అంతర్జాతీయం

పొరపాటు జరిగింది అంగీకరించిన జుకర్‌బర్గ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 22: యూజర్ల సమాచారాన్ని రహస్యంగా ఉంచడంలో పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పాడు. గురువారం ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టింగ్ పెట్టాడు. యూజర్ల సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాడు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్‌కోసం, బ్రిటన్‌కు చెంది కేంబ్రిడ్జ్ అనలిటికా పనిచేసిన సందర్భంగా ఐదుకోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదార్ల సమాచారం దుర్వినియోగమైందన్న వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ స్పందిస్తూ, ‘పొరపాటు’ జరిగిందని అంగీకరించారు. ‘ఫేస్‌బుక్‌ను ప్రారంభించింది నేను. అందువల్ల ఇందులో ఏం పొరపాటు జరిగినా నాదే బాధ్యత. అందువల్ల యూజర్ల సమాచారాన్ని మరింత భద్రతంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా’ అన్నారు.
‘సమాచారాన్ని కాపాడే బాధ్యత మాదే. అది చేయలేనప్పుడు మేం మీకు సేవ చేసే అర్హతను కోల్పోయినట్టే’ అన్నారు. తర్వాత ఆయన సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జరిగినదానికి నిజంగా విచారిస్తున్నా’ అన్నాడు. కేంబ్రిడ్జ్ అనెలిటికా (సిఎ)కు చెందిన మాజీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెగ్జాండర్ నిక్స్ - గత మంగళవారం సస్పెండ్ అయ్యారు- ఇంటర్వ్యూను ఛానల్ 4 రహస్యంగా రికార్డు చేసింది. లండన్‌కు చెందిన ఒక కంపెనీ, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరపున డిజిటల్ ప్రచారం నిర్వహించిందని ఆ ఇంటర్వ్యూలోవెల్లడించాడు. దీంతో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ ట్రంప్‌కు ప్రచారం చేసే సమయంలో, ఐదుకోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదార్ల సమాచారాన్ని సేకరించిందంటూ ఛానల్ 4 బయటపెట్టింది. అయితే ఆ డేటాను తొలగించాలని కోరినా ఆ కంపెనీ ఆపని చేసివుండకపోవచ్చన్న అనుమానాన్ని ఫేస్‌బుక్ వ్యక్తం చేసింది. ‘పర్సనాలిటీ ప్రిడిక్షన్ యాప్’ ద్వారా కేంబ్రిడ్జ్ అనెలిటికా ఈ యూజర్ల సైకలాజికల్ ప్రొఫైల్స్‌ను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే జుకర్‌బర్గ్ ఈ విషయంలో కంపెనీ ఇంకా ఎంతో చేయాల్సి ఉన్నదన్నారు. పెద్ద ఎత్తున సమాచారాన్ని కలిగివుండే ప్రతి యాప్‌ను కంపెనీ పరిశీలించి, అనుమానించదగినవేవైనా ఉంటే వాటిపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. వేలాది యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు..
జుకర్‌బర్గ్ ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చే యత్నంలో పడ్డారు. ఇందుకోసం ప్లాట్‌ఫామ్‌ను మరింత భద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం తమ కంపెనీ మూడు రకాల చర్యలు చేపడుతుందన్నారు. ‘పెద్ద సమాచారం ఉన్న యాప్‌లన్నింటినీ పరిశీలించిన తర్వాత 2014లోఅందుబాటులో ఉన్న సమాచార స్థాయిని కుదిస్తాం. ఈ సందర్భంగా ఏ యాప్ అయినా అనుమానాస్పదంగా ఉన్నట్లయితే క్షుణ్ణంగా ఆడిట్ చేస్తాం’ అన్నారు. క్షుణ్ణంగా ఆడిట్ నిర్వహించేందుకు అంగీరించని డెవలపర్లను నిషేధిస్తామన్నారు. వ్యక్తిగత సమాచారానికి ఎవరైనా డెవలపర్ పాల్పడినట్టు తేలితే వారిని నిషేధించి, వారివల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి సమాచారం అందిస్తామన్నారు.
భద్రతను మరింత పెంచుతున్నాం
భారత్ వంటి దేశాల్లో ఏడాదిలోగా ఎన్నికలు రానున్న తరుణంలో, పేస్‌బుక్ సమాచారం భద్రతపై మరిన్ని చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తప్పుడు వార్తలు, ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితంచేసే ఫేక్ అకౌంట్లను గుర్తించేందుకు ఫేస్‌బుక్ సరికొత్త కృత్రిమ మేధస్సు ఉపకరణాలను ప్రవేశపెట్టిందన్నారు. ‘అటువంటి ఉపకరణాన్ని మొట్టమొదటిసారి 2017 ఫ్రాన్స్ ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టాం. 2016 ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ కృతిమ మేధోపకరణాల ద్వారా 30వేల ఫేక్ అకౌంట్లను గుర్తించాం. ఇవన్నీ రష్యా మూలాలతో అనుసంధానమై ఉన్నాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఇదే రకమైన కుయుక్తులను పన్నారు. ఫ్రాన్స్ ఎన్నికల దగ్గరినుంచి మేం వాటిని సమర్ధవంతంగా నిరోధించగలిగాం’ అన్నారు. అదేవిధంగా 2017లో అలబామా ఎన్నికల సమయంలో కూడా కొత్త మేధోపకరణాన్ని ప్రవేశపెట్టి ఫేక్ అకౌంట్లు, తప్పుడు వార్తలను నిరోధించామని జుకన్‌బర్గ్ వెల్లడించారు. మెసడోనియన్‌కు చెందినవారు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఫేస్‌బుక్‌ను అక్రమంగా ఎన్నికలకోసం ఉపయోగిచుకుంటున్నారన్న సత్యాన్ని జుకర్‌బర్గ్ ఈవిధంగా మొదటిసారి అంగీకరించినట్లయింది. ఇక ముందు జరుగబోయే ఇండియా, బ్రెజిల్ తదితర దేశాల ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికలపై ప్రభావం చూపేవిధంగా, సమాచార తస్కరణకు అవకాశమిస్తే ఫేస్‌బుక్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని భారత్ నిన్న జుకర్‌బర్గ్‌ను హెచ్చరించింది. అవసరమైతే సమన్లు జారీ చేస్తామని కూడా పేర్కొంది. కేంబ్రిడ్జ్ అనెలిటికాతో కాంగ్రెస్‌కున్న సంబంధాలపై నిన్న భాజపా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కు హెచ్చరికలు జారీకావడం గమనార్హం.