అంతర్జాతీయం

రక్షిత ధోరణి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 23: ఉగ్రవాదం, రక్షితవాదం, పర్యావరణ సమతూకానికి కలుగుతున్న విఘాతాలు ప్రపంచ దేశాలకు తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 20యేళ్ల తరువాత ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికపై మాట్లాడిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వర్తమాన ప్రపంచ సమస్యలను వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వాధినేతల దృష్టికి తీసుకొచ్చారు. రక్షితవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే వాతావరణ మార్పులను నిరోధించి పుడమిని తక్షణ ప్రాతిపదికన పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రపంచ శాంతిని కబళిస్తున్న ఉగ్రవాదాన్ని ఉమ్మడి శక్తితో అంతం చేయాలని పిలుపునిచ్చారు. డబ్ల్యుఇఎఫ్ వార్షిక సదస్సులో మంగళవారం మాట్లాడిన మోదీ, అంతర్జాతీయంగా భారత నాయకత్వ పటిమను మరింత ప్రస్ఫుటింపజేసేందుకు ప్రయత్నించారు. వర్తమాన ప్రపంచాన్ని చీలుస్తున్న అంశాల విషయంలో జాగరూకత వహించాలని, వాటిని నిర్మూలించుకోవడం, వైషమ్యాలను తొలగించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ భవిష్యత్‌ను ఉమ్మడి ప్రాతిపదికన పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుణాత్మక, నిర్మాణాత్మకరీతిలో విధానాలను రూపొందించుకున్నపుడే రాబోయే తరానికి ఘనమైన, బలమైన భవితను అందించగలుగుతామని స్పష్టం చేశారు. రానున్న తరాలకు జవాబు చెప్పుకోవాల్సిన ప్రశ్నలెన్నో వర్తమాన ప్రపంచానికి ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ వ్యవస్థ విభేదాలను, చీలికలను పెంపొందించేదిగానే ఉందన్న మోదీ, ఈరకమైన విఘాతక పరిస్థితులను నిర్మూలించుకుని కలిసిగట్టుగా పని చేయలేమా? అని ప్రపంచ నేతలను ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తే గుణాత్మకమైన భవిష్యత్‌ను పంచుకునే అవకాశం ఉంటుందని, ఇందుకు వీలుగా వైరుధ్యాలను, విభేదాలను పక్కనపెట్టి పని చేయాలన్నారు. చీలికల ప్రపంచంలో ఉమ్మడి భవితను సృష్టించుకోవడం అన్న అంశమే కీలకంగా ప్రపంచ ఆర్థిక ఫోరం తాజా సదస్సు జరుగుతోంది. మోదీ తన ప్రసంగం ద్వారా అమెరికాయే ముందు, దాని తరువాతే అన్నీ అన్న డొనాల్డ్ ట్రంప్ విధానాలను పరోక్షంగా ప్రస్తావించారు. దీని దృష్ట్యానే రక్షిత వాదానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈవారం చివరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్నారు. చాలా దేశాలు స్వార్థచింతనతో తమ ప్రయోజనాలే ముఖ్యమన్న ధోరణితో వ్యవహరిస్తున్నాయని, దీనివల్ల ప్రపంచీకరణ ప్రయోజనాలకే విఘాతం కలుగుతోందని మోదీ తెలిపారు. ఇలాంటి ప్రతికూల ధోరణులు ఉగ్రవాదం లేదా వాతావరణ మార్పులకంటే తక్కువ ప్రమాదాన్ని తెచ్చేవేవీ కాదని హెచ్చరించారు. ఈ ఏడాది దావోస్ శిఖరాగ్ర సదస్సు ఎంచుకున్న ఇతివృత్తం భారత్‌కు ఎన్నో విధాలుగా వర్తిస్తుందని పేర్కొన్న ఆయన ‘భా రతీయులు ఎక్కడున్నా కూడా ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తారే తప్ప చీలికలు
తీసుకురారు’ అని పేర్కొన్నారు. వసుదైక కుటుంబమే మొదటినుంచీ భారత్ ఆశయమని ఉద్ఘాటించిన మోదీ, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే విషయంలో ఏకాభిప్రాయం కొరవడిందన్నారు. అయితే ఉమ్మడి ప్రమాదం ముంచుకొచ్చినపుడు విభేదాలను పక్కనపెట్టి వాటిని ఎదుర్కొనేందుకు ఏ కుటుంబంలోనైనా ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని, అదే తరహాలో ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు అన్ని దేశాలూ విభేదాలను విస్మరించి ముందుకు రావాలన్నారు. అన్ని విధాలుగా అనుసంధానమైన ప్రస్తుత ప్రపంచంలో ప్రపంచీకరణ వేగం తగ్గుతోందని, దాని తేజమూ అడుగుంటుతోందని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత తరం ఆశలు, ఆకాంక్షలకు అద్దం పడుతున్నాయా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా వర్ధమాన దేశాలకు సంబంధించి ఎన్నో రకాలుగా వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక వృద్ధి ప్రమాణాలు కూడా అనేక రకాలైన వైరుధ్యాలను సృష్టిస్తున్నాయన్నారు. శాంతియుత పరిస్థితులను సంక్లిష్టంగా మార్చే అడ్డుగోడలు అనేక మార్పుల వల్ల ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచ దేశాలు అనుసంధానం కావాలని మాట్లాడతారని, కానీ ధనిక, వర్థమాన దేశాల మధ్య పెరుగుతున్న అగాధం వల్ల ప్రపంచీకరణ ఉద్దేశిత ప్రయోజనాలే దెబ్బతింటున్నాయన్నారు. రక్షితవాదం మళ్లీ వెర్రితలలు వేస్తోందని, దీని కారణంగా కొత్తగా టారిఫ్‌లు, నాన్ టారిఫ్ అడ్డుగోడలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రపంచీకరణ వ్యతిరేకతను చాటుకోవడానికి విభేదాలను సృష్టించటం పరిష్కారం కాదన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలనూ ఉటంకించారు. ‘నేను నా ఇంటి తలుపులు, కిటికీలు మూసేసుకోవాలని అనుకోను. అన్ని దేశాల సాంస్కృతిక పవనాలు ఇంట్లోకి రావాలనే కోరుకుంటాను. అయితే వాటివల్ల నా సొంత సంస్కృతే దెబ్బతినడాన్ని అంగీకరించను’ అన్న మహాత్ముడి మాటలను ప్రస్తుత ప్రపంచ స్థితిగతులకు అద్దంపడుతూ ఉటంకించారు. అలాగే భారత్‌లో వచ్చిన మార్పుల గురించి, పెట్టుబడులకు వచ్చిన అవకాశాల గురించి మోదీ ఈ సందర్భంగా వివరించారు. సంస్కరణలు, పనితీరు పరివర్తన అన్న మూడు సూత్రాల ప్రాతిపదికన తన ప్రభుత్వం పని చేస్తోందన్నారు. భారత్‌లో పెట్టుబడులకు అన్ని విధానాలను సరళతరం చేశామన్నారు. ఇనె్వస్టర్లు భారత్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టి సంస్థలను స్థాపించేందుకు సానుకూల వ్యవస్థలను పాదుగొల్పామన్నారు. భారత్‌నుంచే ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలుకల్పిస్తున్నామన్నారు. భారత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లోనూ విస్తృత సంస్కరణలు తెచ్చాయని, లైసెన్స్‌లు, పర్మిట్ వ్యవస్థలను తొలగించామన్నారు. రెడ్ టేప్ స్థానే రెడ్ కార్పెట్ వేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. అలాగే 1400లకు పైగా కాలం చెల్లిన చట్టాలను తోలగించామని, వస్తు సేవల పన్ను ద్వారా సరికొత్త వ్యవస్థను పాదుగొల్పామన్నారు. జన్‌ధన్ యోజన, బాలికా విద్య, నేరుగా లబ్దిదారులకు నిధుల బదిలీవంటి తమ ప్రభుత్వ విధానాలను మోదీ వివరించారు. శాంతి సంక్షేమం సంపద కోరుకునే వారు భారత్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వల్ల నాగరికతకే పెనుముప్పు వాటిల్లుతోందన్నారు. హిమానీ నదాలు కరిగిపోతున్నాయని, దీవులు కుంగిపోతున్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని అన్నారు. భారత్ ఏ దేశ ప్రకృతి వనరులకు హాని కలిగించదని ఉద్ఘాటించిన మోదీ, ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఉమ్మడిగా ఎలా ముందుకు వెళ్లగలుగుతామన్న అంశంపై అన్ని దేశాలూ కలిసిగట్టుగా ఆలోచించి ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు.

చిత్రం..ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ