అంతర్జాతీయం

షరీఫ్‌కు మద్దతుగా ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 14: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పాకిస్తాన్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన కారణంగా ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పీఎంల్‌ఎల్-ఎన్) నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం (ఏటీఏ)తోపాటు అక్కడి పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈవెన్‌ఫీల్డ్ ఆస్తుల కుంభకోణం కేసును ఎదుర్కొంటున్న షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ నవాజ్ కోర్టుకు హాజరయ్యేందుకు లండన్ నుంచి లాహోర్ చేరుకున్నారు.
షరీఫ్‌కు పది, మరియంకు ఏడేళ్ల జైలు శిక్షను పాక్ కోర్టు ఇప్పటికే నిర్ధారించింది. ఈ తీర్పుపై వీరు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కాగా, వీరి రాకను పురస్కరించుకొని, పీఎంఎల్-ఎన్ నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్, సీనియర్ నాయకుడు సాదిక్ షాహిద్ ఖకాన్ అబ్బాసీసహా సుమారు 20 మంది నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 1,500 మంది కార్యకర్తలు, కార్మికులను కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.
అల్లామ ఇక్బాల్ విమానాశ్రయానికి వెళ్లేదారిలో పీఎంఎల్-ఎన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్టు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ, దానిని పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. ఏటీఏతోపాటు పాకిస్తాన్ పీనల్ కోడ్ (పీపీసీ)లోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రజలను భయపెట్టడం, దాడులకు తెగబడడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, కోర్టు తీర్పులను సవాలు చేసే విధంగా నినాదాలు ఇవ్వడం, దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం వంటి పలు నేరాలకు వీరు పాల్పడ్డారని అధికారులు అంటున్నారు.
అందుకే వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు.
అరెస్టులు అన్యాయం..
శాంతి యుతంగా ర్యాలీలో పాల్గొన్న నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, కార్మికులను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని, ఇది ప్రజాస్వామ్య విధానికే తలవంపులు తెచ్చే చర్య అని పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.