జాతీయ వార్తలు

వణికిన ఈశాన్య భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, జనవరి 4: భారీ భూకంపం వల్ల ఈశాన్య భారతం సోమవారం అతలాకుతలమయింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 8మంది మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. మణిపూర్ కేంద్రంగా తెల్లవారుజామున 4.35కు సంభవించిన భూకంపం వల్ల అనేక భవనాలు కూలిపోయాయి. ప్రజలు భీతావహులయ్యారు. మణిపూర్‌లోని టామెంగ్‌లాంగ్ జిల్లాలో భూమి ఉపరితలం నుంచి 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటి (ఎన్‌డిఎంఎ) అందించిన వివరాల ప్రకారం భూకంపం వల్ల ఇంఫాల్‌లో ఇప్పటి వరకు 8మంది మృతి చెందారు. 33మంది గాయపడ్డారు. టామెంగ్‌లాంగ్‌లో అనేక భవనాలు కూలిపోగా, ఇంఫాల్‌లో కొన్ని భవనాలు, మార్కెట్ కాంప్లెక్స్ కూలిపోయింది. అనేక భవనాలు పగుళ్లుతేలాయి. భూకంపం సంభవించిన కొద్ది సేపటికే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టామెంగ్‌లాంగ్ జిల్లాలో ఒక భవనం కూలడంతో అందులో ఉన్న ఒక బాలిక మృతి చెందింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని టావోబుంగ్‌ఖోక్ గ్రామంలో మరో వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
అసోంలోని గౌహతి, ఇతర ప్రాంతాల్లో భూకంపం వల్ల 20 మంది గాయపడ్డారని అస్సాం కమిషనర్ అండ్ సెక్రెటరి (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ప్రమోద్ కుమార్ తివారి చెప్పారు. కనీసం 30 భవనాలు పగుళ్లు తేలాయని అధికారులు తెలిపారు. అస్సాంలో ఉన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తాను మాట్లాడానని, భూకంపం వల్ల తలెత్తిన పరిస్థితులను సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మణిపూర్ సిఎం ఓక్రామ్ ఇబోబి సింగ్ సహా ఈశాన్య ప్రాతంలోని ఇతర సిఎంలతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం వల్ల నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చురుగ్గా సమీక్షిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సహాయక చర్యలు చేపట్టేందుకు గౌహతి నుంచి రెండు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను విమానంలో ఇంఫాల్‌కు తరలించారు. ఈశాన్య భారతంలోని మణిపూర్, అసోం, త్రిపుర, మిజోరం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్‌తో పాటు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల కంట్రోల్ రూమ్/ రిలీఫ్ కమిషనర్లతో ఎన్‌డిఎంఎ మాట్లాడింది.
బిహార్‌లో ఒకరి మృతి
కిషన్‌గంజ్: భూకంపం వల్ల బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఒకరు మృతి చెందారు. దిఘల్‌బాంక్ బ్లాక్‌లోని గర్బన్‌దంగా గ్రామంలో హరిశంకర్ సాహ్ అనే 60 ఏళ్ల వృద్ధుడు భూకంపం వల్ల గుండెపోటు వచ్చి మృతి చెందినట్టు సర్కిల్ అధికారి రాకేశ్ కుమార్ చెప్పారు.
సహాయ కార్యక్రమాల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్
కోల్‌కతా: భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న మణిపూర్‌లో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ప్రజలను ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఎన్ 32 విమానం 75మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని తీసుకొని గౌహతి నుంచి మణిపూర్‌కు వెళ్లిందని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అవసరమైతే పంపించడానికి ఐఎల్76 విమానాన్ని హిండన్ వైమానిక స్థావరంలో సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. మణిపూర్‌లో ఉన్న ఆర్మీ యూనిట్లు భూకంపం వల్ల గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తున్నాయని అధికారులు చెప్పారు.
చిత్రం... ఇంఫాల్‌లో భవన శిధిలాలను తొలగిస్తున్న జవానులు, స్థానికులు.