అంతర్జాతీయం

200కు చేరుకున్న మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 30: శ్రీలంకలో వరద తాకిడికి గురయిన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో శ్రీలంక అధికారులతో భారత నౌకాదళానికి చెందిన గజఈతగాళ్లు, వైద్య బృందాలు తోడ్పాటునందిస్తున్నాయి. కాగా, దేశంలో దాదాపు 15 ఏళ్లలో కనీ వినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు మృతిచెందిన వారి సంఖ్య దాదాపు 200కు చేరుకుంది. మరో 112 మంది గాయపడగా, దాదాపు 6 లక్షల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి సహాయక శిబిరాల్లో తల దాచుకొంటున్నారని ప్రకృతి విపత్తుల నిర్వహణ కేంద్రం (డిఎంసి) తెలియజేసింది.
కాగా, మంగళవారం వర్షాలు తగ్గుముఖం పట్టి వాతావరణం మెరుగుపడ్డంతో నాలుగు రోజుల క్రితం సహాయక శిబిరాలకు తరలించిన లక్ష మందికి పైగా ప్రజలు నీళ్లలో మునిగి ఉండిన తమ ఇళ్లలో శిథిలాలను, బురదను తొలగించుకోవడానికి తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. మరో 80 వేల మంది ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్న కారణంగా ఇప్పటికీ సహాయక శిబిరాల్లోనే ఉన్నారు. భారత నౌకాదళానికి చెందిన 300 మందికి పైగా సిబ్బంది సహాయక శిబిరాల్లో శ్రీలంక అధికారులకు సాయపడుతున్నారు. గల్లంతయిన వారి కోసం గజఈతగాళ్లు వరద నీటిలో గాలిస్తుండగా, వైద్య బృందాలు తాత్కాలిక శిబిరాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. నౌకాదళానికి చెందిన మూడు నౌకల్లో ఒకటయిన ‘ఐఎన్‌ఎస్ శార్దూల్’లో ప్రత్యేక శిక్షణ పొందిన సహాయక బృందాలు, గజఈతగాళ్లు వైద్య బృందాలతో కలిసి దాదాపు 300 మంది సిబ్బందితో పాటుగా భారీ మొత్తంలో సహాయక సామగ్రి, జెమిని మర బోట్లు ఉన్నాయి. అలాగే ‘ఐఎన్‌ఎస్ కిర్చ్’లో 125 మంది సిబ్బంది, భారీ మొత్తంలో సహాయక సామగ్రి, ఒక మొబైల్ మెడికల్ టీమ్ ఉన్నాయి. మరో భారతీయ నౌక బాధితులకోసం బియ్యం, పప్పులు, చక్కెర, పాలు, బ్లాంకెట్లులాంటి అత్యవసర వస్తువులు తీసుకుని మంగళవారం ఉదయం ఇక్కడికి చేరుకుంది. మరోవైపు శ్రీలంక ఆర్మీ ట్రక్కులు వరద తాకిడికి గురయిన ప్రాంతాలకు తాగునీరు ఆహారాన్ని తరలిస్తూ ఉండగా, హెలికాప్టర్లు మారుమూల ప్రాంతాలకు మందులు, సహాయక సామగ్రి, ప్లాస్టిక్ బోట్లులాంటి వాటిని తరలిస్తున్నాయి. కాగా, విదేశాలనుంచి ముఖ్యంగా భారత్, చైనా, పాకిస్తాన్‌లనుంచి సహాయం భారీ మొత్తంలో వస్తూనే ఉందని శ్రీలంక కేబినెట్ ప్రతినిధి రజిత సేనారత్నె చెప్పారు.
మరోవైపు పూర్తిగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి 25 లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం ఆమోదించడంతో పునర్నిర్మాణ కృషి సైతం మొదలైంది. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుపాను ‘మోరా’ బంగ్లాదేశ్‌లో ప్రవేశించినప్పుడు బలహీన పడవచ్చని, ఫలితంగా భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు బుధవారంనుంచి తగ్గవచ్చని శ్రీలంక వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున పుత్తలంనుంచి ట్రింకోమలి వరకు, గాలెనుంచి బట్టికలోవా దాకా సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశముందని కూడా ఆ కేంద్రం తెలిపింది. చాలాచోట్ల వరద నీరు వేగంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ గ్రామాల్లో మురికి నీరు చేరిన మంచి నీటి బావులను శుభ్రం చేయడంలో స్థానికుల సహాయం కోసం ప్రభుత్వ టెలివిజన్ విజ్ఞప్తి చేసింది. చాలాచోట్లకు మంచి నీటి సరఫరా చేయడమే పెద్ద సమస్యగా ఉందని అధికారులు కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా, కేలని నదిలో వరద శరవేగంగా పెరుగుతున్నందున వరద తాకిడి ప్రమాదం ఉండే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సోమవారం రాత్రి అధికారులు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు.