అంతర్జాతీయం

అమెరికా షట్‌డౌన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 20: నిర్ణీత వ్యవధిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ఈ విషయాన్ని ట్రంప్ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సమయంలోనే ఆ దేశంలో ఇలాంటి అనిశ్చితి ఏర్పడడం చర్చనీయాంశమైంది. అమెరికా ప్రభుత్వం ‘షట్‌డౌన్’ కావడంతో అక్కడి ప్రభుత్వ వార్షిక లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. అమెరికా సెనేట్‌లో ద్రవ్య వినిమయ బిల్లు ఈనెల 19వ తేదీలోగా ఆమోదం పొందాల్సి ఉంది. అయితే డెమోక్రాట్లు, రిపబ్లికన్ సభ్యుల మధ్య సయోధ్య ప్రశ్నార్థకం కావడంతో అనివార్య పరిస్థితుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు మోక్షం లభించలేదు. ఫలితంగా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు సెనేట్‌లో తగిన మద్దతును కూడగట్టడంతలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైంది. సెనేటర్లతో అర్ధరాత్రి వేళ చర్చలు కొలిక్కిరాని నేపథ్యంలో ‘షట్‌డౌన్’కు డెమోక్రాట్లే కారకులంటూ ట్రంప్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘డ్రీమర్ల’ భద్రత విషయంలో డెమోక్రాట్లు పట్టుబట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికార ప్రతినిధి సారా శాండర్స్ పేర్కొన్నారు. ఇలావుండగా
ఫెడరల్ సర్వీసులు, మిలటరీ కార్యకలాపాలకు, ఇతర అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ట్రంప్ ప్రకటించారు. అయితే, వేలసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనం లేని సెలవులపై ఇళ్లకు వెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘షట్‌డౌన్’ ముగిశాక సాధారణ పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి మద్దతు ఇవ్వడానికి బదులు డెమోక్రాట్లు ఉద్దేశ పూర్వకంగానే ‘షట్‌డౌన్’ను కోరుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
శుక్రవారం అర్ధరాత్రితో అప్పటివరకూ అమలులో ఉన్న ద్రవ్య వినిమయ బిల్లు గడువు తీరిపోయింది. ఈలోగా కొత్త బిల్లు ఆమోదం పొందవలసి ఉంది. ‘డ్రీమర్స్’ (స్వాప్నికుల) భద్రతకు ఎలాంటి ప్రతిపాదనలు లేనందున ఈ బిల్లును డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు ప్రభుత్వ నిర్వహణ, ఖర్చులకు సంబంధించి నిధుల వినియోగంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ప్రభుత్వం ‘షట్‌డౌన్’ కాకతప్పలేదు.
‘షట్‌డౌన్’ ప్రభావంతో వచ్చే నెల 16వ తేదీవరకూ అమెరికాలో ప్రభుత్వం మూతపడే అవకాశం ఉందంటున్నారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందాలంటే సెనేట్‌లో మరో 9 మంది డెమోక్రాట్ల మద్దతు ట్రంప్‌కు అవసరం. ప్రతినిధుల సభలో ఈ బిల్లు 230-197 ఓట్ల తేడాతో ఆమోదం పొందినా, సెనేట్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురైంది. ఈ బిల్లులో ‘డ్రీమర్స్’ భద్రతకు సంబంధించి ప్రస్తావన లేదని డెమోక్రాట్లు వ్యతిరేకించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వచ్చిన అక్కడి ఉద్యోగుల పిల్లలను ‘డ్రీమర్స్’ (స్వాప్నికులు)గా పేర్కొంటున్నారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు ఒబామా హయాంలో చట్టపరమైన వెసలుబాటు కల్పించారు. ఈ వెసలుబాటును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో సుమారు 8 లక్షల మంది డ్రీమర్ల భవిష్యత్ అమోమయంగా మారిందని, ద్రవ్య వినిమయ బిల్లులో వీరి భద్రతకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని డెమోక్రాట్లు నిరసన గళం విప్పారు. కాగా, 1981 నుంచి అమెరికాలో ఇలా ప్రభుత్వం మూతపడడం ఇది 12వ సారి. 2013లోనూ 15 రోజుల పాటు ప్రభుత్వం ‘షట్‌డౌన్’ అయింది. ప్రస్తుత పరిణామాలతో ప్రభుత్వానికి వారానికి 42 వేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరుగుతుందని నిపుణుల అంచనా. ఇపుడు ప్రభుత్వం మూతపడడంతో ఉద్యోగులకు 40 రోజులపాటు వేతనం లేని సెలవులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి డెమోక్రాట్లే కారణమని ట్రంప్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.