అంతర్జాతీయం

ప్రగతి ఇంజన్ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 29: విస్తృత పరివర్తనా పథంలో భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా భారత్ ఎదుగగలదన్న నమ్మకాన్ని అంతర్జాతీయ ఏజెన్సీలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. నవభారత నిర్మాణంలో సహకరించాలని జపాన్‌లోని ప్రవాస భారతీయులకు సోమవారం పిలుపునిచ్చిన మోదీ ఉజ్వల రీతిలో దేశ నిర్మాణంలో ఎక్కడున్నా ప్రతి భారతీయుడు క్రియాశీలక భూమిక పోషించాలన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా సాగుతున్న ఎన్డీయే పాలనలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆర్థికంగా, సాంకేతికంగా కూడా భారత్ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. మానవాళి అభ్యున్నతికి భారత్ చేస్తున్న కృషిని ప్రపంచ దేశాలు శ్లాఘిస్తున్నాయని తెలిపారు. అభ్యుదయ విధానాలు, సంక్షేమ పథకాల విషయంలోనూ భారత్‌కు ఎనలేని గుర్తింపు వచ్చిందని పేర్కొన్న ఆయన ‘అంతర్జాతీయ సమస్యలకు భారత పరిష్కారాలను అందించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. జనధన్ యోజన, మొబైల్, ఆధార్, డిజిటల్ లావాదేవీల ప్రక్రియ పట్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లుకురుస్తోందన్నారు. అలాగే టెలికమ్యూనికేషన్లు, ఇంటర్‌నెట్ కూడా భారత్‌లో ఎంతగానో విస్తరించిందని ఈ సందర్భంగా మోదీ వివరించారు. బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీ గ్రామగ్రామానికీ అందుబాటులోకి వస్తోందని పేర్కొన్న ఆయన డిజిటల్ రంగంలో కూడా ఇటీవల కాలంలో అద్భుత రీతిలో పురోగతి నమోదైందని వివరించారు. అంతర్జాతీయంగా భారత్‌ను మరింత దూసుకుపోయేలా చేసే ఉద్దేశంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్‌గా మారిందన్నారు. కేవలం దేశీయ వినియోగానికే కాకుండా అంతర్జాతీయంగా కూడా అందుబాటులోకి తేవడానికి నాణ్యతాయుతమైన వస్తువులనే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగంలోనూ భారత్ అంతర్జాతీయ హబ్‌గా మారుతోందని మోదీ చెప్పారు. గత ఏడాది వంద ఉపగ్రహాలను ఒకేసారి రోదసీలోకి పంపి భారత శాస్తవ్రేత్తలు నిరుపమాన విజయాన్ని సాధించారని, అతి తక్కువ ఖర్చుతోనే చంద్రయాన్, మంగళ్‌యాన్ వ్యోమ నౌకలను ప్రయోగించగలిగామని మోదీ గుర్తు చేశారు. 2022నాటికి గంగాయాన్‌ను కూడా ప్రయోగించే లక్ష్యం దిశగా భారత్ దూసుకుపోతోందని వివరించారు. పూర్తిస్థాయి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతోనే గంగాయాన్ రూపకల్పన జరుగుతుందని, ఇందులో పయనించే వ్యక్తీ భారతీయుడే అవుతాడని మోదీ తెలిపారు. అంత్యంత వేగంగా ప్రగతి నమోదు చేసుకుంటున్న దేశంగా భారత్‌కు ప్రవాసీయులు గురుతర రీతిలో సహకరించాలన్నారు.
నవ భారత నిర్మాణంలో జపాన్ అందిస్తున్న చేయూతనూ ఈ సందర్భంగా మోదీ ప్రస్తుతించారు. బులెట్ ట్రైన్ నుంచి స్మార్ట్ సిటీల నిర్మాణం వరకూ నవభారత నిర్మాణంలో జపాన్ నిర్మాణాత్మకంగా, క్రియాశీలకంగా పాల్గొంటోందని చెప్పారు. జపాన్‌లో ఉంటున్న భారత సంతతివారందరూ భారత రాయబారులేనని స్పష్టం చేసిన మోదీ స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని, ఆ విధంగా మాతృభూమితో సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

చిత్రం..టోక్యోలో జపాన్ నేషనల్ టూరిస్ట్ ఆర్గనైజేషన్, భారత టూరిజం స్టాల్‌ను సందర్శించిన ప్రధాని మోదీ