అంతర్జాతీయం

రక్తమోడిన గాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, మే 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య రక్తపాతమే సృష్టించింది. జెరూసలెంలో అమెరికా ఎంబసీని ఏర్పాటు చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో మొదలైన ఈ ఘర్షణలు సోమవారం దీన్ని ప్రారంభించడంతో రక్తపాతానికే దారితీశాయి. ఈ ఎంబసీ ప్రారంభాన్ని నిరసించిన వేలాది మంది పాలస్తీనియన్లు ఆగ్రహోదగ్రులయ్యారు. దీని ఫలితంగా జరిగిన ఘర్షణల్లో గాజా ప్రాంతం రక్తమోడింది. ఆందోళనకారులను అణచివేసే క్రమంలో భాగంగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో 37 మంది మరణించారు. 2014 నుంచి ఇంత భారీస్థాయిలో ఈ ప్రాంతంలో హింసాకాండ జరగడం ఇదే మొదటిసారి. టెల్‌అవీవ్‌లో ఉన్న తమ ఎంబసీని జెరూసలెంకు మారుస్తామని గత ఏడాది డిసెంబర్‌లో ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన ద్వారా జెరూసలెం పట్టణం ఇజ్రాయెల్ రాజధాని అన్న విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. మొదటినుంచీ జెరూసలెం విషయంలో పట్టుదలగా ఉన్న పాలస్తీనియన్లకు ట్రంప్ నిర్ణయం విఘాతకరంగా మారింది. ట్రంప్ ముందు వచ్చిన అమెరికా అధ్యక్షు లందరూ జెరూసలెం విషయంలో తటస్థ వైఖరినే అవలంబిస్తూ వచ్చారు. కానీ ట్రంప్ మాత్రం దీన్ని పక్కనబెట్టి తమ ఎంబసీని జెరూసలెంకు మార్చడం ద్వారా వివాదాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఈ ఎంబసీ ప్రారంభం సందర్భంగా అమెరికా జాతీయ గీతాలాపన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ ఫ్రైడ్‌మెన్ ‘మా అధ్యక్షుడు ట్రంప్ ఓ బలమైన నిర్ణయానే్న తీసుకున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇజ్రాయెలీల ఆశలను నిజం చేశారు’ అని అన్నారు. ఇజ్రాయెల్‌ను మొట్టమొదటగా గుర్తించిన దేశం అమెరికాయేనని, అలాగే ఇప్పుడు జెరూసలెంను దాని రాజధానిగా గుర్తించిన ఘనత తమకే దక్కిందని అన్నారు. ట్రంప్ విశాల దృక్పథానికి, ధైర్యానికి, నైతిక స్పష్టతకు ఇది నిదర్శనమన్నారు. ఓ పక్క ఈ పొగడ్తల పర్వం కొనసాగుతున్న తరుణంలోనే గాజా సరిహద్దు పొడవునా వేలాదిగా మోహరించిన పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దళాలతో ఘర్షణకు దిగారు. ఆయుధ బలం కలిగిన ఇజ్రాయెల్ దళాలు 37 మందిని కాల్చి చంపాయని, మరో 1700 మంది తీవ్రంగా గాయపడ్డారని హమస్ నిర్వహణలో సాగుతున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దళాలపై నిప్పులు చెరిగిన ఆందోళనకారులు మండుతున్న టైర్లను ఇజ్రాయెల్ దళాలపై విసిరారు. అలాగే రాళ్ల వర్షమూ కురిపించారు. తమకు అడ్డుకట్టగా వేసిన కంచెను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. తాజా పరిణామాలపై పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. అలాగే ఆయన సారథ్యంలోని పాలస్తీనా అథారిటీ కూడా ఇజ్రాయెల్ చర్యను గర్హించింది. ఈ తాజా ఘాతుకానికి పాల్పడడం ద్వారా ఇజ్రాయెల్ ఓ దారుణమైన తప్పు చేసిందని పాలస్తీనా అథారిటీ మండిపడింది. ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దురాగతాన్ని ప్రపంచ దేశాలు గమనించాలని, తక్షణమే జోక్యం చేసుకుని ఈ దారుణాన్ని అరికట్టాలని పాలస్తీనా ప్రభుత్వ ప్రతినిధి యూసుఫ్ అల్ మహ్మద్ డిమాండ్ చేశారు. గాజా సరిహద్దులోని ఐదు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు కాల్పులకు ఒడిగట్టాయని, ఎంబసీ ప్రారంభానికి ముందే నిరసనలను అరికట్టడానికి రక్తపాతాన్ని సృష్టించాయని ఆయన అన్నారు. అయితే గాజాను నియంత్రిస్తున్న హమస్ సంస్థ పాలస్తీనీయులను రెచ్చగొట్టిందని, తమపై టెర్రరిస్టు చర్యలకు పాల్పడేందుకు ఒడిగట్టిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

చిత్రాలు..జెరూసలెంలో అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ
భారీ స్థాయలో నిరసనకు దిగిన పాలస్తీనీయులు