప్రతినిధి డేవ్ బెన్హామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లకు అమెరికా ఎప్పుడూ అండగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరోసారి అణు పరీక్షను గానీ, క్షిపణి పరీక్షను గానీ నిర్వహించకుండా ఉత్తర కొరియాను ఒప్పించడంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విజయవంతమయ్యారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించిన మరుసటి రోజే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించడం గమనార్హం. దీంతో ఉత్తర కొరియా తీరుపై ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు.
ఉత్తర కొరియా తాజాగా నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విఫలమైనప్పటికీ ఈ కవ్వింపు చర్యతో ఆ దేశం చైనాను, అందరూ ఎంతగానో గౌరవించే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అగౌరవపర్చిందని ట్రంప్ ట్వీట్ చేశారు.

ఎన్నో విజయాలు సాధించా

వంద రోజుల పదవీ కాలంపై ట్రంప్ సంతోషం
వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలంలో తొలి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ శనివారం నాటికి తన పదవీ కాలంలో తొలి వంద రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం 14 వారాల వ్యవధిలోనే దేశ రాజధాని వాషింగ్టన్ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసిన తాను ఈ వంద రోజుల వ్యవధిలో ఎన్నో విజయాలను సాధించానని, కనుక అమెరికా చరిత్రలోనే ఇది ఎంతో విజయవంతమైన కాలమని చెప్పుకున్నారు. పదవీ కాలంలో తొలి వంద రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పెన్సిల్వేనియాలో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘అమెరికా చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా మా ప్రభుత్వం తొలి వంద రోజుల్లోనే ఎంతో విజయవంతమైంది’ అని ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి రేడియో, వెబ్ ద్వారా చేసిన వారాంతపు ప్రసంగంలో పేర్కొన్నారు. కొద్దికాలంలోనే తమ ప్రభుత్వం ఎంతో విజయవంతమైందని, ముఖ్యంగా ఎన్నో ఉద్యోగాలను వెనక్కి తీసుకురాగలిగామని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే మిచిగాన్ వాసులనో, ఓహియో వాసులనో లేక పెన్సిల్వేనియా ప్రజలనో అడిగి తెలుసుకుని అక్కడ ఏమి జరుగుతోందో చూడాలని, దేశంలో ఇప్పుడు కార్ల తయారీ సంస్థలు మళ్లీ సత్తా చాటుకుంటున్నాయని, దేశంనుంచి వెళ్లిపోవాలని ఆ సంస్థలు భావించడం లేదని, అమెరికాలోనే ఉండాలని ఆ సంస్థలు కోరుకుంటున్నాయని ట్రంప్ తెలిపారు.