అంతర్జాతీయం

కాబూల్‌పై ఉగ్ర పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జనవరి 27: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని శనివారం జరిగిన ఈ బాంబుదాడిలో 95 మంది మరణించారని, 158 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. అంబులెన్స్‌లో బాంబులు పెట్టి పేల్చివేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ‘తాలిబన్’ ప్రకటించింది. గత ఏడాది మే 31న జరిగిన బాంబు దాడి తర్వాత ఇంత ఎక్కువ మంది మరణించడం ఇదే ప్రథమం. పోలీసుల సమాచారం మేరకు అంబులెన్స్ బాంబు దాడికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
‘హై పీస్ కౌన్సిల్’ కార్యాలయానికి సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద ఓ అంబులెన్స్ ఆగింది. కొద్ది సేపటికే ఆ వాహనం ఆకస్మికంగా పేలిపోవడంతో క్షణాల్లో అక్కడ భీతావహ వాతావరణం ఏర్పడింది. రక్తం ఓడుతూ ప్రాణభయంతో చాలామంది పరుగులు తీశారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు ఆఫ్ఘన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి వహీద్ మజ్రోహ్ తెలిపారు. బాంబు పేలిన ప్రాంతం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో పలు భవనాలకు చెందిన కిటికీలు ధ్వంసమయ్యాయి. పేలుడు ప్రభావంతో చిన్న చిన్న కట్టడాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనను ఆత్మాహుతి దాడిగా పోలీసులు చెబుతున్నారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి అంబులెన్స్‌లో మొదటి చెక్‌పోస్టును దాటుకుంటూ పోయాడు. ఓ రోగిని జమురైట్ ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకువెళుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. రెండో చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నాక అంబులెన్స్‌ను పేల్చివేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంబులెన్స్‌లో బాంబులు పేలడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి నస్రత్ రహిమీ
మీడియా ప్రతినిధులకు తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది పౌరులేనని ఆయన చెప్పారు. తాలిబాన్ అనుబంధ సంస్థ ‘హక్యానీ’ కార్యకర్తలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, నలుగురు అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు వివరించారు.
బాంబు పేలుడు జరగడానికి ఇరవై నిమిషాల ముందు రెండో చెక్‌పోస్టు వద్ద పోలీసులు పలు అంబులెన్స్‌లను తనిఖీ చేశారు. డ్రైవర్లు, రోగులు ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వస్తుందని కాబూల్‌లో ఇటీవల అంబులెన్స్‌లను తనిఖీ చేయడం తగ్గించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుడుకు అంబులెన్స్‌ను వినియోగించడాన్ని అంతర్జాతీయ రెడ్ సంఘం తీవ్రంగా ఖండించింది. మారణకాండకు ఇలా అంబులెన్స్‌ను వినియోగించడం ఆమోదయోగ్యం కాదని, అన్యాయమని రెడ్ క్రాస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అంబులెన్స్ దాడికి పాల్పడింది తామేనని ‘తాలిబన్’ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. వారం రోజుల వ్యవధిలో తాలిబన్ జరిపిన రెండో బాంబుదాడి ఇది. కొద్ది రోజుల క్రితం కాబూల్‌లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌లో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విదేశీయులే ఎక్కువ సంఖ్యలో మరణించారు.
అంబులెన్స్ బాంబు పేలిన అనంతరం అక్కడ కొన్ని కట్టడాలు నేలకూలాయి. ఎటుచూసినా శరీర భాగాలు తెగిపడిన దృశ్యాలు కనిపించాయి. గాయాల పాలై రక్తం ఓడుతున్న వారిని స్థానికులు భుజాలపై మోసుకుపోయి ఆస్పత్రుల్లో చేర్పించారు. ఇటలీకి చెందిన ‘ఎమర్జన్సీ’ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో పాలుపంచుకున్నారు. ఇది ఓ ‘ఊచకోత’ లాంటి దారుణ ఘటన అని ఆ సంస్థ సమన్వయాధికారి దేజాన్ పానిక్ వ్యాఖ్యానించారు. బాంబు పేలుడు దృశ్యాలను టీవీ చానళ్లలో చూసిన వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు లోనయ్యారు.
బాంబు పేలిన చోట వాహనాలు, అంబులెన్స్‌లు చేరుకోలేని భీతావహ పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి కొన్ని భవనాల పునాదులు కదిలాయని సమీపంలోని వ్యాపారులు తెలిపారు. భారీ పేలుడు శబ్దం వినిపించిందని, కాసేపటికే అక్కడ మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయని, రక్తం కాల్వలై పారిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తమ కార్యాలయం వద్ద చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని బాంబుదాడి జరిగిందని, భవనంలో కిటికీలు ధ్వంసం అయ్యాయని ‘హై పీస్ కౌన్సిల్’కు చెందిన హసీనా సఫీ తెలిపారు. సంఘటనలో తమ కార్యాలయానికి చెందిన వారెవరూ మరణించినట్టు లేదా గాయపడినట్టు ఎలాంటి సమాచారం లేదని ‘యూరోపియన్ యూనియన్’ అధికారులు తెలిపారు. కాగా, ‘యూరోపియన్ యూనియన్’కు చెందిన వారంతా క్షేమంగా బయటపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. సూపర్ మార్కెట్లు, హోటళ్లు, దుకాణ సముదాయాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నందున విదేశీయులు అప్రమత్తంగా ఉండాలని ఆఫ్ఘన్ ప్రభుత్వం సూచించింది.

చిత్రం..బాంబు దాడి ఘటనలో క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యం