అంతర్జాతీయం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఫిబ్రవరి 8: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశానికి మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన 72 సంవత్సరాల ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఖలీదాపై దాఖలైన ఒక కేసులో ఆమె అవినీతికి పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను ప్రత్యేక న్యాయస్థానం విధించింది. దీనివల్ల ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం కోల్పోయినట్టే. ఆమె భర్త దివంగత జియావుర్ రహ్మాన్ పేర స్థాపించిన జియా అనాధాశ్రమ సంస్థకు విదేశాల నుంచి అందిన 21 మిలియన్ టాకాల (250,000 అమెరికన్ డాలర్లు) వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆమెపై కేసు దాఖలైంది. ఈ కేసులో నిందితుడైన ఆమె పెద్ద కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఉపాధ్యక్షుడితోపాటు మరో నలుగురికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి మహమ్మద్ అఖతరుజ్జమన్ తీర్పు చెప్పారు. రాజకీయ ఉత్కంఠ నెలకొనగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తెల్లటిచీర ధరించిన ఖలీదా జియా గంభీరవదనంతో కోర్టుకు హాజరయ్యారు. ఈ అవినీతి కేసులో నిందితుల నేరాలు ఎటువంటి అనుమానం లేకుండా నిర్ధారణ అయ్యాయని, ప్రధాన నిందితురాలు ఖలీదా జియా వయోభారాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ శిక్ష విధించామని జడ్డి తీర్పులో పేర్కొన్నారు. 632 పేజీల తీర్పులో ముఖ్య విషయాలను న్యాయమూర్తి పది నిమిషాల్లో చదివి వినిపించారు. శిక్షపడిన వారిలో చట్టసభ సభ్యుడు కాజీ సలీముల్ హక్ కమాల్, వ్యాపారవేత్త షర్‌ఫుద్దీన్ అహ్మద్, మాజీ ప్రధాన కార్యదర్శి కమాలుద్దీన్ సిద్దిఖి ఉన్నారు. కాగా ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని, భగవంతుడు న్యాయం చేస్తాడని జియా తరపున న్యాయవాది ఖొండ్కర్ మహబూబ్ హుస్సేన్ పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. తీర్పు వెలువడిన తరువాత ఖలీదా జియాను పాత ఢాకా కేంద్ర కారాగారానికి జీపులో తరలించారు. దేశానికి మూడుసార్లు ప్రధానిగా వ్యవహరించిన జియా జాతీయ పార్టీకి అధ్యక్షురాలని, వయోభారాన్ని పరిగణలోకి తీసుకుని జైలులో ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ తెలిపారు. కోర్టుతీర్పు, ఖలీదా జియాను జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో ఢాకాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

చిత్రాలు..గురువారం ఢాకాలోని ప్రత్యేక న్యాయ స్థానానికి హాజరవుతున్న ఖలీదా జియా.
*ఖలీదాకు జైలు శిక్ష విధించడంతో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కార్యకర్తలు