అంతర్జాతీయం

అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 25: హెచ్-4 వీసా హోల్డర్లకు వర్క్ పర్మిట్లను ఉపసంహరించాలన్న ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనకు సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రముఖ ప్రజాప్రతినిధులు, ఫేస్‌బుక్‌తో సహా అమెరికన్ ఐటీ పరిశ్రమ ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసాలను జారీ చేస్తారు. ఈ వీసాల సహాయంతో వీరు అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ‘ఈ వీసాలను ఉపసంహరించుకోవడం వల్ల అమెరికాలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని, అది ఆయా ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇది అమెరికా అర్థిక వ్యవస్థకు కూడా విఘాతం కలిగిస్తుంది’ అని సిలికాన్ వ్యాలీకి చెందిన ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఎఫ్‌డబ్ల్యూడీ.యుఎస్‌ను ప్రముఖ కంపెనీలు ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఉమ్మడిగా నెలకొల్పాయి.
హెచ్-4 వీసా హోల్డర్లు ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఒబామా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ చట్టాన్ని, ఉపసంహరించబోతున్నట్టు, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ నుంచి లేఖ అందినట్టు అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన మరునాడు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. నిజానికి హెచ్-4 వీసా హోల్డర్లకు వర్క్ పర్మిట్లు ఇవ్వడం వల్ల ఎక్కువగా లాభపడింది నిపుణులైన భారతీయ మహిళలు.
‘ఈ విధానం వల్ల తమ జీవిత భాగస్వాములు శాశ్వత నివాసార్హత సంపాదించేవరకు వేచివుండకుండా, వారిపై ఆధారపడిన వారు తమ అర్హతలకు తగిన ఉద్యోగం చేసే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తుంది. ఇప్పటికే నివాసార్హత కోసం దశాబ్దకాలంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల హెచ్-4 వీసా హోల్డర్లకు వర్క్‌పర్మిట్ విధానం ఎంతో కీలకమైంది’ అని ఎఫ్‌డబ్ల్యుడి.యుఎస్ స్పష్టం చేసింది. దాదాపు 80 శాతం హెచ్-4 వీసా హోల్డర్లు మహిళలే. వీరు తమ హెచ్-1బీ జీవిత భాగస్వాములతో అమెరికాకు రాకమునుపే స్వదేశాల్లో అడ్వాన్స్‌డ్ డిగ్రీలను పూర్తి చేసివుండటం వల్ల మంచి ఉద్యోగాలు పొందగలిగారని పేర్కొంది. హెచ్-4 అధీకృత నిబంధన లేకపోతే వీరు చట్టబద్ధంగా ఉద్యోగాలు నిర్వహించలేరు. ఫలితంగా వారు తమ కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా ఉండటం సాధ్యంకాదు. ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే ప్రత్యామ్నాయ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు లేనట్లయితే వీరు తమ వేతనాలనుంచి పన్నురూపేణా చెల్లించే ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని వివరించింది. హెచ్-4 వర్క్ పర్మిట్ వల్ల దాదాపు లక్షమందికి ఉపాధి కలుగుతోంది.
ఇదిలావుండగా హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ కిర్‌స్ట్‌జెన్ ఎం. నెల్సన్‌కు ప్రజాప్రతినిధులు ఒక లేఖ రాస్తూ, ‘హెచ్-4 నిబంధన వల్ల హెచ్-1బీ వీసా హోల్డర్లపై భారం తగ్గింది. ముఖ్యంగా వీరు నాన్-మైగ్రెంట్స్ దశ నుంచి శాశ్వత నివాసులుగా మారే వరకు వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల, భార్యాభర్తల ఆదాయంతో కుటుంబ నిర్వహణ సజావుగా సాగిపోతున్నది. ఎంతోమంది ఇమ్మిగ్రెంట్లు తమ ఈఏడీల సహాయంతో వ్యాపారాలు ప్రారంభించి అమెరికన్లను ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
మరి ఈ నిబంధనను తొలగిస్తే, అత్యంత నిపుణులైన ఈ ఇమ్మిగ్రెంట్లు పెట్టుబడులు పెట్టే అవకాశాలు కోల్పోతారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు అమెరికన్లకు కూడా చాలా నష్టం. అందువల్ల హెచ్-4 వీసా పర్మిట్‌ను ఉపసంహరించడంపై పునరాలోచన అవసరం’ అని స్పష్టం చేశారు.