అంతర్జాతీయం

అమెరికా గే నైట్ క్లబ్‌లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామి, జూన్ 12: అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు ఒక స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్ (గే నైట్‌క్లబ్)లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో కనీసం 50 మంది మృతి చెందగా, 53 మందికి పైగా గాయపడ్డారు. కాల్పులు ప్రారంభమైన తర్వాత మూడు గంటలకు ఆ దుండగుడ్ని భద్రతా దళాలు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో 9/11 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన సంఘటన ఇదే. ఫ్లోరిడా కాల్పుల ఘటన ఉగ్రవాద చర్యేనని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీనిపై ఎఫ్‌బిఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. దర్యాప్తు పురోగతిపై ఎప్పటిప్పుడు సమాచారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తి ఇస్లామిక్ టెర్రరిస్టు అయి ఉండవచ్చన్న అనుమానాలను పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఓర్లాండోలోని పల్స్ నైట్‌క్లబ్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటనతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను, ఎమర్జెన్సీ వాహనాలను అక్కడ మోహరించారు. ఇది మూకుమ్మడి హత్యాకాండ ఘటన అని తాము కచ్చితంగా చెప్పగలమని ఓర్లాండో పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. క్లబ్‌లోపల కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చి చంపినట్లు కూడా వారు మరో ట్వీట్‌లో తెలిపారు. అతనిని ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసియా ప్రాంతంలో నివసిస్తున్న అమెరికా పౌరుడు ఒమర్ మతీన్‌గా గుర్తించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో క్లబ్ మూసివేయడానికి కొద్ది ముందు ఈ కాల్పుల ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్లబ్ వద్ద డ్యూటీలో లేని ఓ సెక్యూరిటీ అధికారిపై మొదట కాల్పులు జరిపిన దుండగుడు ఆ తర్వాత క్లబ్‌లోపలికి చొరబడి గుళ్ల వర్షం కురిపించడమే కాకుండా కొంతమందిని బందీలుగా పట్టుకున్నాడని వారు తెలిపారు. ఎకె రైఫిల్, ఇతర మారణాయుధాలు కలిగి ఉన్న సాయుధుడు క్లబ్‌లో ఎలా గుళ్లవర్షం కురిపించాడో కాల్పులు జరిగినప్పుడు క్లబ్‌లోపలే ఉన్న రికార్డో నేగ్రాన్ అనే వ్యక్తి స్కైన్యూస్ చానల్‌కు వివరించాడు. నిమిషం సేపు ఎడతెరిపి లేకుండా కాల్పులు కొనసాగాయని, తామంతా భయంతో నేలపైన పడుకున్నామని అతను చెప్పాడు. కొద్దిసేపు కాల్పులు ఆగిపోవడంతో తామంతా భయంతో బైటికి పరుగులు తీశామని అతను తెలిపాడు. ఓర్లాండో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ చుట్టుపక్కల వారిని హెచ్చరించడమే కాక క్లబ్ ఉన్న ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసు ఎమర్జెన్సీ వాహనాలు అక్కడ ఉండడం కనిపించింది. కచ్చితంగా ఎంతమంది చనిపోయారో తెలియదని, మృత దేహాలకోసం గాలింపు జరపడానికి, లోపల ఉన్న వారిని కాపాడడానికి అధికారులు భవనం లోపలికి వెళ్తున్నారని ఓ పోలీసు అధికారి ఎఎఫ్‌పి వార్తాసంస్థకు చెప్పారు. కాగా, కాల్పులు జరిపినప్పుడు క్లబ్‌లోపల దాదాపు 300 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్రం కాల్పులు జరిగిన పల్స్‌నైట్ క్లబ్ వద్ద మోహరించిన సహాయ బలగాలు