అంతర్జాతీయం

ముదిరిన లంక సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో:శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాన మంత్రి రనిల్ విక్రమసింఘేను తొలగించిన దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం నవంబర్ 16వరకూ పార్లమెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తన మెజార్టీని నిరూపించుకునేందుకు పార్లమెంట్‌ను అత్యవసరంగా సమావేశ పరచాలంటూ విక్రమసింఘే డిమాండ్ చేసిన నేపథ్యంలో దేశాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల లంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుపాకాన పడినట్టయింది. కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన మహింత రాజపక్సకు మెజార్టీ నిరూపణ నిమిత్తం మరింత సమయాన్ని ఇచ్చే ఉద్దేశంతోనే మైత్రిపాల పార్లమెంట్‌ను సస్పెండ్ చేసినట్టుగా భావిస్తున్నారు. 225 సీట్లు కలిగిన పార్లమెంట్‌లో సిరిసేన-రాజపక్స కూటమికి 95సీట్లు మాత్రమే ఉన్నాయి. విక్రమసింఘె సారథ్యంలోని యుఎన్‌పి పార్టీకి సొంతంగానే 106సీట్లు ఉన్నాయి. అంటే మెజార్టీకి కేవలం ఏడు సీట్లు మాత్రమే ఈ పార్టీకి కావాల్సి ఉంటుంది. రాజపక్సకు మెజార్టీ లేకపోవడం వల్లే పార్లమెంట్‌ను సిరిసేన సస్పెండ్ చేశారని విక్రమసింఘే ఆరోపించారు. తనను తప్పించి దేశ ప్రధానిగా రాజపక్సను నియమించడం రాజ్యాంగ విరుద్ధం, అక్రమం, అన్యాయమని విక్రమసింఘె విరుచుకు పడుతున్నారు. దేశంలో ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించారని, అనవసరంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తమ పార్టీ అధినేతను ప్రధాన మంత్రి పదవి నుంచి అక్రమంగా తప్పించడాన్ని నిరసిస్తూ యుఎన్‌పి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తమిళనాట ఆందోళన
ఇదిలా ఉండగా లంక పరిణామాల పట్ల తమిళనాట తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా శ్రీలంకలో దశాబ్దాలుగా జీవిస్తున్న తమిళుల పరిస్థితి అలాగే జాలర్ల భద్రతకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళనతో తమిళ ప్రజలు తల్లడిల్లుతున్నారు. మళ్లీ లంక అధ్యక్షుడుగా రాజపక్స బాధ్యతలు చేపట్టడం, ఒక్కసారిగా అక్కడ అధికార వ్యవస్థ మారిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా తమిళ ప్రజల్లో దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోందని డీఎంకే నాయకుడు స్టాలిన్ అన్నారు. రాత్రికి రాత్రే ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘెను తొలగించడం మాజీ అధ్యక్షుడు రాజపక్సకు ప్రధాని బాధ్యతలు అప్పగించడం.. పార్లమెంట్‌ను సస్పెండ్ చేయడం వంటి పరిణామాలు ఓ మిస్టరీగా మారాయని స్టాలిన్ అన్నారు. ఇవన్నీ కూడా తమిళ ప్రజల హక్కులను కాలరాసే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజపక్స, విక్రమసింఘెలు ఇటీవల ఢిల్లీలో పర్యటించడాన్ని అలాగే తనను హతమార్చేందుకు భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీ కుట్ర పన్నుతోందని సిరిసేన ఆరోపించడాన్ని ఆయన ప్రస్తావించారు. తాను ఈ రకమైన ఆరోపణ చేయలేదని సిరిసేన అనంతరం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు మెజార్టీ లేకపోయిన లంక ప్రధానిగా రాజపక్స బాధ్యతలు చేపట్టడం తమిళ ప్రజల్లో భద్రత పరమైన భయానికి కారణమవుతోందని స్టాలిన్ అన్నారు.

చిత్రం..కొలంబోలోని అధికార నివాసంలో మద్దతుదారులతో మట్లాడుతున్న బర్తరఫ్‌కు గురైన ప్రధాని రనీల్ విక్రమ సింఘె