అంతర్జాతీయం

మలుపులు.. మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఆయుధ సంపత్తి పరంగా శాసించే దేశాల మధ్య సఖ్యత ఉంటేనే విశ్వశాంతి బలపడుతుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన దేశాల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు నెలకొనడం కూడా ఇందుకు ఎంతైనా అవసరం. 2018 సంవత్సరం ప్రపంచాన్ని మలుపు తిప్పిన ఎన్నో కీలక పరిణామాలకు కేంద్ర బిందువయింది. అగ్ర రాజ్యాలుగా వున్న అమెరికా రష్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తడం అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం, మరోసారి అంతర్జాతీయంగా పట్టుని బిగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నించడం, బ్రెగ్జిట్‌పై ముందుకా, వెనక్కా అన్న సందిగ్ధంలో బ్రిటన్ ప్రధాని థెరిస్సామే డోలాయమనం ప్రపంచ పరిణామాలను శాసిస్తూనే వచ్చాయి.
అడుగేస్తే అలజడే!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఎంత వివాదాస్పదమైందో వైట్‌హౌస్‌ను అధిష్టించిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అంతే అలజడికి కారణమయ్యాయి. విస్మయపూరిత నిర్ణయాలను తీసుకోవడమే గాకుండా, ఇక మిత్ర దేశాలను కలవరపాటుకు గురిచేశాయి. చైనాతో అమీతుమీ అన్న రీతిలో వాణిజ్య యుద్ధ సెగలను రగిలించి సమర వాతావరణానికి ఆజ్యం పోశారు. ఇటు నాటో దేశాలతో కూడా తెగతెంపులకు తెరతీయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఏ వ్యక్తి సాహసించని చర్యలకు ఒడిగట్టి అంతర్జాతీయంగా అమెరికా పలుకుబడికే గండి కొట్టడమన్నది ఒక్క ట్రంప్‌కే సాధ్యమైందేమో. ఇలాంటి వ్యక్తిని అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిగా ఎందుకు నామినేట్ చేశామా? అంటూ రిపబ్లికన్ పార్టీ అధినాయకత్వమే తలలు పట్టుకునేలా సాగిన ట్రంప్ వ్యవహార శైలి ఆయన అధ్యక్ష పదవికే ముప్పుతెచ్చే పరిణామాలకు దారులు తీస్తుందా? ఆయన ఈ పదవిలో ఉండేది మరో రెండేళ్లే అయినా.. ఆ రెండేళ్లు కూడా భరించడం కష్టమేనన్న భావన ఇటు రిపబ్లికన్‌లలోనూ, అటు డెమోక్రట్లలోనూ వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రాబర్ట్ ముల్లర్ విచారణ కొలక్కి వస్తే అది ట్రంప్‌కు పూర్తి స్థాయిలో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు ఎప్పటికప్పుడు వేడి రగిలిస్తూనే వచ్చాయి. తాజాగా మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలన్న ఆయన నిర్ణయం అమెరికా ప్రభుత్వమే స్తంభించిపోయే పరిస్థితులకు దారితీసింది. మరి అమెరికా ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు ఈ వివాదాస్పద అధ్యక్షుడి విషయంలో కొత్త సంవత్సరంలో ఎలా వ్యవహరిస్తాడన్నది ఉత్కంఠను రేపే అంశమే.
కునుకు పట్టనివ్వని బ్రెగ్జిట్!
ఎప్పటికప్పుడు బ్రెగ్జిట్ వివాదం కొత్త తలనొప్పులు తెస్తూనే ఉంది. ఐరోపా యూనియన్ నుంచి వైదొలిగి సొంతంగానే మనుగడ సాగించాలంటూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయ ఫలితంగానే బ్రెగ్జిట్ అవతరించింది. ఐతే ఈ ప్రతిపాదనను ఆమోదించినవారికి, వ్యతిరేకించిన వారికి మధ్య తేడా తక్కువగా ఉండడం వల్ల ఈ విడాకుల వ్యవహారం విపరీత పరిణామాలకు తెరతీసింది. బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆమెకు ఎడతెగని సమస్యలే సృష్టించింది. సంక్షోభాల మీద సంక్షోభాలను తట్టుకుంటూ ఏటికి ఎదురీదే చందంగానే థెరిసా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందా? లేదా అన్నది అనుమానాలకు దారితీసింది. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయనని థెరిసా హామీ ఇవ్వడంతోనే ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో ఆమె గట్టెక్కగలిగింది. దాదాపుగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు, లేబర్ పార్టీ సభ్యులు బ్రెగ్జిట్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు సృష్టిస్తూనే వున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న బ్రెగ్జిట్ వ్యవహారం వచ్చే ఏడాది మార్చి 29 నాటికి పూర్తి కావలసివుంది. అప్పట్లోగా అంతర్గత వివాదాలను థెరిసా మే చక్కబెట్టకపోతే బ్రిటన్ తీవ్ర స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఎదుర్కొంటుంది. బ్రిటన్‌కు అన్ని విధాలుగా ప్రయోజనం కలిగించే రీతిలోనే ఐరోపా యూనియన్ ఒప్పందం కుదుర్చుకుంటున్నామని థెరిసా చెబుతున్నా, అంతర్గత తిరుగుబాటు మాత్రం ఆమెకు నిద్రపట్టనివ్వడం లేదు. డెడ్‌లైన్‌లోగా ఒప్పందం కుదరకపోతే ఎలాంటి ఒడంబడిక లేకుండానే ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ తొలగిపోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా థెరిసా యుద్ధ ప్రాతిపదికన వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. కొత్త ఏడాదిలో అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.

డ్రాగన్ రూటేవేరు..
ఎప్పటికప్పుడు ప్రపంచ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఆర్థికంగానూ, రాజకీయంగానూ మరింతగా పలుకుబడిని పెంచుకోవడంలో చైనాను మించిన దేశం మరొకటి లేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆర్థికస్థితి కలిగిన దేశంగా రాణిస్తున్న చైనా దాదాపుగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని తన గుప్పిట పెట్డుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేయడం ఈ ఏడాది కీలక పరిణామం. చైనా అధ్యక్షుడిగానే కాకుండా, సుప్రీం నాయకుడిగా తిరుగులేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకున్న జీ జిన్‌పింగ్ తమ దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చేందుకు పావులు కదుపుతున్నారు. అమెరికా వ్యతిరేకిస్తున్న పారిస్ సహా కీలక ఒప్పందాలకు మద్దతు ఇవ్వడం, అలాగే అమెరికా నిధులు ఆపేసిన పాక్ వంటి దేశాలను ఆదుకోవడమే పనిగా పెట్టుకున్న చైనా వ్యాపార, వాణిజ్య పరంగానూ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ వస్తోంది. ట్రంప్ తీసుకున్న వివాదస్పద నిర్ణయాల పుణ్యమా అని మరో బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన దేశంగా ఉన్న చైనా అన్ని విధాలుగా బలపడుతోంది. అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు అమెరికా వైఫల్యాలను ఆలంబనగా మార్చుకుంటోంది. ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలపై చైనా పలుకుబడి పెరగడం, ప్రపంచ శాంతికి నిధులు అందిస్తున్న రెండో అతిపెద్ద దేశంగా ఎదగడం జీ జిన్‌పింగ్ వ్యూహాత్మక చర్యలకు నిదర్శనం. అమెరికా ధోరణి ఇలాగే కొనసాగితే కొత్త సంవత్సరంలో చైనాకు పట్టపగ్గాలే వుండవన్నది నిపుణుల వాదన.
అడియాసల పుతిన్
రష్యా ప్రధానిగా అనంతరం అధ్యక్షుడిగా తిరుగులేని పట్టును కొనసాగిస్తూ వచ్చిన వ్లాదిమిర్ పుతిన్ పాపులారిటీ తగ్గుతోందా? అమెరికాతో ఎడతెగని వివాదాలు ఓ పక్క, సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన రెపబ్లిక్‌లతో వివాదాలు మరోపక్క పుతిన్‌ను వేధిస్తూనే వున్నాయి. భారీ ఓట్ల మెజార్టీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పుతిన్‌తప్ప మరోబలమైన నాయకుడి గురించి తెలియని రష్యా యువతరానికి ఆయన నిర్ణయాలు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా అలెక్సీ నావాల్ని చేపడుతున్న ఉద్యమం పుతిన్ నాయకత్వానికే సవాల్‌గా మారుతుంది.ఈ ఏడాదిలో ప్రపంచ ఫుట్‌బాల్ కప్ నిర్వాహణతో పాటు ఎన్నో రకాలుగా అంతర్జాతీయ ఖ్యాతిని రష్యా సంపాదించుకున్నప్పటికీ అంతర్జాతీయంగా మళ్లీ పట్టు సంపాదించి పూర్వ వైభవాన్ని పొందాలన్న పుతిన్ ప్రయత్నాలు మాత్రం ఓ కొలిక్కి రావడంలేదు. అమెరికా సారథ్యంలో పలు పశ్చిమ దేశాలు ఇందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపైనా ప్రధావాన్ని కనబరుస్తున్నాయి. సిరియా విషయంలో ఇటీవల తాము సాధించిన విజయాన్ని సానుకూలంగా మార్చుకుని అంతర్జాతీయంగా మరోసారి ఎదిగేందుకు రష్యా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కారణం సిరియా విషయంలో రష్యా తీసుకుంటున్న నిర్ణయాలను జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్‌లు వ్యతిరేకించడమే. రష్యా ప్రయోజనాల కోసం తామెందుకు నిధులను వెచ్చించాలన్న మెలికతో పుతిన్ ప్రయత్నాలకు ఈ దేశాలు గండికొట్టాయి. ఈ నేపథ్యంలో అంతర్గత సెగలు, అంతర్జాతీయ సవాళ్లు, అలాగే పెరుగుతున్న జనాభా పుతిన్‌కు గుదిబండలుగా మారుతున్నాయి. కొత్త సంవత్సరం ఆయనకు సవాళ్లమయంగానే పరిణమించే అవకాశం ఉంది.

కొలిక్కిరాని కొరియా!
ఈ ఏడాది ఉత్తర కొరియా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అమెరికాపై దాడిచేస్తామని, పొరుగున వున్న దక్షిణ కొరియాపై యుద్ధ్భేరి మోగిస్తానంటూ అలజడి సృష్టించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాన్ ఎట్టకేలకు అమెరికా ఒత్తిళ్ల ఫలితంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిఖరాగ్ర భేటీ అయినప్పటికీ పరిస్థితులు అనుకూలంగానే మారిపోయాయి. తమ వద్ద వున్న క్షిపణులను తొలగిస్తామని చెప్పిన కిమ్‌జోన్ అంతలోనే మాటమార్చారు. అమెరికా తమపై ఒత్తిడి తెస్తుందని ఆరోపిస్తున్న ఆయన మళ్లీ కొత్త వివాదాన్ని తెరతీశారు. తమ అణ్వాయుధాలను వదులుకోవడం లేదని చెప్పడం ద్వారా ఇటు దక్షిణ కొరియాకే కాకుండా ఇతర దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరి కొత్త ఏడాదిలో ఉత్తర కొరియా ఎలాంటి విపరిణామాలకు ఆజ్యం పోస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.