అంతర్జాతీయం

విమానం కూలి 23మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు: నేపాల్‌లో బుధవారం ఒక విమానం కూలిపోయి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 23 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు విదేశీయులు ఉన్నారు. మారుమూల పర్వత ప్రాంతంలో ప్రతికూల వాతావరణం వల్ల పైలట్‌కు సరిగా కనపడని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. టారా ఎయిర్‌కు చెందిన ఈ విమానం రిసార్ట్ పట్టణమైన పోఖరాలోని విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని నిమిషాలకే అదృశ్యమైంది. హిమాలయ పర్వతాలను అధిరోహించే ప్రారంభ ప్రాంతమైన జోమ్‌సోమ్‌కు ఈ విమానం వెళ్లాల్సి ఉంది. నేపాల్‌లోని మ్యాగ్‌డి జిల్లాలో ఈ విమాన శకలాలు దగ్ధమైన స్థితిలో కనిపించాయి. మృతదేహాలు చుట్టుపక్కల విసిరేసినట్లు పడి ఉన్నాయి. సోలిఘోప్టె అటవీ ప్రాంతంలో విమాన శకలాలను కనుగొన్నట్లు నేపాల్ సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రి ఆనంద పొఖరేల్ చెప్పారు. ఈ ఎన్9-ఎహెచ్‌హెచ్ విమానంలో ఉన్న ఇద్దరు విదేశీయులు సహా అందరూ మృతి చెందారని ఆయన ఒక వార్తాసంస్థకు ఫోన్‌లో చెప్పారు. మృతుల్లో ముగ్గురు విమాన సిబ్బంది కాగా, ఇద్దరు పిల్లలు సహా 18 మంది నేపాలీయులు ఉన్నారని ఆయన వివరించారు. ఇద్దరు విదేశీయుల్లో ఒకరు చైనాకు చెందిన వారు కాగా, మరొకరు కువైట్‌కు చెందిన వారని ఆయన వెల్లడించారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల పైలట్‌కు సరిగా కనపడక విమానం దేనినో ఢీకొని ఉంటుందని, దీంతో వెంటనే మంటలంటుకొని కూలిపోయి ఉంటుందని సంఘటన స్థలాన్ని పరిశీలించిన సహాయక సిబ్బంది తెలిపారు. అయితే విమానం కూలిపోవడానికి కారణమేంటో దర్యాప్తులో తేలాల్సి ఉందని నేపాల్ పౌర విమానయాన అధికారులు తెలిపారు. అయితే పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, మంటలు కనిపించాయని ఆ ప్రాంతంలో నివసించే కొంత మంది ప్రజలు చెప్పారు.

చిత్రం... నేపాల్‌లోని మ్యాగ్‌డి జిల్లాలో కొండ ప్రాంతాల్లో
కూలిపోయన విమానం