అంతర్జాతీయం

బాగ్దాద్‌లో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, జూలై 3: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం వేకువ జామున జరిగిన రెండు వేర్వేరు బాంబు దాడుల్లో 120మందికి పైగా మృతి చెందగా, మరో 140 మంది గాయపడ్డారని ఇరాక్ అధికారులు తెలిపారు. బాగ్దాద్ నగరం మధ్యలో నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతమైన కరాడాలో జరిగిన శక్తివంతమైన కారుబాంబు దాడిలో వందమందికి పైగా చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు, ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెలలో తెల్లవారుజామున ఉపవాస దీక్ష విరమించిన తర్వాత పిల్లలు, పెద్దలు కలిసి షాపింగ్‌కోసం వీధుల్లోకి వచ్చిన సమయంలో ఈ పేలుడు సంభవించింది. కాగా, ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు ఆన్‌లైన్‌లో ఉంచిన పోస్టింగ్‌లో ఈ దాడి తామే జరిపినట్లు ప్రకటించుకోవడమే కాకుండా షియా ముస్లింలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసుకుని దాడి జరిపినట్లు ప్రకటించుకుంది. తెల్లవారాక కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి శ్రమిస్తూ, కాలిపోయిన భవనాల శిథిలాల మధ్య మృతదేహాల కోసం వెతుకుతూ కనిపించారు. చనిపోయిన వారిలో చాలా మంది పిల్లలే ఉన్నారని సంఘటన స్థలంలోఉన్న అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తాసంస్థ రిపోర్టర్లు తెలిపారు. పేలుడు జరిగిన చాలా గంటల తర్వాత కూడా అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి రావడం కనిపించింది. శక్తివంతమైన పేలుడు కారణంగా దగ్గర్లో ఉన్న బట్టల షాపులు, సెల్‌ఫోన్ దుకాణాల్లో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బాంబు పేలుడు సంభవించిన కొద్దిగంటల తర్వాత ఇరాక్ ప్రధాని హైదర్ అల్- అమాదీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అయితే ఆగ్రహంతో ఉన్న జనం ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నట్లుగా ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో ఉంచిన ఓ వీడియో ఫుటేజ్‌లో ఉన్నాయి. కాగా, తూర్పు బాగ్దాద్‌లో జరిగిన మరో దాడిలో అత్యధునాతన పేలుడు పరికరం (ఐఇడి) పేలడంతో అయిదుగురు చనిపోగా, 16 మంది గాయపడ్డారు. కాగా, ఈ దాడి తామే జరిపినట్లు ఏ మిలిటెంటు గ్రూపు చెప్పుకోలేదు.
ఐఎస్‌నుంచి ఫల్లుజా నగరాన్ని పూర్తిగా విముక్తం చేసినట్లు ఇరాక్ సైన్యాలు ప్రకటించిన వారం రోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం. గత ఏడాది కాలంలో ఇరాకీ సైన్యాలు ఐఎస్ అధీనంలో ఉండిన రమాది సిటీ, హిత్, రుత్బా పట్టణాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకోగలిగాయి. ఇవన్నీ కూడా బాగ్దాద్‌కు పశ్చిమంగా ఉన్న అంబర్ రాష్ట్రంలోనివే. యుద్ధ రంగంలో ఇరాక్ సైన్యాలు పైచేయి సాధించినప్పటికీ ఐఎస్ ఇప్పటికీ తాము ఎక్కడైనా దాడులు జరపగలమని పదే పదే నిరూపించుకుంటూ ఉంది.

చిత్రాలు.. . సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం
షాపింగ్ మాల్‌లో సంభవించిన పేలుడు ధాటికి తునాతునకలైన భవనాలు