అంతర్జాతీయం

ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా, ఇయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/వియన్నా, జనవరి 17: అమెరికా, ఐరోపా సమాజాలు ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఆదివారం ఎత్తివేసాయి. ఇరాన్ అణ్వస్త్రాలను అభివృద్ది చేయకుండా నిరోధించడానికి రూపొందించిన చరిత్రాత్మక ఒప్పందం కింద అన్ని హామీలను ఆ దేశం నెరవేర్చిందని ఐక్యరాజ్య సమితి అణు నిఘా సంస్థ (ఐఎఇఏ) ధ్రువీకరించిన తర్వాత అమెరికా, ఇయు దానిపై విధించిన ఆంక్షలన్నిటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్ తన హామీలన్నిటినీ నెరవేర్చిందని ఐఏఇఏ సర్టిఫై చేసిన తర్వాత ‘రెండేళ్లపాటు ఇరాన్ తాను తీసుకుంటానని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చింది’ అని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వియన్నాలో ప్రకటించారు. ఆంక్షలకు సంబంధించి అమెరికా ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు అమలులోకి వస్తాయని కూడా ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన కెర్రీ చెప్పారు. ఇరాన్, ప్రపంచ అగ్రరాజ్యాలయిన అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీల మధ్య గత ఏడాది చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
‘ఇరాన్ తన హామీలన్నిటినీ నెరవేర్చినందున ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి విధించిన అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడమైనది’ అని ఆరు అగ్రరాజ్యాల తరఫు ప్రతినిధి, ఇయు విదేశాంగ విధానం చీఫ్ ఫెడరికా మోఘెరిని ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జారిఫ్‌తో కలిసి వియన్నాలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ దృఢసంకల్పం, పట్టుదల, ఓరిమి, బహుముఖ దౌత్యనీతి ద్వారా మనం ఎంతటి క్లిష్టసమస్యనైనా పరిష్కరించగలమని ఈ విజయం చాటి చెప్పిందని ఆమె అన్నారు.
ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేయడం అంటే వివిధ దేశాలు స్తంభింపజేసిన లక్షలాది కోట్ల డాలర్ల ఆస్తులకు విముక్తి లభించడంతోపాటుగా ఇరాన్ తన చమురును ప్రపంచవ్యాప్తంగా విక్రయించుకోవడానికి, అలాగే ఇరాన్ బ్యాంకులు అంతర్జాతీయ బ్యాకింగ్ వ్యవస్థతో అనుసంధానం కావడానికి వీలు కలుగుతుంది. ఇరాన్ తన అణు ఇంధనంలో 98 శాతాన్ని రష్యాకు తరలించిందని, 12వేలకుపైగా అణు ఇంధనం నింపిన కడ్డీలను ధ్వంసం చేసిందని, అందువల్ల అది ఇక ఎంతమాత్రం యురేనియంను శుద్ధి చేయజాలదని ఐఎఇఏ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ప్లుటోనియంను ఉత్పత్తి చేయడానికి రూపొందించిన ఒక రియాక్టర్ ప్రధాన భాగాన్ని ఇరాన్ సిమెంట్‌తో నింపేసిందని కూడా ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తుందన్న భయాలు తొలగిపోయినందున ప్రపంచ దేశాలు ఇకపై మిగతా అంతర్జాతీయ సమస్యలు, ముఖ్యంగా సిరియా సంక్షోభంపై దృష్టిపెట్టడానికి వీలవుతుందని కెర్రీ అన్నారు. కాగా, ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసే అధికారిక ఉత్తర్వుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేసినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనతో పాటుగా అమెరికా, ఇరాన్‌ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన వార్త కూడా వెలువడింది. వాషింగ్టన్ పోస్టు పత్రిక విలేఖరి సహా తమ జైళ్లలో ఉన్న నలుగురు అమెరికన్లను ఇరాన్ విడుదల చేయగా, దానికి ప్రతిగా అమెరికా వివిధ నేరాల కింద విచారణలు ఎదుర్కొంటున్న లేదా శిక్షలు అనుభవిస్తున్న ఏడుగురు ఇరానియన్లకు క్షమాభిక్ష ప్రకటించింది. వీరిలో ఆరుగురు అమెరికా, ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగినవారు. అలాగే మరో 14 మంది ఇరానియన్లపై ఇంతకు ముందు జారీ చేసిన ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులను కూడా అమెరికా ఉపసంహరించుకుంది.
‘అణ్వస్త్రాలను సముపార్జించుకోనివ్వం’
జెరూసలెం: ఇరాన్ అణ్వస్త్రాలను సముపార్జించుకోవడానికి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటికీ ఈ ప్రాంతంలో శాంతికి ముప్పేనని కూడా ఆయన స్పష్టం చేసారు. ఇరాన్ పట్ల ఇజ్రాయెల్ విధానం ఇప్పటివరకు పాటిస్తూ వస్తున్న మాదిరిగానే ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. ఇరాన్ ఇప్పటికి కూడా అణ్వస్త్రాలను సముపార్జించుకోవాలన్న తన కోరికను వదులుకోలేదని, అది ఇప్పటికీ మధ్యప్రాచ్యాన్ని అస్థిరం చేస్తూనే ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూనే ఉందని ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా, ఐరోపా సమాజం ఆదివారం వియన్నాలో ప్రకటించిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో నెతన్యాహు అన్నారు.

వియన్నాలో ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జారిఫ్‌తో
మాట్లాడుతున్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ